Credit Card- Home Loans | 28 ఏండ్లకే క్రెడిట్ కార్డ్.. 40 ఏండ్ల లోపు ఇంటి రుణం.. రుణపరపతి పట్ల అటెన్షన్..!
Credit Card- Home Loans | ఆదాయం పెరుగుతున్నా కొద్దీ అవసరాలకు అనుగుణంగా భారతీయులు రుణాలు పొందడం, ఇతర రుణ పరపతి పొందడం తేలిగ్గా మారింది.
Credit Card- Home Loans | ఆదాయం పెరుగుతున్నా కొద్దీ అవసరాలకు అనుగుణంగా భారతీయులు రుణాలు పొందడం, ఇతర రుణ పరపతి పొందడం తేలిగ్గా మారింది. పర్సనల్ లోన్ మొదలు కారు లేదా ఇల్లు కొనుగోలు కోసం రుణ పరపతిని బెస్ట్ ఆప్షన్‌గా భారతీయులు భావిస్తున్నారు. ఐటీ నైపుణ్యం, బిజినెస్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో త్వరితగతిన నైపుణ్యం సంపాదించడంతో కుర్రాళ్లు ఉద్యోగాలు.. ఆదాయాలు సంపాదిస్తూనే ఉన్నారు. తమ ఆదాయాలతోపాటు పెరిగిన అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడేస్తున్నారు. సగటున 28 ఏండ్లకే భారతీయులు క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. 57 శాతం మంది 30 ఏండ్లలోపు, 24 శాతం మంది 25 ఏండ్లకే క్రెడిట్ కార్డు అందుకుంటున్నారని పైసా బజార్ డాట్ కామ్ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 3.7 కోట్ల మంది వినియోగదారుల క్రెడిట్ డేటాను పైసా బజార్ విశ్లేషించింది. స్వయం ఉపాధిపై బతికే వారితో పోలిస్తే.. వేతన జీవుల సిబిల్ స్కోర్ బేషుగ్గా 770 పాయింట్ల వద్ద నిలుస్తోంది.
దేశంలోని 10 ప్రధాన నగరాల్లో క్రెడిట్ కార్డు దారులు, పర్సనల్ రుణాలు, ఇంటి రుణాలపై పైసాబజార్ విశ్లేషించింది. వాటిల్లో హైదరాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, సూరత్, అహ్మదాబాద్, పుణె, కోయంబత్తూరు క్రెడిట్ హెల్త్ నగరాలుగా నిలిస్తే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు అత్యంత క్రెడిట్ హెల్త్ సిటీగా నిలిచింది.
ఇదిలా ఉంటే, సగటున 28 ఏండ్లకు క్రెడిట్ కార్డు తీసుకుంటున్న ఇండియన్స్.. రమారమీ 29వ ఏటా పర్సనల్ లోన్, గృహోపకరణాల రుణం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవిత కాల స్వప్నం సొంతిల్లు. సొంతింటి కోసం సగటున 33 ఏండ్లకు రుణం పొందుతున్నారు.
సగం మందికి పైగా వినియోగదారులు 30 ఏండ్ల లోపే పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందుతున్నారు. 31 శాతం మంది మాత్రమే 30 ఏండ్లలోపే సొంతింటి రుణాలు పొందుతున్నారని తేలింది. 25 ఏండ్ల లోపు వారు ఎనిమిది శాతం ఇండ్ల కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటూ ఉంటే.. తొలిసారి సొంతింటి కోసం రుణం పొందుతున్న వారిలో 45 శాతం మంది 30-40 ఏండ్ల మధ్య వయస్కులు ఉంటారు. 25-28 ఏండ్ల మధ్య తొలి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారు 30 ఏండ్ల లోపు 64 శాతం మంది తొలి క్రెడిట్ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తున్నారు. సగటున 30 ఏండ్ల వయస్సు గల వారు రెండు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతూనే.. ఒక పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు.
30-40 ఏండ్ల లోపు వయస్కుల్లో 52 శాతం మంది నిత్యం తమ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్నారు. 30 ఏండ్ల లోపు 14 శాతం మంది మాత్రమే తరుచుగా తమ సిబిల్ (క్రెడిట్) స్కోర్ తనిఖీ చేసుకుంటున్నారు. సిబిల్ (క్రెడిట్) స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. మీకు ఏదైనా రుణం ఇవ్వాలని బ్యాంకు లేదా క్రెడిట్ సంస్థ నిర్ణయం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ కీలకం. మీ క్రెడిట్ స్కోర్ 770 పాయింట్లకు పైగా ఉన్నట్లయితే మీ క్రెడిట్ హిస్టరీ హెల్తీగా ఉన్నట్లే.
క్రెడిట్ కార్డు యూజర్లలో స్త్రీ, పురుషుల మధ్య హెల్తీ క్రెడిట్ విషయంలో పెద్ద తేడాలేం లేవు. 20 శాతం పురుషులు, 19 శాతం మహిళా క్రెడిట్ కార్డు యూజర్లు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటున్నారు. మొత్తం క్రెడిట్ కార్డుల యూజర్లలో 88శాతం మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 12 శాతం మాత్రమే.