Gold ETFs | రికార్డ్ బ్రేక్ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో భారీగా తగ్గిన పెట్టుబడులు.. కారణాలివేనా..?!
Gold ETFs | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం. ఇంట్లో జరిగే పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు, ప్రతి పండక్కి పిసరంత బంగారం కొంటూ ఉంటారు.
Gold ETFs | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం. ఇంట్లో జరిగే పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు, ప్రతి పండక్కి పిసరంత బంగారం కొంటూ ఉంటారు. లేకపోతే ఉన్న ఆభరణాలే ధరిస్తారు. కానీ దేశీయ అవసరాలకు సరిపడా బంగారం నిల్వల్లేవు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే.. బంగారం పట్ల భారతీయుల్లో, మహిళల్లో ఉన్న ఆసక్తిని గమనించిన కేంద్రం డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. బ్యాంకుల్లోనూ డిజిటల్ బంగారం కొనుగోలు చేయొచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ `గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)`లో పెట్టుబడులు పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ కొనుగోలు చేసినట్లే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మన శక్తికొద్దీ పెట్టుబడి పెట్టొచ్చు. వాటి విలువ యధాతథంగా ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇన్వెస్టర్లు తమ వెసులుబాటు ఆధారంగా వీటిల్లో పెట్టుబడులు పెడతారు. ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు 17 నెలల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సెప్టెంబర్‌లో `గోల్డ్ ఈటీఎఫ్`ల్లో పెట్టుబడులు రూ.175 కోట్లకు పడిపోయాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) తెలిపింది. ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రికార్డు స్థాయిలో రూ.1028 కోట్ల పెట్టుబడులు పెడితే, జూలైలో రూ.456 కోట్ల పెట్టుబడులు మదుపు చేశారు.
ఇప్పటికీ అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం ఉండటంతో అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు కొనసాగిస్తామని ప్రకటించింది. వృద్ధిరేటు నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గించుకునేందుకు స్వర్గధామ పెట్టుబడి మార్గం బంగారంపై మదుపు అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రీసెర్చ్ మేనేజర్-అనలిస్ట్ మెల్వియన్ సంతారియా చెప్పారు.
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు రూ.298 కోట్లు మాత్రమే. అంతకుముందు గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్లు రూ.1,243 కోట్లు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.320 కోట్లు, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.165 కోట్లు పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చి చేరాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆగస్టు నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్లు రూ.1100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2022 ఏప్రిల్ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు గరిష్ఠ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. `మార్చి తర్వాత భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల ఆల్ టైం గరిష్థ స్థాయి నుంచి దిగి రావడంతో కొనుగోళ్లకు కొంత అవకాశం లభించింది.
గత కొన్నేండ్లలో బంగారంలో పెట్టబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. నిరంతరం పెరుగుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఖాతాలు ఆగస్టులో 47.95 లక్షలు ఉండగా, సెప్టెంబర్‌లో సుమారు 11 వేలు పెరిగి 48.06 లక్షలకు పెరిగాయి. బంగారం ఆధారిత ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
అయినా, ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.24,318 కోట్ల విలువైన పెట్టుబడులు నమోదైతే, గత నెలలో రూ.23,800 కోట్లకు దిగి వచ్చాయి. ఫిజికల్ బంగారం (స్వచ్ఛత) ధరల ఆధారంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ ఖరారు చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లతోపాటు స్టాక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.