Maruti Suzuki | ఎస్‌యూవీలపై క్రేజ్.. కానీ బుల్లి కార్ల గిరాకీ పెంపునకు ఈ పని చేయాల్సిందే.. తేల్చేసిన మారుతి చైర్మన్ ఆర్సీభార్గవ..!
Maruti Suzuki | ఎస్‌యూవీలకు డిమాండ్ ఉన్నా.. ఫస్ట్‌టైం కార్ల కొనుగోలుదారులు బుల్లి కార్ల వైపే మొగ్గుతారు.. కానీ పన్ను భారం తగ్గిస్తే బుల్లి కార్లకు మళ్లీ గిరాకీ వస్తుందంటున్నారు మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ.
Maruti Suzuki | ఇంతకుముందు ఫస్ట్‌టైం కారు కొనేవారు బుల్లి కార్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి.. అందునా స్పేసియస్‌గా ఉండే ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకు ఎస్‌యూవీ (SUV) కార్ల విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. తొలి నుంచి టెక్నాలజీతో కూడిన అధునాతన ఫీచర్లతో కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ మోడల్ కార్లను మార్కెట్లోకి తెస్తున్న మారుతి సుజుకి (Maruti Suzuki).. నిత్యం అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది. ఇన్‌పుట్ కాస్ట్ తగ్గడంతోపాటు ఎస్‌యూవీ (SUV) లకు భారీ గిరాకీ రావడంతో సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో మారుతి సుజుకి అదరగొట్టింది. మొత్తం మారుతి సుజుకి కార్ల విక్రయాల్లో 80 శాతం ఎస్‌యూవీలదే..
బ్రెజా (Brezza), గ్రాండ్ విటారా (Grand Vitara), ఫ్రాంక్స్ (Fronx), జిమ్నీ (Jimny) తదితర పాపులర్ మోడల్ కార్ల విక్రయంతో సెప్టెంబర్ త్రైమాసికం మారుతి సుజుకి నికర లాభం రూ.3,717 కోట్లకు పెరిగింది. సుదీర్ఘ కాలంగా బుల్లి కార్ల మార్కెట్‌పైనా పట్టు గల మారుతి సుజుకి (Maruti Suzuki).. ఆయా కార్ల సెగ్మెంట్ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందన్న సంగతి అంచనా వేయలేకపోతున్నది. ఏ సమయంలోనైనా బుల్లి కార్లకు గిరాకీ పెరగవచ్చునని చెబుతోంది మారుతి సుజుకి. అయితే, ప్రభుత్వం బుల్లికార్లపై పన్ను భారం తగ్గించకపోతే ఇప్పట్లో వాటిని తయరు చేయలేం అంటున్నారు మారుతి సుజుకి (Maruti Suzuki) చైర్మన్ ఆర్సీ భార్గవ.
ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ మోడల్ కార్లకు గిరాకీ పెరిగిపోవడంతో ఆ మోడల్ కార్లే ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. బుల్లి కార్ల సేల్స్ రోజురోజుకు పతనమవుతున్నాయి. ఫస్ట్ టైం కార్ల కొనుగోలు దారులపై పెరుగుతున్న ఖర్చులు భారంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్‌యూవీ బాడీ టైప్ కార్లలో సబ్ సెగ్మెంట్లు పెరుగుతున్నాయి. బ్రెజా, ఫ్రాంక్స్ వంటి మారుతి సుజుకి ఎస్‌యూవీ కార్లకు గిరాకీ పెరుగుతుంటే, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడల్ కార్లకు డిమాండ్ తగ్గుతోంది.
బుల్లి కార్ల సెగ్మెంట్ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తామేం జోస్యం చెప్పలేమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చి చెప్పారు. నా అంచనా ప్రకారం బుల్లి కార్ల మార్కెట్ పుంజుకోవడానికి సుమారు రెండు నుంచి మూడేండ్లు పడుతుంది అని అన్నారు. ప్రభుత్వం పన్నులు తగ్గించకపోయినా, కార్ల తయారీ ఖర్చుల కంటే వేగంగా కస్టమర్ల ఆదాయాలు పెరగకపోయినా, బుల్లి కార్లకు పూర్వ వైభవం వస్తుందని నేను భావించడం లేదు అని ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు.
బుల్లి కార్ల కొనుగోలు దారులు పెరిగిపోతున్న కొనుగోలు ఖర్చులపై ఆచితూచి స్పందిస్తారని ఆర్సీభార్గవ. ఇప్పటికీ మారుతి సుజుకి భారీ స్థాయిలోనే ఎంట్రీ లెవల్ కార్ల తయారీ సామర్థ్యం కలిగి ఉంది. కార్ల కొనుగోలుదారుల నుంచి గిరాకీ వస్తుంది. అప్పటి వరకూ మేం ఆ కార్ల ఉత్పత్తి తగ్గించం. కస్టమర్ల నుంచి వచ్చే డిమాండ్లు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేం వ్యవహరిస్తాం అని పేర్కొన్నారు. కార్ల కొనుగోలుదారుల కొనుగోలు శక్తి పెంచడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అనుకూలంగా ఉన్నాయన్నారు.