Telugu Global
Business

ఐఫోన్ కొత్త ఫీచర్లు.. ఈ ఏడాదే రిలీజ్!

ఇష్టమైన ఫొటోలను కూడా వాల్‌పేపర్‌గా సెట్‌ చేసుకోవచ్చు. కలర్‌ ఆప్షన్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ కలర్స్‌ను మార్చుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌పై విడ్జెట్లను ఎంచుకోవచ్చు. ఇష్టమైన ఫాంట్స్‌, రంగులను యాడ్ చేసుకోవచ్చు.

Apple iPhone 16
X

ఐఓఎస్‌ 16 ఫైనల్ వెర్షన్‌ ఈ ఏడాది చివర్లో కనువిందు చేయనుంది. ఈ కొత్త వెర్షన్‌లో ఎన్నో మార్పులు, మరెన్నో అప్‌డేట్‌లు ఉండబోతున్నాయి. అవేంటో చుసేద్దామా మరి.

కొత్త యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ లేదా కొత్త ఐఓఎస్ వస్తోందనగానే అంచనాలు భారీగా పెరిగిపోతాయి. అయితే వాటిని నిలబెట్టుకోవటంలో ఐఫోన్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ సంవత్సరం ఐఓఎస్‌లో రానున్న భారీ మార్పులేంటంటే.. కొత్త ఐఫోన్‌లో స్క్రీన్ అన్‌లాక్‌ చేయకుండానే ఎన్నో పనులు చేసుకోవచ్చు. స్క్రీన్‌ మీద కాసేపు నొక్కి పట్టి సెటింగ్స్‌లోకి వెళ్లొచ్చు. దీని ద్వారా వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. ఇష్టమైన ఫొటోలను కూడా వాల్‌పేపర్‌గా సెట్‌ చేసుకోవచ్చు. కలర్‌ ఆప్షన్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ కలర్స్‌ను మార్చుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌పై విడ్జెట్లను ఎంచుకోవచ్చు. ఇష్టమైన ఫాంట్స్‌, రంగులను యాడ్ చేసుకోవచ్చు.

యాపిల్ తెస్తున్న మరో ముఖ్యమైన ఫీచర్‌ లైవ్‌ యాక్టివిటీస్‌. మ్యూజిక్‌, స్పోర్ట్స్ వంటి వాటికోసం లాక్డ్‌ స్క్రీన్‌లో ప్రత్యేకంగా ఫీచర్‌ను జతచేశారు. లాక్ స్క్రీన్ నుంచే ఆయా అప్‌డేట్స్‌ను పొందొచ్చు. యాపిల్ నుంచి రాబోతున్న మరో ముఖ్యమైన ఫీచర్ మెసేజ్‌లను ఎడిట్‌, అన్‌సెండ్ చేసుకునే ఆప్షన్. ఐఓఎస్‌ 16లో పొరపాటున పంపించిన మెసేజ్‌ను అన్‌సెండ్ చేయొచ్చు. మెసేజ్ మీద కాసేపు నొక్కి ఉంచితే ఎడిట్‌, అన్‌డూ సెండ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ఎడిట్‌ను ఎంచుకుని కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. లేదా అన్‌సెండ్ చేయొచ్చు. అన్‌సెండ్ చేసినప్పుడు అవతలి వారికి మెసేజ్‌ కనిపించకూడదంటే అవతలివారి ఫోన్‌లో కూడా ఐఓఎస్‌ 16 ఉండాలి.

యాపిల్ తెస్తున్న మరో ఫీచర్ మెసేజ్ కేటగిరీలు. మేసేజ్‌లను ట్రాన్సాక్షన్స్‌, ప్రమోషన్స్‌ విభాగాల్లో 12 సబ్ కేటగిరీలుగా విభజించుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్‌లో ఫైనాన్స్‌, రిమైండర్స్‌, ఆర్డర్స్‌, హెల్త్‌, పబ్లిక్‌ సర్వీసెస్‌, వెదర్‌, రివార్డ్స్‌గా విడదీసుకోవచ్చు. ప్రమోషన్స్‌లో ఆఫర్స్‌, కూపన్స్‌ వారీగా విభజించుకోవచ్చు. ఐఓఎస్ 16లో మెయిల్‌ను షెడ్యూల్ చేసుకునే ఫీచర్ కూడా ఉండబోతోంది. మెయిల్‌ను టైప్ చేస్తున్నప్పుడే దాన్ని తర్వాత పంపించుకునేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. మెసేజ్‌ మీద 'మార్క్‌ ఫర్‌ లేటర్‌' ఎంచుకుంటే దాని గురించి యాప్‌ తర్వాత మరోసారి గుర్తు చేస్తుంది. అప్పుడు మెయిల్‌ను ఒకసారి చెక్ చేసుకుని సెండ్ చేయొచ్చు.

ఇకపోతే ఫొటోస్‌కు సంబంధించి 'ఐక్లౌడ్‌ షేర్డ్‌ ఫొటో లైబ్రరీ' అనే కొత్త ఆప్షన్‌ ను తీసుకురానుంది యాపిల్. ఈ ఫీచర్‌‌తో ఇతర కుటుంబ సభ్యులు తీసిన మీ ఫొటోలకు విడిగా ఫీడ్‌ జనరేట్‌ అవుతుంది. అలాగే హిడెన్‌, డిలీటెడ్‌ ఫొటోలకు లాక్డ్‌ ఫోల్డర్ల ఫీచర్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కొత్త ఐఓఎస్. దీంతో ఫోన్‌లో చాలా స్పేస్‌ ఆదా అవుతుంది. ఇక వీటితో పాటు ఫొటో మీద టెక్ట్స్‌ను స్పష్టంగా చూపే లైవ్ టెక్ట్స్‌, ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌ను వేరు చేసే ఫీచర్, లేటెస్ట్ ఇమేజ్ ఎడిటింగ్ వంటి సరికొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది.

యాపిల్ తీసుకురానున్న మరో ఫీచర్ కంటిన్యుటీ కెమెరా. ఈ ఫీచర్‌తో ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా వాడుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ మీద ఐఫోన్‌ను తగిలించి కంటిన్యూటీ కెమెరా ఆప్షన్‌ను ఆన్‌ చేస్తే అది మ్యాక్‌ వెబ్‌క్యామ్‌గా మారిపోతుంది. అలాగే ఏడు భాషల్లో డిక్షనరీ, సఫారీలో షేర్డ్‌ ట్యాబ్స్, ఫైళ్లను వెతకటానికి తోడ్పడే స్పాట్‌లైట్‌లో మార్పులు.. ఇలా బోలెడు ఫీచర్లు తెస్తోంది. ఈ కొత్త ఐఓఎస్ 16 ఐఫోన్‌ 8, ఆ తర్వాతి మోడళ్లకు సపోర్ట్ చేస్తుంది. సఫారీ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి beta.apple.com అని టైప్‌ చేసి ఓఎస్ బీటా వెర్షన్‌ను ట్రై చేయొచ్చు.

First Published:  9 Aug 2022 8:00 AM IST
Next Story