బంగారం కొనేముందు ఇవి గుర్తుంచుకోండి
మనదేశంలో బంగారాన్ని చాలా విలువైన సంపదగా భావిస్తారు. అయితే ఆ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆడవాళ్లు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెళ్లి, పండుగ, బర్త్ డే.. ఇలా ఏ అకేషన్ వచ్చినా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. మనదేశంలో బంగారాన్ని చాలా విలువైన సంపదగా భావిస్తారు. అయితే ఆ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
మీరు కొంటున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవాలంటే.. దానిపై ‘916’ హాల్ మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. ఈ మార్క్ ఉంటే ప్యూర్ గోల్డ్ అని అర్థం. అందుకే ఎంత చిన్న బంగారపు వస్తువైనా ఈ మార్క్ ఉండేలా చూసుకోవాలి.
బంగారం కొన్నప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. అలాగే ఆ బిల్లును జాగ్రత్తగా దాచుకుంటే బంగారాన్ని తిరిగి అమ్మేటప్పుడు అది ఉపయోగపడొచ్చు.
బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా నాణేలు, బిస్కట్ల రూపంలో కొంటున్నట్టయితే దానికోసం గోల్డ్ షాపుల కంటే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.
బంగారు ఆభరణాల్లో రాళ్లు, పగడాలు లాంటివి ఉన్నప్పుడు బరువు తూకాన్ని జాగ్రత్తగా సరిచూసుకోవాలి. తూకంలో మోసాలు జరగకుండా చూసుకోవాలి. అలాగే బంగారం కొనేటప్పుడు తరుగు, మజూరీ వంటి వాటిని బిల్లులో ఎలా లెక్కకడుతున్నారో గమనించాలి. వ్యాల్యూ యాడెడ్ ఛార్జీల వంటి వాటి గురించి తెలుసుకోవాలి. బంగారం కొనుగోలు విషయంలో మోసం జరిగినట్టు గమనిస్తే వెంటనే కంజ్యూమర్ కోర్టును ఆశ్రయించాలి.