యాప్స్ నుంచి లోన్స్ తీసుకునేముందు ఇవి తెలుసుకోండి!
యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేవాళ్లు ముందు ఆ యాప్ ఏ సంస్థకు చెందినది? యాప్ నమ్మదగినదేనా? అన్న విషయాలు చెక్ చేసుకోవాలి.
ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఇప్పుడు బ్యాంకులే లోన్స్ కావాలా.. అంటూ కస్టమర్ల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా రకరకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఐదు నిముషాల్లో లోన్ అప్రూవ్ అయ్యి అకౌంట్‌లో డబ్బు కూడా పడుతుంది. అయితే ఇలాంటి లోన్స్ మంచివేనా? వీటిని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీలైనంత త్వరగా లోన్ పొందాలనుకునేవాళ్లు ఇన్‌స్టంట్ లోన్స్‌ను ఆశ్రయిస్తుంటారు. పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు పలు యాప్స్ కూడా లోన్స్‌ను అందజేస్తున్నాయి. వీటి ద్వారా లోన్స్ పొందేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..
యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేవాళ్లు ముందు ఆ యాప్ ఏ సంస్థకు చెందినది? యాప్ నమ్మదగినదేనా? అన్న విషయాలు చెక్ చేసుకోవాలి. యాప్ డీటెయిల్స్‌లోకి వెళ్లి లేదా గూగుల్‌లో సెర్చ్ చేసి దాని పేరెంట్ కంపెనీ వివరాలు తెలుసుకోవచ్చు. అలా సంస్థ మంచిదా? కాదా? ఆర్‌బీఐలో రిజిస్టర్ అయ్యిందా? లేదా? వంటి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే లోన్ ఇచ్చే యాప్స్‌ను కేవలం ప్లే స్టోర్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
లోన్ తీసుకునే తొందరలో చాలామంది టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగా చదవరు. దీనివల్ల తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ బ్యాంకులతో పోలిస్తే.. లోన్ యాప్స్‌కు ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ భిన్నంగా ఉండొచ్చు. రీపేమెంట్స్, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ క్లోజర్ ఛార్జీలు, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా కొన్ని రూల్స్ బ్యాంకులకు భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి అవన్నీ పూర్తిగా చదివిన తర్వాతే లోన్‌కు అప్లై చేయాలి.
యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేముందు ఆయా సంస్థల కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్, కస్టమర్ సపోర్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. రీపేమెంట్ లేదా డాక్యుమెంటేషన్.. ఇలా లోన్‌కు సంబంధించి ఏదైనా సమస్య వస్తే సంస్థ స్పందిస్తుందో లేదో రివ్యూల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.