Top Safety Cars | బెస్ట్ సేఫ్టీ ఫీచర్లకు మారుపేరు ఈ ఐదు కార్లు..
Top 5 Safety Cars | అడాస్ (ADAS).. అంటే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System) ఇప్పుడు కార్ల తయారీలో కీలకంగా మారింది.
Top Safety Cars | రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు మూల మలుపులు, బ్లాక్ పాయింట్లు.. వస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వెహికల్స్ వేగంగా దూసుకొస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కారు లేదా బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గానీ ప్రమాదాలు తప్పించలేం. ఇటీవలే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కనుక డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించినా ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుపై ఎక్కడ ఏం ఉంటుందో ముందే తెలుసుకునేలా సేఫ్టీ ఫీచర్లు ఉండటం తప్పనిసరి. కార్ల తయారీలో సేఫ్టీ ఫీచర్లకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది.
అడాస్ (ADAS).. అంటే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System) ఇప్పుడు కార్ల తయారీలో కీలకంగా మారింది. కారు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్, ఇతర ప్రయాణికులకు భద్రత కల్పిస్తుంది అడాస్ (ADAS). అడాస్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి. అడాస్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టాప్-5 కార్ల గురించి తెలుసుకుందామా.. !
హోండా సిటీ ధరెంతంటే..
తొలిసారి కెమెరా బేస్డ్ అడాస్ సిస్టమ్ గల హోండా సిటీ హైబ్రీడ్ (Honda City hybrid) ధర రూ.18.89 లక్షలు. ఈ కారులో లేన్ కీపింగ్ అసిస్ట్, కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్ బీమ్ అడ్జస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ తర్వాత హోండా సిటీ హైబ్రీడ్- వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లలోనూ అడాస్ వ్యవస్థ జత కలిశారు. హోండా సిటీ ఫిప్త్ జనరేషన్ కారు రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. అడాస్ (ADAS) సిస్టమ్ గల హొండా సిటీ కారు `హోండా సెన్సింగ్ (Honda Sensing) అని పిలుస్తుంది.
హ్యుండాయ్ సెడాన్ వెర్నా
హోండా సిటీ దారిలో దేశంలో అడాస్ వ్యవస్థ కలిగి ఉన్న రెండో మిడ్ సైజ్ సెడాన్ హ్యుండాయ్ వెర్నా. అడాస్ వ్యవస్థ గల వెర్నా కారును `హ్యుండాయ్ స్మార్ట్ సెన్స్ అని పిలుస్తారు. ఎస్ ఎక్స్ (ఓ) ట్రిమ్‌లో అడాస్ వ్యవస్థ అమర్చారు. ఈ కారు ధర రూ.14.65 లక్షల (ఎక్స్ షోరూమ్ ధర) నుంచి మొదలవుతుంది. ఈ కారులో ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొల్లిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ మోటార్ ఆస్టర్
ఎంజీ మోటార్ ఆస్టర్ టాప్ ఎండ్ సావీ వేరియంట్ `అడాస్` కలిగి ఉంది. ఈ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.16,99,800 నుంచి ప్రారంభం అవుతుంది. ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ డాష్‌బోర్డుపై పర్సనల్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అసిస్టెంట్ రొబోట్ ఉంటుంది. వివిధ అంశాలపై సమాచారం అందజేస్తుందీ ఏఐ అసిస్టెన్స్. అటానమస్ లెవల్ 2 ఫీచర్ల కోసం షార్ప్ వేరియంట్లో అడాస్ ప్యాకేజీ ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది.
రూ.15-24 లక్షల మధ్య టాటా హారియర్
టాటా మోటార్స్ హారియర్ ధర రూ.15 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉంటుంది. ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అండ్ రేర్ కొల్లిషన్ వార్నింగ్ వంటి అడాస్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
ఎక్స్‌యూవీ700లో తొలిసారి అడాస్
మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700 కారులో అడాస్ సిస్టమ్ జత చేశారు. ఇందులో ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. టాప్ ఆఫ్ లైన్ వేరియంట్లు ఏఎక్స్7, ఎఎక్స్7ఎల్ వేరియంట్లలో మాత్రమే ఈ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ధర రూ.19.44 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.