Telugu Global
Business

మళ్ళీ రెపోరేట్ ను పెంచిన ఆర్బీఐ.... పెరగనున్న లోన్ ఈఎంఐలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్ని నెలల క్రితం ఉన్నంత భయంకరంగా లేదని దాస్ చెప్పారు. అయితే పరిస్థితి ఇప్పటికీ అనిశ్చితంగా ఉందన్నారాయన.

మళ్ళీ రెపోరేట్ ను పెంచిన ఆర్బీఐ.... పెరగనున్న లోన్ ఈఎంఐలు
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు ( 6.5 శాతానికి) పెంచింది, ఈ మేరకు ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటించారు. 6 మంది సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ లో 4 గురు ఈ నిర్ణయానికి అనుకూల‍ంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.


ఇది ఈ సంవత్సరంలో మొదటి ద్రవ్య విధాన ప్రకటన. డిసెంబర్ 2022లో, రెపో రేటు 0.35 శాతం పాయింట్లు పెరిగి 6.25 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో ఎలాంటి మార్పు లేదు.

రెపో రేటు పెరగడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో లోన్ ఈఎంఐలు పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్ని నెలల క్రితం ఉన్నంత భయంకరంగా లేదని దాస్ చెప్పారు. అయితే పరిస్థితి ఇప్పటికీ అనిశ్చితంగా ఉందన్నారాయన.

"2023-24లో ద్రవ్యోల్బణం మితంగా ఉంటుందని అంచనా వేశాము. అది 4% లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మార్కెట్ అస్థిరత, పెరుగుతున్న చమురేతర వస్తువుల ధరలు, అస్థిర ముడిచమురు వంటి అనిశ్చితులు కొనసాగుతున్నందున భవిష్యత్తు అంచనాలు అస్పష్టంగానే ఉన్నాయని దాస్ చెప్పారు.

2023-24లో నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో ద్ర‌వ్యోల్బ‌ణం స‌గ‌టున 5.6 శాతం ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు దాస్ చెప్పారు. ఈ ఏడాది వాస్త‌వ జీడీపీ 6.4 శాతంగా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

First Published:  8 Feb 2023 1:37 PM IST
Next Story