Top SUV Cars | హ్యుండాయ్ క్రెటాను బీట్‌చేసిన స్కార్పియో.. టాప్‌లో టాటా నెక్సాన్..
Top SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న వినియోగదారులు.. విశాలంగా ఉండే ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు.
Top SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న వినియోగదారులు.. విశాలంగా ఉండే ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇటీవల ఎస్‌యూవీ కార్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవంబర్‌లోనూ ఎస్‌యూవీ కార్ల సేల్స్‌లో పోటీ పెరుగుతోంది. ఎస్‌యూవీ కార్ల విక్రయంలో మారుతి సుజుకి వాటా పెరిగినా.. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తొలిసారి రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. దేశీయ ఎస్‌యూవీ కార్లల్లో బెస్ట్ సెల్లర్ హ్యుండాయ్ క్రెటాను దాటేసింది మహీంద్రా అండ్ మహీంద్రా ఐకానిక్ స్కార్పియో ఎస్‌యూవీ. నవంబర్‌లో అమ్ముడైన టాప్-5 ఎస్‌యూవీల్లో మహీంద్రా వారి స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ నిలిచాయి. టాప్-10 ఎస్‌యూవీ కార్లలో అగ్రస్థానంలో నిలిచింది టాటా నెక్సాన్. టాప్-10 ఎస్‌యూవీ మోడల్ కార్లలో తొలిసారి హ్యుండాయ్ ఎక్స్‌టర్ నిలిచింది. గత నెలలో అమ్ముడైన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
అత్యంత పాపులర్ మోడల్ టాటా నెక్సాన్
టాటా మోటార్స్ గత సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ నెక్సాన్ కారు.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత పాపులర్ మోడల్ కారుగా నిలిచింది. గత నెలలో టాటా నెక్సాన్-2023 మోడల్ కార్లు 14,916 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది నవంబర్ సేల్స్‌తో పోలిస్తే ఆరు శాతం పెరిగాయి. ఫెస్టివ్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్)లో నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కార్లు 31 వేల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
టాటా పంచ్ ఇలా
నవంబర్ నెల ఎస్‌యూవీ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి బ్రెజా తర్వాతీ స్థానం టాటా పంచ్‌ది. బుల్లి ఎస్‌యూవీ మోడల్ కారు టాటా పంచ్ గత నెలలో 14,383 యూనిట్లు విక్రయించింది. గతేడాది 12,131 యూనిట్ల విక్రయంతో పోలిస్తే సుమారు 19 శాతం వృద్ధి చెందింది. త్వరలో భారత్ మార్కెట్లో టాటా మోటార్స్ `టాటా పంచ్ ఈవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నది. ఫెస్టివ్ సీజన్‌లో గత అక్టోబర్ విక్రయాల్లో టాటా పంచ్ 15,217 యూనిట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ సేల్స్‌తో పోలిస్తే గత నెలలో గణనీయంగా పంచ్ కార్ల విక్రయాలు తగ్గాయి.
టాప్ మోడలైనా తగ్గిన బ్రెజా సేల్స్
దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎస్‌యూవీ కార్ల తయారీలోనూ మేటి. మారుతి ఎస్‌యూవీ కార్లలో బ్రెజా అత్యంత పాపులర్ మోడల్. 2022 నవంబర్‌లో కార్ల విక్రయాలతో పోలిస్తే 18 శాతం పెరిగాయి. గత నెలలో మారుతి బ్రెజా 13,393 యూనిట్లు విక్రయించింది. ఫెస్టివ్ సీజన్‌లో గత అక్టోబర్‌లో 16,050 కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌లో అమ్ముడైన 15,001 యూనిట్లతో పోలిస్తే గత నెల విక్రయాలు తగ్గాయి.
90 శాతం పెరిగిన మహీంద్రా స్కార్పియో సేల్స్
దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో సేల్స్ గతేడాది నవంబర్‌తో పోలిస్తే 90 శాతం వృద్ధి చెందాయి. మహీంద్రా స్కార్పియోలో స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ వర్షన్ కార్లు గత నెలలో 12,185 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది నవంబర్‌లో స్కార్పియో కార్లు కేవలం 6,455 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత అక్టోబర్‌లో 13,578 యూనిట్ల స్కార్పియో కార్లు కస్టమర్లకు మహీంద్రా డెలివరీ చేసింది. మార్కెట్లోకి ఎంటరైనప్పటి నుంచి తొలిసారి కంపాక్ట్ ఎస్‌యూవీలు.. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడల్ కార్లను దాటేసింది మహీంద్రా స్కార్పియో.
బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ హ్యుండాయ్ క్రెటా
దేశీయ కంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో బెస్ట్ మోడల్‌గా నిలిచింది హ్యుండాయ్ క్రెటా. కానీ తొలిసారి గత నెలలో హ్యుండాయ్ క్రెటాను మహీంద్రా స్కార్పియో మోడల్ కారు దాటేసింది. గత నెలలో హ్యుండాయ్ క్రెటా 11,264 యూనిట్లు మాత్రమే విక్రయించింది. 2022 నవంబర్‌తో పోలిస్తే 25 శాతం సేల్స్ తగ్గాయి. అడాస్ టెక్నాలజీతో కొనుగోలుదారులను ఆకర్షించినా ఫెస్టివ్ సీజన్‌లో గత నెలలో 12,362 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించినప్పటి నుంచి గత అక్టోబర్ సేల్స్ గరిష్టం.
బ్రెజా.. నెక్సాన్ తర్వాతీ స్థానం వెన్యూదే
టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజాతో హ్యుండాయ్ వెన్యూ పోటీ పడుతూనే ఉంది. గత నెలలో హ్యుండాయ్ వెన్యూ సేల్స్ నాలుగు శాతం వృద్ధి చెంది 11,180 యూనిట్లకు పెంచుకున్నది. అక్టోబర్ నెలలో 11,581 యూనిట్లు విక్రయించిన హ్యుండాయ్ వెన్యూ.. నికరంగా తన స్థానాన్ని కాపాడుకుంటూనే ఉంది.
మారుతి సుజుకి సేల్స్‌లో ఫ్రాంక్స్ ఇలా
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో ఆధారంగా డిజైన్ చేసిన మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్.. సేల్స్‌లోనూ తనదైన శైలిలో దూసుకెళ్తోంది. ఎస్‌యూవీల్లో మారుతి గణనీయ వాటా పొందడంలోనూ ఫ్రాంక్స్ కీలకం. గత నెలలో మారుతి ఫ్రాంక్స్ 9867 యూనిట్లు విక్రయించింది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో విక్రయించిన 11,357 కార్ల కంటే తక్కువ.
గ్రాండ్ విటారాను బీట్ చేసిన బొలెరో
మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ గ్రాండ్ విటారా.. కానీ, గత నెల విక్రయాల్లో గ్రాండ్ విటారాను బ్రేక్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో. గత నెలలో బొలెరో, బొలెరో నియో మోడల్ కార్లు 9,333 అమ్ముడయ్యాయి. 2022 నవంబర్ సేల్స్‌తో పోలిస్తే 15 శాతానికి పై చిలుకే. పండుగల సీజన్‌లో గత అక్టోబర్‌లో బొలెరో, బొలెరో నియో కార్లు 9,647 యూనిట్లు విక్రయించింది. వచ్చే ఏడాది అప్‌డేటెడ్ బొలెరో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది.
ఇలా హ్యుండాయ్ ఎక్స్‌టర్
టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లకు పోటీగా హ్యుండాయ్ మోటార్ ఇండియా తెచ్చిందే ఎక్స్‌టర్. పంచ్, ఫ్రాంక్స్‌లతోపాటు టాప్ ఎస్‌యూవీ కార్లతో పోటీ పడుతూ హ్యుండాయ్ ఎక్స్‌టర్ `టాప్ 10`లో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన హ్యుండాయ్ ఎక్స్‌టర్.. కస్టమర్ల మనస్సులు చూరగొనడంతో అత్యంత పాపులర్ మోడల్‌గా అవతరించింది. గత నెలలో 8,325 యూనిట్లు అమ్మడయ్యాయి. ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ లక్షకు పైగా కార్లు బుకింగ్ అయ్యాయి.