Telugu Global
Business

ప్లాస్టిక్‌ దుస్తులు సీసాలతో చొక్కాలు

ఎనిమిది పెట్‌ బాటిల్స్‌ ఉంటే ఒక టీ షర్ట్‌ రెడీ.

ప్లాస్టిక్‌ దుస్తులు సీసాలతో చొక్కాలు
X

ఎనిమిది పెట్‌ బాటిల్స్‌ ఉంటే ఒక టీ షర్ట్‌ రెడీ. ఇరవై – ముప్పై బాటిల్స్‌ ఉంటే జాకెట్, బ్లేజర్‌ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. ఈ నిజాన్ని నిరూపిస్తున్నారు తమిళ యువకుడు సెంథిల్‌ శంకర్‌.

చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్‌ శంకర్‌ మెకానికల్‌ ఇంజనీర్‌. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్‌ రీసైకిల్‌ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్‌ క్లోతింగ్‌. ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఇంతకీ సీసాలతో చొక్కాలు ఎలా చేస్తారంటే... సెంథిల్‌ ఏం చెప్పాడో చూడండి.

బాటిల్‌ కరిగి దారమవుతుంది!

‘‘పెట్‌ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్‌లు తొలగించిన తర్వాత క్రషింగ్‌ మెషీన్‌లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్‌ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్‌ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్‌ అని సెర్చ్‌ చేయండి’’ అంటున్నాడు.

నిమిషానికో మిలియన్‌

ఎందుకిలా చేస్తున్నావంటే ఇది పర్యావరణ పరిరక్షణలో నా వంతు బాధ్యత అంటున్నాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసే ప్లాస్టిక్‌ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్‌ ఉంటున్నట్లు ఫోర్బ్స్‌ చెప్తోంది. ఒక బాటిల్‌ డీకంపోజ్‌ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయి. వర్షం కురిసినప్పుడు కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయి. నా బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరిస్తున్నాను. రోజుకు 15 లక్షల బాటిళ్లను రీసైకిల్‌ చేస్తున్నాను. అందరూ రీసైకిల్‌ ప్రక్రియలో పాలు పంచుకోండి’’ అని పిలుపునిస్తున్నాడు సెంథిల్‌ శంకర్‌.

First Published:  8 July 2023 3:54 PM
Next Story