Telugu Global
Business

ట్విట్టర్‌ కార్యాలయంలోకి మస్క్.. సీఈవో, సీఎఫ్‌వో ఔట్

ట్విట్టర్ కొనుగోలు పూర్తి కాగానే ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెను తమ పదవుల నుంచి తప్పించారు.

ట్విట్టర్‌ కార్యాలయంలోకి మస్క్.. సీఈవో, సీఎఫ్‌వో ఔట్
X

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. అక్టోబర్ 28లోగా ట్విట్టర్ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావాలనే తుది గడువు ఉన్నది. దీంతో ఒక రోజు ముందే ఆయన ట్విట్టర్‌ కొనుగోలు వ్యవహారం పూర్తి చేశారు. 44 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ పూర్తయినట్లు ఆయన ప్రకటించారు. గురువారం ట్విట్టర్ కార్యాలయంలోకి అడుగుపెట్టిన మస్క్.. ఆ తర్వాత తన హోదాను 'చీఫ్ ట్వీట్'గా మార్చుకున్నారు. అలాగే తన లొకేషన్‌ను ట్విట్టర్ కేంద్ర కార్యాలయంగా చూపెట్టారు. మొత్తానికి చర్చోపచర్చల తర్వాత మస్క్ ట్విట్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

ట్విట్టర్ కొనుగోలు పూర్తి కాగానే ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెను తమ పదవుల నుంచి తొలగించారు. ట్విట్టర్‌లో ఉన్న ఫేక్ అకౌంట్స్‌కు సంబంధించిన వివరాలను అందించడంతో తనను, ట్విట్టర్ ఇన్వెస్టర్లను వీళ్లు ముగ్గురు తప్పుదోవ పట్టించారని మస్క్ అంటున్నారు. ట్విట్టర్ డీల్ ముగిసే సమయంలో అగర్వాల్, సెగల్ ఇద్దరు కూడా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ ఆఫీస్‌లోనే ఉన్నారు. డీల్ ముగిసిన వెంటనే ఎస్కార్ట్ సాయంతో ఇద్దరినీ కార్యాలయం నుంచి పంపించి వేసినట్లు తెలుస్తున్నది.

మస్క్ రాకతో ట్విట్టర్‌లో పని చేస్తున్న 7,500 మంది ఉద్యోగులు తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ కూడా సంస్థలో భారీగా ఉద్యోగాల కోతలు ఉంటాయని చెప్పారు. ట్విట్టర్‌ను నేను మరింత డబ్బులు సంపాదించడానికి కొనలేదని.. నేను ప్రేమించే మనుషుల కోసం.. మానవాళికి సహాయం చేయడం కోసం కొన్నానని వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌లో ఉన్న స్పామ్ బోట్స్‌ను పూర్తిగా తీసేయాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వేదికకు సంబంధించిన అల్గారిథమ్స్‌ను కూడా మార్చేసి యూజర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. విద్వేషం, విభజనకు దూరంగా ట్విట్టర్‌లోని మనుషులు ఉండేలా మరింత మెరుగు పరుస్తానని మస్క్ చెప్పారు. ట్విట్టర్‌ను ఎవరు నడిపిస్తారు? ఎలా నడిపిస్తారనే విషయాలపై క్లారిటీ ఇవ్వకపోయినా.. పూర్తి మార్పులు అయితే జరుగుతాయని హింట్ ఇచ్చారు.

కాగా, ట్విట్టర్‌ను పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేశారు. ఇందుకు పలువురు బ్యాంకర్లతో భేటీ అయి 13 బిలియన్ డాలర్ల రుణాలను తీసుకున్నారు. ట్విట్టర్ కార్యాలయంలోకి అడుగు పెడుతూ ఒక సింకును మోసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసి తాను.. ప్రధాన కార్యాలయంలోకి అడుగు పెట్టానని పోస్టు చేశారు.

First Published:  28 Oct 2022 8:20 AM IST
Next Story