Tata Tech IPO | 20 ఏండ్ల తర్వాత టాటా ఐపీవో.. టాటా టెక్ ఐపీవో విలువెంతంటే..?!
Tata Technologies IPO | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ఐపీఓ (IPO) కు వస్తోంది. ఈ నెల 22 నుంచి మొదలై 24 వరకూ కొనసాగుతుంది.
Tata Tech IPO | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ఐపీఓ (IPO) కు వస్తోంది. ఈ నెల 22 నుంచి మొదలై 24 వరకూ కొనసాగుతుంది. 2004లో భారత్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత టాటా సన్స్ నుంచి ఐపీవోకు రావడం ఇదే మొదటిసారి. టాటా మోటార్స్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు కార్ల తయారీ సంస్థలకూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజిటల్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తోంది టాటా టెక్నాలజీస్ (Tata Technologies). దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా సన్స్ అనుబంధ సంస్థ ఐపీఓకు వస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో (Tata Technologies IPO) షేర్ విలువ ఖరారు చేసింది. ఈక్విటీ షేర్ విలువ రూ.475-500గా నిర్ణయించారు.
ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద టాటా టెక్నాలజీస్ ఐపీఓ సాగనున్నది. ప్రమోటర్‌గా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) తోపాటు ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ (Alpha TC Holdings), టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ (Tata Capital Growth Fund) షేర్లు విక్రయిస్తాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద టాటా టెక్నాలజీస్ (Tata Technologies)లో టాటా మోటార్స్ 4.62 కోట్ల షేర్లు, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 97.1 లక్షల షేర్లు, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48 లక్షల షేర్ల వరకు విక్రయిస్తుందని తెలుస్తున్నది. ఇంతకుముందు 9.57 కోట్ల షేర్లు ఐపీవోకు వెళతాయని ప్రకటించినా, తాజాగా 6.08 కోట్లకు పరిమితం చేశారు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కనీసం 30 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాలి. ఈ ఐపీఓ ద్వారా రూ.2,890 కోట్ల నుంచి రూ.3,042 కోట్ల మధ్య పెట్టుబడులు సేకరించాలని టాటా టెక్నాలజీస్ వ్యూహం. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కనీసం రూ.15 వేలు, నాన్ ఇన్‌స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.2.10 లక్షలు, క్వాలిఫైడ్ ఇన్‌స్ట్యూషనల్ బయ్యర్లు రూ.10.05 లక్షల విలువైన షేర్లు కొనుగోలు చేయాలి. ఈ ఐపీఓలో టాటా టెక్నాలజీస్ ఉద్యోగుల కోసం 20,28,343 ఈక్విటీ షేర్లు కేటాయించారు.
టాటా టెక్నాలజీస్ (Tata Technologies) కంపెనీ డిజైన్, టియర్ డౌన్, బెంచ్ మార్కింగ్, వెహికల్ ఆర్కిటెక్చర్, బాడీ అండ్ చేసిస్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, డయాగ్నస్టిక్స్ సేవలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 18 గ్లోబల్ డెలివరీ కేంద్రాల్లో 11 వేల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. ఐపీఓకు అనుమతి ఇవ్వాలని సెబీకి టాటా టెక్నాలజీస్ గత మార్చిలో దరఖాస్తు చేయగా, జూన్‌లో అనుమతి వచ్చింది.
టాటా మోటార్స్‌లో అర్హులైన షేర్ హోల్డర్లకు 10 శాతం కోటా షేర్లు రిజర్వు చేశారు. టాటా మోటార్స్ వారికి షేర్ విలువ రూ.7.40 కాగా, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ ఐ ఇన్వెస్టర్లకు రూ.25.10 చొప్పున షేర్ కేటాయిస్తామని సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)లో వెల్లడించింది టాటా టెక్నాలజీస్.
జేఎం ఫైనాన్సియల్ (JM Financial), సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా (Citigroup Global Markets India) , బీఓఎఫ్ఎ సెక్యూరిటీస్ ఇండియా సంస్థలు టాటాటెక్నాలజీస్ ఐపీవో లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. లింక్ ఇన్‌టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఖరారు చేశారు.
టీపీజీ క్లైమేజ్ సుమారు 9 శాతం వాటా కొనుగోలు చేసిన తర్వాత టెక్నాలజీస్ విలువ 200 కోట్ల డాలర్లు (రూ.16,300 కోట్లు). గతేడాది డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో టాటా టెక్నాలజీస్ ఆదాయం 15శాతం వృద్ధి చెంది రూ.3,052 కోట్లకు చేరుకున్నది. మొత్తం ఆదాయంలో సర్వీస్ సెక్టార్‌దే 88 శాతం, కంపెనీ నికర లాభం రూ.407 కోట్లు.
షేర్ మార్కెట్లలో లిస్టింగ్ : డిసెంబర్ 5
డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల క్రెడిట్ : డిసెంబర్ 4
ఫండ్స్ అనుబ్లాక్, రీఫండ్స్ : డిసెంబర్ 12
నవంబర్ 30న ప్రాథమికంగా షేర్ల కేటాయింపు.