కెనడా ఆర్థిక వ్వస్థను కుప్పకూల్చడమే ట్రంప్ లక్ష్యం
మా దేశాన్ని అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవాలనే కుట్రలో ఇది ఒక భాగమని ట్రూడో వ్యాఖ్య

కెనడా దేశ ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు. కెనడా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చడానికే ఈ సుంకాలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. మా దేశాన్ని అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవాలనే కుట్రలో ఇది ఒక భాగమని వ్యాఖ్యానించారు. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు.
సుంకాలు తగ్గించే అవకాశం
మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై మంగళవారం నుంచి 25 శాతం సుంకాలు విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పందించారు. వాటిని తగ్గించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. సుంకాలు విధించిన తర్వాత నుంచి ఆ రెండు దేశాలు తనతో నిరంతరం సంప్రదింపులు చెస్తున్నాయని వెల్లడించారు. అధ్యక్షుడు దీన్ని అర్థం చేసుకున్నారు. బుధవారం దీన్ని ప్రకటించే అవకాశం ఉన్నదని లూట్నిక్ తెలిపారు. అయితే సుంకాల పెంపుపై ఆ దేశాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. అమెరికా ఎగుమతులపై సుంకాలు విధించాయి.