5జీ ఫోన్లు కొనేముందు ఇవి చెక్ చేయాలి..
5జీ మొబైల్స్ రూ.పది వేల నుంచి అరవై వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరకే 5జీఫోన్ వస్తుందని కొనుగోలు చేస్తే డబ్బులు వృథా అయ్యే అవకాశం ఉంది.

దేశంలో త్వరలోనే 5జీ సేవలు మొదలవ్వబోతున్నాయి. టెలికాం కంపెనీలు కూడా 5జీ కోసం రెడీ అవుతున్నాయి. 5జీ సేవలు ముందుగా నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే 5జీ వస్తే పాత మొబైల్స్ పనిచేస్తాయా? కొత్త మొబైల్ కొనాలా అన్నసందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.
5జీ సేవలను పొందాలంటే 5జీని సపోర్ట్ చేసే మొబైల్ వాడాల్సి ఉంటుంది. దాని కోసం 5జీ మొబైల్స్‌కు అప్‌డేట్ అవ్వాలి. పది వేల నుంచి అరవై వేల వరకూ అన్నిరకాల ధరల్లో 5జీ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే 5జీ ఫోన్ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకే 5జీఫోన్ వస్తుందని కొనుగోలు చేస్తే డబ్బులు వృథా అయ్యే అవకాశం ఉంది. 5జీ ఫోన్ కొనేముందు ఏమేం తెలుసుకోవాలంటే..
5జీ ఫోన్ కొనుగోలు చేసే ముందు ఏ టెలికాం కంపెనీ ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిందో తెలుసుకోవాలి. దేశంలో మొత్తం 10 బ్యాండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జియో 700 MHz, 800 MHz, 1800 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 24.740 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని వేలంలో సంపాదించింది. ఎయిర్‌టెల్ 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 19.86 GHz స్పెక్ట్రాన్ని వేలంలో దక్కించుకుంది. వొడాఫోన్ ఐడియా 1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 6.22 GHz స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది. ఇప్పడొస్తున్న స్మార్ట్‌ఫోన్లలో దాదాపు అన్ని ఫోన్లూ 5జీకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే అన్ని ఫోన్లు అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఫోన్ కొనేముందు అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. మొబైల్ ఫోన్లు 'ఎన్' అనే అక్షరంతో బ్యాండ్లను తెలియజేస్తాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కొనుగోలు చేసిన బ్యాండ్లు 700 MHz (N28), 800 MHz (N20), 900 MHz (N8), 1800 MHz (N3), 2300 MHz (N30/N40), 2500 MHz (N41), 3300 MHz (N78), 26 GHz (N258)గా ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న రూ.20 వేల పై బడ్జెట్‌లో ఉండే ఫోన్లు దాదాపు అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేస్తాయి. కనీసం 8 నుంచి 12 బ్యాండ్లు సపోర్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని మొబైల్స్ కేవలం ఒకట్రెండు బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. వీటితో 5జీ సేవలను పొందడద కష్టం. మార్కెట్లో 5జీ ఫోన్ల సందడి ఇప్పుడే మొదలైంది కాబట్టి కొద్ది రోజులయ్యాక వీటి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. అలాగే, 5జీ నెట్‌వర్క్‌కు ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. కాబట్టి ఫోన్ కొనాలనుకునేవారు ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ ఉండేలా చూసుకోవడం మంచిది.