Telugu Global
Business

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు

వాస్తవానికి ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయాలని భావించాను. కానీ ఏప్రిల్‌ ఫూల్‌ అనే మీమ్స్‌ బారిన పడలేను అన్న అమెరికా అధ్యక్షుడు

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు
X

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గురించి ఆయన చెప్పారు. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్లు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా పలు దేశాలపై విధిస్తున్న సుంకాల అంశాన్నీ ట్రంప్‌ ప్రస్తావించారు. భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని వెల్లడించారు.

కొన్ని దేశాలు దశాబ్దాల పాటు మాపై టారిఫ్‌లు విధిస్తున్నాయి. ఇప్పుడు మా సమయం వచ్చింది. సగటున చూస్తే.. ఐరోపా సమాఖ్య, చైనా,బ్రెజిల్‌, భారత్‌ వంటి చాలా దేశాలు మా నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయి. భారత్‌ మాపై 100 శాతానికి పైగా ఆటో టారిఫ్‌లు విధించింది. ప్రస్తు వ్యవస్థలపై అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకే ఏప్రిల్‌ 2 నుంచి ఆయా దేశాలపై మేం కూడా ప్రతికార సుంకాలు విధిస్తాం. వాళ్లు ఎంత విధిస్తే మేమూ అంతే వసూలు చేస్తాం. వీటివల్ల అమెరికా మరింత సంపన్నంగా మారుతుంది. గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయాలని భావించాను. కానీ ఏప్రిల్‌ ఫూల్‌ అనే మీమ్స్‌ బారిన పడలేను అని ట్రంప్‌ వెల్లడించారు.

అమెరికా ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజు పోరాడుతున్నాను. అలాగే సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌నకు ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణమంతా హోరెత్తింది.

First Published:  5 March 2025 10:42 AM IST
Next Story