Telugu Global
Business

రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ.. సెప్టెంబర్ 30లోగా మార్పిడికి అవకాశం

దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది.

రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ.. సెప్టెంబర్ 30లోగా మార్పిడికి అవకాశం
X

రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కెట్ నుంచి రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొన్నది. రూ.2వేల నోట్లు ఎవరైనా కలిగి ఉంటే సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2019-19 ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపి వేశామని.. ఇకపై వాటి చలామణి కూడా ఉండబోదని ఆర్బీఐ పేర్కొన్నది.

దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. 'క్లీన్ నోట్ పాలసీ‌లో భాగంగా రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నాము. ప్రస్తుతానికి ఆ నోట్లు లీగల్‌గా చెబ్లుబాటులోనే ఉంటాయి. అయితే సెప్టెంబర్ 30లోగా రూ.2వేల నోట్లను పూర్తిగా మర్చుకోవాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సహకార రంగ బ్యాంకులు రూ.2వేల నోట్లను డిపాజిట్ కోసం తీసుకోవాలి. డిపాజిట్లను రోజులో ఎంతైనా తీసుకోవచ్చు. అయితే రూ.2వేల నోట్లను మాత్రం జారీ చేయకూడదు' అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న రూ.2వేల నోట్లు 2017 మార్చికి ముందే ఆర్బీఐ చలామణిలోకి తీసుకొని వచ్చింది. ఒక్కో నోటు జీవిత కాలం 4 నుంచి 5 ఏళ్లుగా ఉంటుందని ఆర్బీఐ అప్పుడే అంచనా వేసింది. 2018 మార్చ్ 31 నాటికి నోట్ల చలామణి రూ.6.73 కోట్ల నుంచి రూ.3.62 కోట్లకు పడిపోయింది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 10.8 శాతం నోట్లు మాత్రమే సర్క్యులేషన్‌లో ఉన్నట్లు ఆర్బీఐ చెబుతోంది.

రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి ఉపహంసరించుకున్నా.. కావలసినన్ని ఇతర డినామినేషన్ల నోట్లు అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది. కాగా, 2018 నవంబర్ 8న నోట్ల రద్దును ప్రధాని మోడీ ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న రూ.500, రూ.1000 నోట్లను పూర్తిగా రద్దు చేశారు. అయితే ఆ తర్వాత కొత్త రూ.500తో పాటు రూ.2000 నోటును మార్కెట్లోకి తీసుకొని వచ్చారు.

బ్లాక్ మనీని కట్టడి చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆ తర్వాత అంతకంటే పెద్దదైన రూ.2000 నోటు తీసుకొని రావడంపై విమర్శలు వచ్చాయి. గతంలో కంటే బ్లాక్ మనీ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా హెచ్చరించారు. దీంతో ఆర్బీఐ క్రమంగా రూ.2000 నోటును ముద్రించడం నిలిపివేసింది. తాజాగా ఆ నోటు చలామణిని కూడా సెప్టెంబర్ 30 తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.


First Published:  19 May 2023 7:31 PM IST
Next Story