Credit Cards | క్రెడిట్ కార్డులతోపాటు పెరుగుతున్న స్పెండింగ్.. డెబిట్ కార్డు కంటే ఆ సేవలే పైపైకి..!
Credit Cards | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్.. ఆన్‌లైన్ చెల్లింపులే.. కొవిడ్-19 మహమ్మారితో మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ (UPI) చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Credit Cards | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్.. ఆన్‌లైన్ చెల్లింపులే.. కొవిడ్-19 మహమ్మారితో మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ (UPI) చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తదనుగుణంగా క్రెడిట్ కార్డుల వాడకమూ పుంజుకుంటున్నది. గత ఏప్రిల్ నాటికి దేశంలో 8.65 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు చలామణిలోకి వచ్చేశాయి. 2023 మార్చిలో 7.5 కోట్ల క్రెడిట్ కార్డులు, ఏప్రిల్ నాటికి 15 శాతం పెరిగాయని ఆర్బీఐ డేటా, బ్యాంక్ బజార్ డేటా పేర్కొంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా క్రెడిట్ కార్డు ఖాతాదారుల సంఖ్య పది కోట్లు దాటుతుందని అంచనా.
క్రెడిట్ కార్డుల వాడకం తీరుతెన్నులిలా..
అంతే కాదు క్రెడిట్ కార్డుల వాడకం మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో సగటున 9.37 శాతం వృద్ధి చెందింది. 2023 ఏప్రిల్‌లో రమారమీ ఒక్కో క్రెడిట్ కార్డుపై రూ.5,120 స్పెండ్ చేస్తే, నెల పొడవునా రూ.15,388 ఖర్చు అవుతున్నది. 2022 ఏప్రిల్‌లో సగటున రూ.4731 ఖర్చయితే, నెల పొడవునా రూ.14,070 స్పెండ్ చేశారు. ఇక ఈ ఏడాదిలోపుగానీ, తర్వాత గానీ భారతీయులు వాడుతున్న క్రెడిట్ కార్డులు పది కోట్లు దాటతాయని తెలుస్తున్నది. క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుదలకు అనుగుణంగా వాటిపై ఔట్ స్టాండింగ్ రుణాలు 30 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి.
క్రెడిట్ కార్డు వాడకం పెరుగుదలకు కారణాలివీ..
రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, ప్రీమియం లైఫ్‌స్టైల్ రివార్డ్స్ కోసం భారతీయుల్లో క్రెడిట్ కార్డుల వాడకానికి ప్రోత్సాహం పెరుగుతోంది. సగటు క్రెడిట్ కార్డుల లావాదేవీల్లో నికరమైన గ్రోత్ ఉండటానికి ఈ ప్రోత్సాహాలే కారణం. సగటున ఒక్కో క్రెడిట్ కార్డుపై రూ.15,388 ఖర్చవుతున్నది.
డెబిట్ కార్డులపై యూపీఐ సేవలదే పైచేయి
ట్రావెల్, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు, డైనింగ్, షాపింగ్ వంటి భారీ ఖర్చుల్లో క్రెడిట్ కార్డుల ఆధిపత్యం ఉన్నా, గ్రాసరీ కొనుగోళ్ల కోసం చిన్న మొత్తాల ఖర్చుల్లో యూపీఐ పేమెంట్స్ గణనీయ స్థానాన్నే ఆక్రమించాయి. 2023 ఏప్రిల్‌లో 886 కోట్ల లావాదేవీల్లో రూ.14 లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. సగటున యూపీఐ ద్వారా రూ.1600 చెల్లింపులు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో 558 కోట్ల లావాదేవీల్లో రూ.9.8 లక్షల కోట్ల చెల్లింపులు నమోదయ్యాయి. డెబిట్ కార్డు లావాదేవీలు రోజురోజుకు తగ్గుతున్నాయి. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 23 కోట్లు (30 శాతం), వాటి విలువలో 16 శాతం డెబిట్ కార్డుల వాడకం తగ్గింది. డెబిట్ కార్డుల వాడకంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల స్పెండింగ్ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 25 కోట్ల మర్చంటైజ్ కార్డు లావాదేవీలు జరిగితే.. గతేడాది 22 కోట్ల లావాదేవీలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
ఆ ఐదు బ్యాంకులదే ప్రధాన వాటా
దేశీయంగా క్రెడిట్ కార్డుల పరిశ్రమలో యాక్సిస్ బ్యాంకుదే అత్యధిక మార్కెట్ షేర్. యాక్సిస్ బ్యాంకుతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు దేశీయ క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో 71 శాతం వాటా ఉంది. ఇటీవలి కాలంలో కాథలిక్ సిరియన్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వాడకం ప్రతి నెల సగటున నాలుగుశాతం ఖర్చవుతున్నది. కరూర్ వైశ్యాబ్యాంక్, ఇండస్ఇండ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా రూ.27 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో క్రెడిట్ కార్డుల వాడకంలో 63 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.