Telugu Global
Business

విదేశాల్లో అంబానీ భారీగా ఆస్తుల కొనుగోళ్లు.. దేశం విడిచి వెళ్తారంటూ సోషల్ మీడియాలో చర్చ

అంబానీ దంపతులు లండన్‌లో సెటిల్ అవుతారని, కూతురు న్యూయార్క్‌లో, చిన్న కొడుకు దుబాయ్‌లో.. పెద్ద కొడుకు ముంబైలో నివాసం ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

విదేశాల్లో అంబానీ భారీగా ఆస్తుల కొనుగోళ్లు.. దేశం విడిచి వెళ్తారంటూ సోషల్ మీడియాలో చర్చ
X

భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా విదేశాల్లో స్థిరపడనున్నారా? ముంబైని ఇకపై కేవలం వ్యాపార అవసరాల కోసమే ఉపయోగించుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత రెండేళ్లుగా అంబానీ కుటుంబం విదేశాల్లో స్థిరాస్తులు భారీగా కొనుగోలు చేస్తోంది. ముఖేశ్ అంబానీ కుటుంబ వ్యాపారాలన్నీ ముంబై, గుజరాత్ కేంద్రంగానే నడుస్తున్నాయి. ఇండియాలోనే రిలయన్స్ కార్యకలాపాలు ఎక్కువ. అయినా సరే.. రాబోయే రోజుల్లో ముంబైలో కేవలం వ్యాపార అవసరాల నిమిత్తమే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

ముఖేశ్ అంబానీ ఇప్పటికే తన వ్యాపారాలను వారసులకు విభజించే పనిలో ఉన్నారు. టెలికాం బిజినెస్‌ను పెద్ద కుమారుడికి అప్పగించారు. ఇక రిఫైనరీ వ్యాపారాన్ని చిన్న కొడుకు.. రిటైల్ వ్యాపారాన్ని కూతురుకి ఇవ్వాలని భావిస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో తన వారసులకు పూర్తిగా వ్యాపారాలు అప్పగించి ముఖేశ్ అంబానీ విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ముంబై వాతావరణ,కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో తన శేష జీవితాన్ని గడపడానికి అంబానీ ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది.

గత ఏడాది బ్రిటన్‌లోని 300 ఎకకాల ''స్టోన్ పార్క్'ను 79 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అలాగే న్యూయార్క్‌లో తన కూతురి కోసం ఒక భవనాన్ని కొనుగోలు చేయడానికి అన్వేషణ కొనసాగుతున్నది. ఇప్పటికే దుబాయ్‌లోని పామ్ జుమేరాలో దాదాపు రూ. 630 కోట్లతో ఒక విల్లాను కొనుగోలు చేశారు. పెట్రోలియం, రిఫైనరీ బాధ్యతలు చూడబోతున్న చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ విల్లా కొనుగోలు చేశారు. పెద్ద కుమారుడు ఆకాశ్ మాత్రం ముంబైలోని ఆంటిలాలోనే ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

ఇక తాజాగా దుబాయ్‌లో ముఖేశ్ అంబానీ భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. పామ్ జుమేరాలోని మహమ్మద్ అల్‌షాయా అనే బిలియనీర్‌కు చెందిన భవనాన్ని దాదాపు రూ. 1300 కోట్లకు అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. అల్‌షాయా కువైట్‌లో పెద్ద బిలియనీర్. ఆయనకు దుబాయ్‌లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అయితే, అంబానీ కోరిక మేరకే తన భవనాన్ని అమ్మినట్లు తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో అంబానీ ఫ్యామిలీ ఆ భవంతిని హాలిడే వెకేషన్‌కు వాడుకోనున్నట్లు తెలుస్తున్నది.

అంబానీ దంపతులు లండన్‌లో సెటిల్ అవుతారని, కూతురు న్యూయార్క్‌లో, చిన్న కొడుకు దుబాయ్‌లో.. పెద్ద కొడుకు ముంబైలో నివాసం ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. గత రెండేళ్ల నుంచే అంబానీ విదేశీ స్థిరాస్తులపై ఎక్కువగా ఫోకస్ చేయడం, ఆస్తి పంపకాలు కూడా మొదలు పెట్టడంతోనే ఆయన దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతారనే చర్చ మొదలైంది. అంబానీ ఫ్యామిలీ కానీ, రిలయన్స్ వర్గాలు కానీ ఈ విషయంలో ఇంత వరకు స్పందించలేదు.

First Published:  20 Oct 2022 9:13 AM IST
Next Story