Telugu Global
Business

హైదరాబాద్‌లో పుట్టి.. దలాల్ స్ట్రీట్‌ను ఏలిన బిగ్‌బుల్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మృతి

స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా (62) ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు.

హైదరాబాద్‌లో పుట్టి.. దలాల్ స్ట్రీట్‌ను ఏలిన బిగ్‌బుల్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మృతి
X

స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా (62) ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఉదయం 6.45కు ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారు. కానీ రాకేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొన్ని వారాల క్రితమే ఆయన బ్రీచ్‌కాండీలో కిడ్నీ చికిత్స చేయించుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆయన కోలుకోలేదు. రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రూ. 5వేలతో మొదలుపెట్టి..

స్టాక్ మార్కెట్ అంటే సామాన్యులకు అర్థం కాని ఒక వింత ప్రపంచం. కానీ దానికి సంబంధించిన కొంత మంది పేర్లు మాత్రం గుర్తుండిపోతాయి. స్టాక్ మార్కెట్‌లో స్కాములకు సంబంధించిన వారే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. అయితే పట్టుకున్నదంతా బంగారం అయ్యే ఇన్వెస్టర్ అంటే మాత్రం రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా పేరు చెప్తారు. రాజస్థాన్‌కు చెందిన రాధేశ్యామ్ ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగి. తన ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ఆయనకు పుట్టిన కొడుకు రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా. హైదరాబాద్ నుంచి ముంబైకి కుటుంబంతో పాటు వెళ్లిన రాకేశ్.. అక్కడే చదువుకున్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన రాకేశ్.. 12 ఏళ్ల వయసు నుంచే స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు.

తండ్రి ఐ-టి డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి కావడంతో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలు మరింత లోతుగా తెలుసుకోవడం మొదలు పెట్టాడు. 17 ఏళ్ల వయసులోనే మార్కెట్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాడు. తాను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను కెరీర్‌గా తీసుకుంటానని తండ్రితో చెప్పగా తొలుత నిరాకరించారు. మార్కెట్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని.. మన కుటుంబం ఏనాడూ వ్యాపారాలు చేయలేదని వారించారు. ముందుగా సీఏ పూర్తి చేసి.. తర్వాత తనకు ఇష్టం వచ్చింది చేసుకోమని సూచించారు. అలా సీఏ పూర్తి చేశాడు.

సీఏ పూర్తి అయిన తర్వాత ట్రేడింగ్ చేస్తానని మరోసారి నాన్నను అడిగాడు. తాను బతికున్నంత వరకు పైసా ఇవ్వకుండా ఇంట్లో తిను.. కానీ రూపాయి కూడా నా దగ్గర నుంచి ఆశించకు అని నాన్న చెప్పాడు. దీంతో అన్నయ్య దగ్గర రూ. 5 వేలు అప్పు చేసి ట్రేడింగ్ మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా వెనుదిరిగి చూసుకున్నది లేదు. చిన్నప్పటి నుంచే మార్కెట్‌ను గమనించిన రాకేశ్.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకున్నాడు. అలా ఏకంగా ఓ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా.. అనేక ప్రముఖ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. టాటా కంపెనీల షేర్లు కొనడంతో మొదలు పెట్టిన రాకేశ్.. ఆ తర్వాత అవే సంస్థల బోర్డుల్లో డైరెక్టర్‌గా మారడం విశేషం.

ఇండియన్ వారెన్ బఫెట్‌, దలాల్ స్ట్రీట్ బిగ్‌బుల్ అని పేరు తెచ్చుకున్న రాకేశ్.. రేర్ ఎంటర్‌ప్రైస్ అనే స్టాక్ ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. తన పేరు.. భార్య రేఖ పేరు కలిసి వచ్చేలా రేర్ అని పేరు పెట్టాడు. రూ. 5 వేలతో మొదలు పెట్టిన రాకేశ్.. ఇవాళ దేశంలోని బిలియనీర్ల లిస్టులో 36వ స్థానినికి ఎదిగారు. ఆయన 5.5 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. టైటాన్ కంపెనీలో ఆయన రూ. 7,294.8 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు ఆయన చేసిన అతి భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే.

ఓడిపోవడానికి సిద్దంగా ఉన్నా..

రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా ఇటీవల ఆకాశ ఎయిర్ అనే విమానయాన సంస్థను ప్రారంభించారు. జెట్‌ ఎయిర్‌వేస్ సీఈవో వినయ్ దూబే, ఇండిగో మాజీ హెడ్ ఆదిత్య ఘోష్‌తోకలసి రాకేశ్ ఈ విమానయాన సంస్థను నడుపుతున్నారు. ఈ నెల మొదటి వారంలో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమాన సర్వీసుతో సేవలు ప్రారంభించారు. విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకుల్లో, నష్టాల్లో ఉన్న సమయంలో ఎలా ఈ సంస్థను ప్రారంభించారని రాకేశ్‌ను ప్రశ్నించారు. 'నేను ఓడిపోవడానికి సిద్దంగా ఉన్నాను' అంటూ ఆయన జవాబివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలాపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసును సెబీ గత ఏడాది సెటిల్ చేసింది. రూ. 35 కోట్లు రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా, అతని సహచరుల నుంచి కట్టించింది. రాకేశ్ రూ. 18 కోట్లు, ఆయన భార్య రూ. 3.2 కోట్లు జరిమానా కట్టారు.

First Published:  14 Aug 2022 12:14 PM IST
Next Story