Sovereign Gold Bond | నేటి నుంచే సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ.. రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసా?!
Sovereign Gold Bond | బంగారం అంటే ప్రతి ఒక్కరికీ.. అందునా భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు, పర్వదినాలు.. ప్రధానంగా పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలకు వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవాలని, ఆ వేడుకలో వాటిని ధరించాలని ఆశ పడతారు.
Sovereign Gold Bond | బంగారం అంటే ప్రతి ఒక్కరికీ.. అందునా భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు, పర్వదినాలు.. ప్రధానంగా పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలకు వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవాలని, ఆ వేడుకలో వాటిని ధరించాలని ఆశ పడతారు. అవకాశం లేకుంటే ఉన్న ఆభరణాలే ధరించడానికి మొగ్గుతుంటారు.. కానీ బంగారం 99 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అలా దిగుమతి చేసుకోవడం వల్ల సుంకం భారీగా చెల్లించాల్సి వస్తుంది.. వాణిజ్య లోటుకు కూడా కారణమవుతున్నది. అందుకే ఫిజికల్ బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పర్చడానికి కేంద్రం 2015-16లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభించింది. నాటి నుంచి ప్రతి ఏటా దపదఫాలుగా బంగారం బాండ్లను విక్రయిస్తూనే ఉంది కేంద్రం.. కేంద్రం తరపున భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ బాండ్లను విడుదల చేస్తుంది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోమవారం నుంచి రెండో విడత సావరిన్ బంగారం బాండ్లు విడుదల చేస్తుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి గల వారు సోమవారం నుంచి ఈ నెల 15 వరకూ బాండ్లు కొనుక్కోవచ్చు.
తాజాగా జారీ చేసిన సావరిన్ బంగారం బాండ్ (గ్రామ్) విలువ రూ.5,293గా నిర్ణయించింది ఆర్బీఐ. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీపై కేటాయిస్తారు. బాండ్ రిలీజ్ చేయడానికి ఒక వారం ముందు ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ నిర్ణయించిన ధరను బాండ్లకు ఖరారు చేస్తారు. దీని ప్రకారం ఒక గ్రామ్ విలువ గల బంగారం బాండ్ విలువ రూ.5873. సావరిన్ గోల్డ్ బాండ్లలో (24 క్యారట్ల బంగారం లేదా 99.9 స్వచ్ఛత)పై పెట్టుబడి పెట్టినట్లేనని బులియన్ వర్గాలు తెలుపుతున్నాయి. ఉదాహరణకు మీరు ఐదు గ్రాముల విలువ గల బంగారం బాండ్ కొనుగోలు చేశారనుకుందాం.. అంతే విలువ గల బాండ్లను ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్లపై ప్రతిఏటా 2.5 శాతం గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. తర్వాతీ కాలంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఇదే బాండ్లపై రుణం కూడా పొందొచ్చు.
2015-16లో సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రారంభించినప్పుడు నాడు గ్రామ్ బాండ్ విలువ రూ.2684. అప్పుడూ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీ కల్పించడంతో బాండ్ విలువ రూ.2634. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బాండ్ కొనుగోలు విలువ గ్రామ్‌పై రూ.5873. అంటే ఎనిమిదేండ్లలో సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులపై 120 శాతం రిటర్న్స్ పెరిగాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక గ్రామ్ నుంచి నాలుగు కిలోల వరకూ బంగారం బాండ్లపై పెట్టుబడులు పెట్టొచ్చు. జాయింట్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా ఫస్ట్ అప్లికెంట్ కేవలం నాలుగు కిలోల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రస్ట్‌లు 20 కిలోల విలువ వరకూ బాండ్లపై పెట్టుబడులు పెట్టొచ్చు.
ఈ బంగారం బాండ్లు ఎనిమిదేండ్ల మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉంటాయి. మెచ్యూరిటీ పరిమితి దాటిన తర్వాత వచ్చే రిటర్న్స్‌పై పన్ను రాయితీ క్లయిమ్ చేసుకోవచ్చు. కానీ, ఐదేండ్ల తర్వాత బాండ్లు విక్రయిస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాల మీద పన్ను (ఎల్టీజీసీ) రూపంలో 20.80 శాతం పన్ను వసూలు చేస్తారు. బులియన్ నిపుణులు బంగారం బాండ్లపై పెట్టుబడులు పెట్టడం బెటర్ అంటున్నారు. సరైన రిటర్న్స్ హామీ ఉంటుంది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకూ పెట్టుబడులు కొనసాగిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు బులియన్ నిపుణులు.