Telugu Global
Business

ఆన్‌లైన్ అమ్మకాల్లో కొత్త రికార్డ్‌లు.. పండగ బిజినెస్ రూ.76 వేల కోట్లు

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య కేవలం నెల రోజుల్లోనే 76 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే అమ్మకాలు 25 శాతం పెరిగాయి.

ఆన్‌లైన్ అమ్మకాల్లో కొత్త రికార్డ్‌లు.. పండగ బిజినెస్ రూ.76 వేల కోట్లు
X

భారత్‌లో కరోనా తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఇటీవల దేశీయంగా బంగారం అమ్మకాలు కూడా కరోనా ముందు స్థాయికి చేరుకున్నాయి. పండగ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా ఆన్‌లైన్‌ అమ్మకాల్లో కొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పండగ బిజినెస్ జరిగిందని చెబుతున్నాయి ఏజెన్సీలు. ఆన్‌లైన్‌ అమ్మకాలు 76 వేల కోట్ల రూపాయల మార్క్‌ని టచ్ చేశాయి.

దసరా, దీపావళి పండగ సీజన్లో ఆన్‌లైన్‌ మార్కెటింగ్ కంపెనీలన్నీ రకరకాల ఆఫర్లతో వినియోగదారుల్ని కట్టిపడేశాయి. ఒకరకంగా ఆఫ్ లైన్ బిజినెస్ కంటే, ఆన్‌లైన్‌ బిజినెస్ జోరుగా సాగిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య కేవలం నెల రోజుల్లోనే 76 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే అమ్మకాలు 25 శాతం పెరిగాయి. బెంగళూరుకు చెందిన రెడ్‌ సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ సంస్థ ఈ గణాంకాలు విడుదల చేసింది.

నగరాలతో పోటీ పడుతున్న గ్రామీణ వినియోగదారులు

మొత్తం ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ద్వితీయ శ్రేణి, ఆపై నగరాల వాటా 57 శాతంగా ఉంది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆన్‌లైన్‌ వ్యాపారం విస్తరించింది. అందుకే రూరల్ ఏరియాల్లో బిజినెస్ 43 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ కంపెనీలన్నీ గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెంచాయి. డెలివరీ పాయింట్లను పెంచుకుంటున్నాయి. దీంతో ఇక్కడ వ్యాపారం పెరిగిందని తెలుస్తోంది.

ఏమేం కొన్నారంటే..

ఇక పండగ అమ్మకాల్లో ఫ్యాషన్‌ విభాగంలోనే ఎక్కువ వ్యాపారం జరిగింది. బ్రాండెడ్ కంటే అన్‌ బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తుల విక్రయాలే అధికంగా జరిగాయి. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ స్థిరంగా ఉంది. గృహోపకరణాలు, ఇతర సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని రెడ్ సీర్ సంస్థ తెలిపింది.

First Published:  19 Nov 2022 2:33 PM IST
Next Story