జియో ఎయిర్‌ఫైబర్.. హైదరాబాద్ సహా 8 నగరాల్లో సేవలు ప్రారంభం.. ఇవే ఫీచర్లు
ఇండియాలో జియో టెలికాంకు 15 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఉన్నది. దీంతో ఇప్పటికే నగరాలు, పట్టణాలు, గ్రామాలతో కలిపి 2 కోట్ల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే అవకాశం ఉన్నది.
వినాయక చవితి సందర్భంగా దేశీయ టెలీకమ్యునికేషన్స్, ఇంటర్నెట్ దిగ్గజం జియో.. మరో సంచలనానికి తెర తీసింది. ఆగస్టులో జరిగిన 48వ ఏజీఎంలో ప్రకటించినట్లుగానే 'జియో ఎయిర్ ఫైబర్'ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. టెక్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ సేవలు ఈ రోజు (సెప్టెంబర్ 19) నుంచి హైదరాబాద్ సహా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణే నగరాల్లో ప్రారంభం అయ్యాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని దేశంలోని మారుమూలు ప్రాంతాలకు కూడా అందించాలనే లక్ష్యంలో భాగంగానే జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది.
ఇండియాలో జియో టెలికాంకు 15 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఉన్నది. దీంతో ఇప్పటికే నగరాలు, పట్టణాలు, గ్రామాలతో కలిపి 2 కోట్ల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే అవకాశం ఉన్నది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యల కారణంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించలేక పోతున్నది. ఉదాహరణకు ఏదైనా మారుమూల పల్లెలో ఒకరిద్దరు నివసిస్తుంటే వారికి హై-స్పీడ్ బ్రాండ్ బాండ్ అందించడం వీలుండటం లేదు. కేవలం ఒకరిద్దరి కోసం కిలోమీటర్ల కొద్దీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయడం కష్టంగా మారుతోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న జియో ఫైబర్‌కు, జియో ఎయిర్ ఫైబర్‌కు ఎలాంటి సంబంధం లేదు. జియో ఎయిర్ ఫైబర్ పూర్తిగా వైర్ లెస్ డివైజ్. ఈ పరికరాన్ని ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గర్లోని జియో టవర్ నుంచి సిగ్నల్స్ అందుకొని.. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్‌లో ఎంత వేగమైతే వస్తుందో దాదాపు అంత వేగాన్ని జియో ఎయిర్ ఫైబర్ ద్వారా పొందవచ్చు. ఇదొక ప్లగ్ అండ్ ప్లే డివైజ్ కావడంతో సులభంగానే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంట్లోని ఎన్ని డివైజ్‌లకు అయినా జియో ఎయిర్ ఫైబర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్‌లో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. వైఫై 6 సపోర్ట్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా జియో అందిస్తోంది. జియో ఎయిర్ ఫైబర్‌ను ఫోన్ యాప్ సాయంతో నియంత్రించ వచ్చు. ఈ యాప్‌తో వైబ్‌సైట్లను కూడా బ్లాక్ చేసుకునే సదుపాయం ఉన్నది. ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్ బేసిక్, జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లతో ఈ డివైజ్ కొనుగోలు చేయవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్‌లో 30 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్‌లతో రెండు ప్లాన్లు ఉన్నాయి. ఇక జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్, 500 ఎంబీపీఎస్, 1 టీబీ వేగంతో ఉండే ప్లాన్లు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ రూ.599 నుంచి మ్యాక్స్ ప్లాన్ రూ.3999 వరకు ఉన్నాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా ప్లాన్‌కు అనుగుణంగా వస్తాయి. ఇన్‌స్టాలేషన్ చార్జీల కింద రూ.1,000 వసూలు చేస్తారు. 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఉచితంగా చేస్తారు.
♦