డీజిల్ వాహనాలు వద్దే వద్దు.. - ఆయిల్ మినిస్ట్రీ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ కమిటీ నివేదిక
సంప్రదాయ ఇంజిన్లతో నడిచే బైక్‌లను కూడా 2035 నాటికి దశలవారీగా నిషేధించాలని పేర్కొంది. ఇందుకోసం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని తెలిపింది. ఈలోగా చమురులో ఇథనాల్ కలిపే వాటాను పెంచాలని సూచించింది.
డీజిల్ వాహనాలు వద్దే వద్దంటూ ఆయిల్ మినిస్ట్రీ మాజీ సెక్రటరీ తరుణ్‌కపూర్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 2027 నాటికి వాటిని 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లో పూర్తిగా నిషేధించాలని సూచించింది. సంప్రదాయ ఇంజిన్లతో నడిచే బైక్‌లను కూడా 2035 నాటికి దశలవారీగా నిషేధించాలని పేర్కొంది. ఇందుకోసం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని తెలిపింది. ఈలోగా చమురులో ఇథనాల్ కలిపే వాటాను పెంచాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఈ కమిటీ నివేదిక ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
కార్లు, ట్యాక్సీలకు సైతం..
ప్యాసింజర్ కార్లు, ట్యాక్సీలను సైతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడిపే విధంగా మార్చాలని కమిటీ సూచించింది. ఇలా 50 శాతం కార్లను మార్చాలని పేర్కొంది. మిగిలిన 50 శాతం విద్యుత్ వాహనాలుగా మార్చాలని తెలిపింది.
ఆ విషయంలో నాలుగో స్థానంలో భారత్..
దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్‌తో నడిచే వాహనాలను వీలైనంత త్వరగా తగ్గించాలని కమిటీ సూచించింది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని కమిటీ గుర్తుచేసింది. మొదటి మూడు స్థానాల్లో చైనా, అమెరికా, ఈయూ ఉన్నాయి.