Maruti Suzuki Discounts | మారుతి సుజుకి కార్లపై డిస్కౌంట్లు, బెనిఫిట్లు, వేరియంట్ల వారీగా ఎంతెంతంటే..?
Maruti Suzuki Discounts | గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6 మోడల్ కార్లపై ఎటువంటి బెనిఫిట్లు ఆఫర్ చేయలేదు. ఆసక్తి గల కస్టమర్లకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్లు కల్పిస్తున్నాయి.
Maruti Suzuki Discounts | కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి కేంద్రం రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు తప్పనిసరి చేసింది. ఫలితంగా కార్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందన్న సాకుతో దాదాపు కార్ల తయారీ సంస్థలన్నీ ఆయా మోడల్ కార్ల ధరలు పెంచేశాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ కార్ల సేల్స్ పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి పలు రకాల ఆఫర్లు ప్రకటించాయి. ఆ జాబితాలో మారుతి సుజుకి కూడా ఉంది. వివిధ మోడల్ కార్లపై మే నెలలో గరిష్టంగా రూ.47 వేల వరకు డిస్కౌంట్లు, బెనిఫిట్ల రూపంలో ధర తగ్గిస్తున్నది. బాలెనో, ఇగ్నిస్, సియాజ్ మోడల్ కార్లపై ఆఫర్లు వర్తిస్తాయి. గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6 మోడల్ కార్లపై ఎటువంటి బెనిఫిట్లు ఆఫర్ చేయలేదు. ఆసక్తి గల కస్టమర్లకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్లు కల్పిస్తున్నాయి.
ఇగ్నిస్‌పై రూ.47 వేల వరకు ఆదా
మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ కారు ఇగ్నిస్. ఈ ఇగ్నిస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కార్లపై మొత్తం రూ.47 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.25 వేలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ గా రూ.15 వేలు, కార్పొరేట్ బెనిఫిట్ రూ.7,000 లభిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలతో మొత్తం రూ.42 వేల వరకు ఆదా చేయొచ్చు.
మారుతి సుజుకి స్విఫ్ట్‌తోపాటు హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి కార్లతో మారుతి ఇగ్నిస్ తల పడుతుంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్.. 83 బీహెచ్‌పీల విద్యుత్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్‌తో వస్తుంది. ప్రస్తుతం ఇగ్నిస్ కారు రూ.5.84 లక్షల నుంచి రూ.8.16 లక్షల మధ్య పలుకుతుది.
సియాజ్‌పై రూ.35 వేల వరకూ పొదుపు
మారుతి సుజుకి పాత మోడల్ కార్లలో సియాజ్ ఒకటి. దీనిపై గరిష్టంగా రూ.35 వేల డిస్కౌంట్ అందుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. కస్టమర్లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూపంలో రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూపేణా రూ.10 వేల రాయితీ పొందొచ్చు.
సియాజ్ కారు 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు ఇంజిన్ 105 హెచ్పీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్ వ్యాగన్ విర్టస్‌తోపాటు త్వరలో మార్కెట్‌లోకి రానున్న సెడాన్ హ్యుండాయ్ వెర్నా కార్లకు సియాజ్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.9.30 లక్షల నుంచి రూ.12.29 లక్షల మధ్య పలుకుతుంది.
బాలెనోపై రూ.20 వేల వరకు బెనిఫిట్లు
మారుతి సుజుకిలో పాపులర్ మోడల్ కార్లలో ఒకటి బాలెనో. దీనిపై ఈ నెలాఖరు వరకు రూ.20 వేల వరకు గరిష్ట డిస్కౌంట్ అందుకోవచ్చు. డెల్టా అండ్ జేటా మాన్యువల్ వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.10 వేలు పొందొచ్చు. ఇతర వేరియంట్ కార్లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మాత్రమే పొందొచ్చు. బాలెనో సీఎన్జీ వేరియంట్లపై ఏ బెనిఫిట్లు ఇవ్వడం లేదు.
1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 90హెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బ్యాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కారు ఇంజిన్ 77.5 హెచ్‌పీల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్, హ్యుండాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లతో తల పడుతుంది. ఈ కారు ధర రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 లక్షల వరకు పలుకుతుంది.