Electric Cars | ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న మోజు.. రెండేండ్లలో 25 శాతం ఆ సెగ్మెంట్ కార్లదే వాటా.. తేల్చేసిన బీఎండబ్ల్యూ..!
Electric Cars | కర్బన ఉద్గారాల నియంత్రణ.. భూతాపం నివారణ.. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి బయట పడేందుకు ప్రపంచ దేశాలు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వెహికల్స్.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
Electric Cars | కర్బన ఉద్గారాల నియంత్రణ.. భూతాపం నివారణ.. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి బయట పడేందుకు ప్రపంచ దేశాలు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వెహికల్స్.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. భారత్ కూడా అందులో భాగస్వామిగా ఉంది.. గతంతో పోలిస్తే విద్యుత్ వాహనాల వైపు మొగ్గుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వచ్చే రెండేండ్లలో భారత్‌లో అమ్ముడయ్యే ప్రతి నాలుగు కార్లలో ఒక విద్యుత్ కారు ఉంటుందని జర్మనీ లగ్జరీ వెహికల్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ పేర్కొంది. అంచనాలకు మించి ఎలక్ట్రిక్ కార్లకు గిరాకీ పెరుగుతున్నదని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 10 శాతం ఉంటుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ కం సీఈఓ విక్రమ్ పవాహ్ చెప్పారు. 2024లో 15 శాతానికి, 2025లో 25 శాతానికి పెరుగుతుందని తేల్చేశారు.
ఐదు విభిన్న మోడల్స్‌తో మేం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తున్నాం. విద్యుత్ వాహనాలకు మంచి గిరాకీ ఉందని మేం గుర్తించాం. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని పదిలపర్చేందుకు మరిన్ని మోడల్ కార్లు ఆవిష్కరిస్తాం అని విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో బీఎండబ్ల్యూదే హవా. వోల్వో కార్స్ ఇండియా, మెర్సిడెజ్ బెంజ్ ఇండియా, ఆడి ఇండియాల కంటే ఎక్కువగా 48 శాతానికి పైగా ఎలక్ట్రికల్ లగ్జరీ కార్లు భారత్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఐ4 (i4), ఐ7 (i7), ఐఎక్స్ (iX), ఐఎక్స్1 (iX1), మినీ ఎలక్ట్రిక్ (Mini Electric) మోడల్ కార్లు విక్రయిస్తోంది. ఇటీవలే వెయ్యి ఈవీ కార్ల మార్క్‌ను దాటామని విక్రమ్ పవాహ్ తెలిపారు. అయితే, భారత్‌లో ఆవిష్కరించే కొత్త ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ పేర్లు వెల్లడించడానికి నిరాకరించారు. 2025లో గ్లోబల్ మార్కెట్లో 12 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లు ఆవిష్కరించేందుకు బీఎండబ్ల్యూ రంగం సిద్ధం చేసుకుంటోంది. సెప్టెంబర్‌లో 1439 కార్లు విక్రయించామని, తమ కార్ల విక్రయాల్లో ఇదే బెస్ట్ రికార్డు అని పేర్కొన్నారు విక్రమ్ పవాహ్. ఈ ఏడాది పూర్తయ్యే లోపు తమ కార్ల విక్రయాలు రికార్డు నమోదు చేస్తాయని భావిస్తున్నామన్నారు.
భారత్ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో 11,981 కార్లను విక్రయించింది బీఎండబ్ల్యూ. భారత్‌లో బీఎండబ్ల్యూ కార్ల విక్రయాల్లో ఇదే బెస్ట్ రికార్డు. ఇంతకుముందు 2018లో 10,405 కార్లు విక్రయించింది. 2023 తొలి తొమ్మిది నెలల్లో 9,580 కార్ల విక్రయంతో 10 శాతం రికార్డ్ వృద్ధి నమోదు చేసుకున్నది. దీనికి తోడు ప్రీమియం మోటార్ సైకిళ్ల సేల్స్ (జనవరి-సెప్టెంబర్ మధ్య) 26 శాతం పెరిగి 6,778 యూనిట్లకు చేరాయి.
లగర్జరీ వెహికల్స్ సెగ్మెంట్‌లో రూ.1.5 కోట్ల విలువ గల బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వంటి టాప్ ఎండ్ వాహనాల సేల్స్ శరవేగంగా పుంజుకుంటున్నాయి. లగ్జరీ వెహికల్స్ సేల్స్‌లో టాప్ హై ఎండ్ సెగ్మెంట్ రెట్టింపు యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం కార్ల సేల్స్‌లో వీటి వాటా ఐదో వంతు.
ఫస్ట్‌టైం లగ్జరీ కార్ల కొనుగోలుదారులు ఎక్స్1 వంటి కార్లపై మోజు పెంచుకోవడంతో తమ లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరిస్తోందని విక్రమ్ పవాహ్ చెప్పారు. 2023 చివరి నాటికి లగ్జరీ కార్ల సేల్స్ మెరుగైన రికార్డు నమోదు చేస్తాయని భావిస్తున్నామన్నారు. 2018లో లగ్జరీ కార్ల విక్రయాలు సుమారు 40 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకూ ఆ సెగ్మెంట్‌లో ఇదే రికార్డు. కస్టమర్ల నుంచి లభిస్తున్న గిరాకీని సొమ్ము చేసుకునేందుకు ఈ ఏడాదిలో 19 కార్లు, మూడు మోటారు సైకిళ్లను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తామని విక్రమ్ పవాహ్ వెల్లడించారు.