Telugu Global
Business

SUV Cars | కార్ల విక్ర‌యాల్లో ఆల్‌టైం గ‌రిష్ట రికార్డ్‌.. స‌గానికి పైగా ఎస్‌యూవీలే..!

SUV Cars | ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 40 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు అమ్ముడ‌వ్వ‌డం ఇదే తొలిసారి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం కార్ల విక్ర‌యాల్లో 8.7 శాతం వృద్ధిరేటు న‌మోదైంది.

SUV Cars | కార్ల విక్ర‌యాల్లో ఆల్‌టైం గ‌రిష్ట రికార్డ్‌.. స‌గానికి పైగా ఎస్‌యూవీలే..!
X

SUV Cars | క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా ఉండే ఎస్‌యూవీ కార్ల‌పై అంద‌రూ మోజు పెంచుకుంటున్నారు. ఇంత‌కుముందుతో పోలిస్తే గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24) కార్ల విక్ర‌యాల్లో స‌గానికి పైగా ఎస్‌యూవీలే అమ్ముడ‌య్యాయి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 40 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు అమ్ముడ‌వ్వ‌డం ఇదే తొలిసారి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం కార్ల విక్ర‌యాల్లో 8.7 శాతం వృద్ధిరేటు న‌మోదైంది. 2022-23లో 38.90 ల‌క్ష‌ల కార్లు అమ్ముడైతే గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 42,29,566 కార్లు అమ్ముడు పోయాయి. కార్ల విక్ర‌యాల్లో మూడో స్థానంలో ఉంది. చైనా, అమెరికా త‌ర్వాత భార‌త్‌లో అత్య‌ధికంగా కార్లు అమ్ముడ‌వుతున్నాయి. భార‌త్ త‌ర్వాత స్థానంలో జ‌పాన్ నిలిచింది.

గ‌త నెల కార్ల విక్ర‌యాల్లో 10 శాతం గ్రోత్ న‌మోదైంది. 2023 మార్చిలో 3,36,566 యూనిట్లు అమ్ముడు కాగా, 2024 మార్చిలో 3,70,381 యూనిట్ల కార్లు అమ్ముడు పోయాయి. కార్ల మార్కెట్‌లోనే గ‌త నెల‌లో మెరుగైన విక్ర‌యాలు న‌మోద‌య్యాయి. ఇక 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు 50.4 శాతం న‌మోద‌య్యాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ 27.8 శాతం, సెడాన్ కార్లు తొమ్మిది శాతానికి ప‌రిమితం అయ్యాయి. మ‌ల్టీ ప‌ర్పస్ వెహిక‌ల్ (ఎంపీవీ) సెగ్మెంట్ 9.3 శాతం, వ్యాన్ సెగ్మెంట్ 3.5 శాతం కార్లు అమ్ముడ‌య్యాయి.

కొన్నేండ్లుగా ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో 32 శాతం, 2021-22లో 40.1 శాతం, 2022-23లో 43 శాతం ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు జ‌రిగాయి.

ఇక గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి, హ్యుండాయ్‌, టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా నిలిచాయి. దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి 9.5 శాతం వృద్ధితో 17,59,881 కార్లు విక్ర‌యించింది. 2023-24లోనే అత్య‌ధికంగా అమ్ముడైన కారుగా వ్యాగ‌న్ఆర్ నిలిచింది. టాప్ బెస్ట్-10 కార్ల కార్ల‌లో ఆరు, 15 బెస్ట్ కార్ల‌లో 10 మోడ‌ల్ కార్లు మారుతి సుజుకివేన‌ని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ‌శాంక్ శ్రీవాత్స‌వ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో మారుతి సుజుకి 11 శాతం ఎస్‌యూవీ కార్లు విక్ర‌యిస్తే, 2023-24లో 21 శాతానికి పెరిగింది. న్యూ ఫ్రాంక్స్‌, బ్రెజా, గ్రాండ్ విటారా మోడ‌ల్ కార్ల‌తో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం స్ఫూర్తిదాయ‌కంగా ఎస్‌యూవీ కార్లు పెరిగిపోయాయి. మార్చి నెలాఖ‌రు నాటికి 1.98 ల‌క్ష‌ల ఆర్డ‌ర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 70 వేలు ఎర్టిగా, 8,000 గ్రాండ్ విటారా మోడ‌ల్ కార్ల ఆర్డ‌ర్లు పెండింగ్‌లో ఉన్నాయి.

మారుతి సుజుకి త‌ర్వాత స్థానంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా నిలిచింది. 2022-23 త‌ర్వాత 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో 8.3 శాతం విక్ర‌యాలు పెంచుకుని 6,14,721 యూనిట్ల‌కు చేరుకున్నాయి. 2022-23 హ్యుండాయ్ ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు 53 శాతం ఉంటే, 2023-24లో 63 శాతానికి చేరాయ‌ని కంపెనీ సీఓఓ త‌రుణ్ గార్గ్ చెప్పారు. 2022-23తో పోలిస్తే 2023-24లో హ్యుండాయ్ ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు 28.9 శాతం పెరిగి 3,88,725 యూనిట్ల‌కు చేరాయి. మార్కెట్‌లో హ్యుండాయ్ ఎస్‌యూవీ కార్ల వాటా 18.1 శాతంగా ఉంది. హ్యుండాయ్ క్రెటా 1,62,773 యూనిట్లు, వెన్యూ 1,28,897 యూనిట్లు విక్ర‌యించింది. తాజాగా ఎక్స్‌ట‌ర్, క్రెటా ఫేస్‌లిఫ్ట్‌, క్రెటా ఎన్ లైన్ మోడ‌ల్ ఎస్‌యూవీ కార్లు ఆవిష్క‌రించింది. హ్యుండాయ్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ ఐకానిక్ 5 మోడ‌ల్ కార్లు 1,400 యూనిట్లు విక్ర‌యించింది.

టాటా మోటార్స్ వ‌రుస‌గా మూడో ఏటా అత్య‌ధికంగా కార్లు విక్ర‌యించింది. నెక్సాన్ వంటి ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాల‌తో టాటా మోటార్స్ సేల్స్ ఆరు శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో 5,70,955 యూనిట్లు విక్ర‌యించింది టాటా మోటార్స్‌. దేశీయ కార్ల త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా సైతం టాప్-5లో నిలిచింది. స్కార్పియో, స్కార్పియో ఎన్‌, స్కార్పియో క్లాసిక్‌, ఎక్స్‌యూవీ700, థార్‌, బొలెరో విక్ర‌యాల్లోనూ గ‌ణ‌నీయ పురోగ‌తి న‌మోదైంది. 2022-23లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా 3,59,253 కార్లు విక్రయిస్తే, 4,59,877 యూనిట్లు విక్ర‌యించింది.

First Published:  3 April 2024 8:19 AM GMT
Next Story