Telugu Global
Business

ఫ్లిప్‌కార్ట్ నుంచి విడిపోయిన 'ఫోన్‌పే'.. పూర్తి స్థాయి భారత కంపెనీగా అవతరణ

ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజనీర్‌లు ఫోన్‌పేను స్థాపించారు.

ఫ్లిప్‌కార్ట్ నుంచి విడిపోయిన ఫోన్‌పే.. పూర్తి స్థాయి భారత కంపెనీగా అవతరణ
X

దేశంలోని డిజిటల్ పేమెంట్ల విభాగంలో ఫోన్‌పే అతిపెద్ద ఆపరేటర్‌గా ఉన్నది. ఆ తర్వాత జీపే, పేటీఎం, అమెజాన్ పే, వాట్సప్ పే ఉన్నాయి. ఇన్నాళ్లు ఫ్లిప్‌కార్ట్ సబ్సిడరీ సంస్థగా ఉన్న ఫోన్‌పే ఇప్పుడు తన మాతృసంస్థ నుంచి విడిపోయింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌తో సంస్థలతో ఫోన్‌పేకు ఎలాంటి సంబంధం ఉండకుండా పూర్తి స్వతంత్రంగా వ్యవహరించనున్నది. అంతే కాకుండా ఫోన్‌పే పూర్తి భారతీయ సంస్థగా కూడా అవతరించింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి విడిపోయినా.. ఫోన్‌పేలో అధిక శాతం వాటాలు ఆ సంస్థవే ఉండబోతున్నాయి.

అమెజాన్ మాజీ ఉద్యోగులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఫ్లిప్‌కార్ట్ దేశంలోనే నెంబర్ 1 ఈ-కామర్స్ సంస్థగా ఎదిగింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజనీర్‌లు ఫోన్‌పేను స్థాపించారు. డిజిటల్ పేమెంట్ విభాగంలో ఫోన్‌పే క్రమంగా ఎదుగుతూ పేటీఎం, జీపేకు పోటీగా మారింది. 2016లో ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. అయితే 2017లో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ ఇండియా కొనుగోలు చేసింది. దీంతో ఫోన్‌పే కూడా అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ గ్రూప్‌లో భాగమైంది.

ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ సంస్థలుగా మారుతున్న సమయంలో ఒకే గొడుగు కింద ఉండటం మంచిది కాదని యాజమాన్యం భావించింది. పైగా ఫోన్‌పే విస్తరణకు కొంత ఆటంకం కూడా ఉన్నది. ఫోన్‌పే యాజమాన్యం విదేశాలకు చెందినది కావడంతో కొన్ని రకాల సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఫోన్‌పే కార్యాలయాన్ని గతంలోనే సింగపూర్ నుంచి ఇండియాకు తరలించారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌పేను విడదీసి భారత కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయించారు.

ప్రస్తుతం ఫోన్‌పే ఇండియాగా మారిన సంస్థలో ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాలు కొన్నాయి. అక్టోబర్ నుంచి ఇండియా కేంద్రంగా ఫోన్‌పే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫోన్‌పే ఇండియా విస్తరణ కోసం మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో పాటు జనరల్ అట్లాంటిక్, ఇతర వాటాదారులతో చర్చలు జరుపుతోంది. దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది సఫలం అయితే ఫోన్‌పే విలువ 12 బిలియన్ డాలర్లకు చేరుతుంది.

ఇండియాలో ప్రస్తుతం 7.5 బిలియన్ డాలర్లతో రేజర్ పే అతిపెద్ద ఫిన్ టెక్ సంస్థగా ఉంది. ఫోన్‌పే కనుక నిధుల సమీకరణలో విజయవంతం అయితే ఇండియాలోనే అతి పెద్ద ఫిన్‌టెక్ సంస్థగా అవతరించనున్నది. ఆ తర్వాత సంస్థను మరింతగా విస్తరించి గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పేకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఫోన్‌పే వచ్చే ఏడాది ఐపీవోకు సన్నాహాలు కూడా చేసుకుంటోంది.

ప్రస్తుతం ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ల సర్వీసునే కాకుండా ఇతర సేవలను కూడా అందిస్తోంది. ఇటీవల మ్యూచువల్ ఫండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లైసెన్సు కోసం కూడా దరఖాస్తు చేసుకుంది. ద్విచక్ర వాహనాలు, కార్లకు క్విక్ ఇన్స్యూరెన్స్‌ను అందిస్తోంది.

First Published:  23 Dec 2022 9:12 AM GMT
Next Story