విమానయాన రంగంలో క్రైసిస్.. గోఫస్ట్ బాటలో మరో ఎయిర్‌లైన్స్.. లీజుదారు పిటిషన్‌పై 8న ఎన్సీఎల్టీ విచారణ
స్పైస్ జెట్‌కు వ్యతిరేకంగా గత నెల 12న ఇంజిన్ సప్లయర్ `విల్లీస్ లీజ్ ఫైనాన్స్ కార్పొరేషన్`, ఫిబ్రవరి 12న ఎక్రెస్ బిల్డ్‌వెల్ దివాళా పరిష్కార ప్రక్రియ పిటిషన్లు దాఖలు చేశాయి.
దేశీయ విమానయాన రంగంలో సంక్షోభం నెలకొందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ వారం ప్రారంభంలో వాడియా గ్రూప్ సారథ్యంలోని `గోఫస్ట్` స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అభ్యర్థించింది. గోఫస్ట్ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ తన ఆదేశాలు రిజర్వు చేసింది. తాజాగా మరో ఎయిర్‌లైన్స్ సంస్థ `స్పైస్‌జెట్`పై ఎన్సీఎల్టీ వచ్చేవారం దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నది.
స్పైస్‌జెట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఐర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ లెస్సర్ `ఎయిర్‌కాస్టిల్` దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని ఎన్సీఎల్టీని గత నెల 28న కోరింది. దీనిపై ఈ నెల 8న అంటే వచ్చే సోమవారం విచారణ చేపడతామని ఎన్సీఎల్టీ వెబ్‌సైట్ తెలిపింది. స్పైస్‌జెట్‌కు వ్యతిరేకంగా రెండు దివాళా పరిష్కార పిటిషన్లు దాఖలైనట్లు ట్రిబ్యునల్ వెబ్‌సైట్ సమాచారం చెబుతున్నది.
స్పైస్ జెట్‌కు వ్యతిరేకంగా గత నెల 12న ఇంజిన్ సప్లయర్ `విల్లీస్ లీజ్ ఫైనాన్స్ కార్పొరేషన్`, ఫిబ్రవరి 12న ఎక్రెస్ బిల్డ్‌వెల్ దివాళా పరిష్కార ప్రక్రియ పిటిషన్లు దాఖలు చేశాయి. కొన్ని నెలలుగా ఉద్యోగుల పీఎఫ్, టీడీఎస్ పేమెంట్స్ డిఫాల్ట్ అయ్యాయని పిటిషన్లలో పేర్కొన్నాయి.
అయితే ఎయిర్ కాస్టిల్‌కు సంబంధించిన విమానాలేవి తమ వద్ద లేవని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ కాస్టిల్ విమానాలన్నీ తిప్పి పంపేశాం అని చెప్పారు. తాజాగా ఎయిర్ కాస్టిల్ ఫిర్యాదుతో తమ విమాన సర్వీసుల నిర్వహణపై గానీ, ఆపరేషన్ల నిర్వహణపై గానీ ఎటువంటి ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై కోర్టు విచారణ చేపట్టక ముందే సమస్య పరిష్కారం అవుతుందని తాము విశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నారు.
ఇటు స్పైస్‌జెట్.. అటు ఎయిర్ కాస్టిల్ సంస్థ కూడా సమస్య పరిష్కారం కోసం ఎన్సీఎల్టీ ముందు ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశాయని సమాచారం. ఇంజిన్ల సప్లయర్ విల్లీస్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ అనుమతించలేదు. స్పైస్ జెట్‌కు నోటీసు జారీ చేయలేదు. ఏడాది క్రితమే విల్లిస్ సంస్థ ఇంజిన్లను వెనక్కు తిప్పి పంపామని స్పైస్‌జెట్ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ కాలంగా నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నామని స్పైస్‌జెట్ అధికార వర్గాల కథనం. తమ వ్యాపార భాగస్వాములతో కోర్టు బయట పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
స్పైస్‌జెట్‌లో కార్ల్యేల్ ఏవియేషన్ పార్టనర్‌కు 7.5 శాతం వాటా ఉంది. స్పైస్‌జెట్ అనుబంధ స్పైస్ ఎక్స్‌ప్రెస్ లో 100 మిలియన్ల డాలర్ల విలువ గల ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబిలిటీ డిబెంచర్లు (సీసీడీ) నగదుగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఎయిర్ క్రాఫ్ట్ లెస్సర్స్‌తో భాగస్వామ్య ఒప్పందాలను పునర్వ్యవస్థీకరిస్తున్నామని, ఈ ప్రక్రియలో ఆయా కంపెనీల రుణాల కింద సీసీడీలను నగదుగా బదిలీ చేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది.
అమెరికాకు చెందిన ప్రాటీ అండ్ విట్నీ అనే కంపెనీ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడుపలేకపోతున్నట్లు ఇంతకుముందు మరో విమానయాన సంస్థ `గోఫస్ట్` పేర్కొన్న సంగతి తెలిసిందే. నగదు కొరత సమస్య ఎదుర్కొంటున్నామని, కనుక దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని ఎన్సీఎల్టీని కోరింది గోఫస్ట్. దీంతో ఈ నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 15 వరకు టిక్కెట్ల బుకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.