బీటెక్ అవ్వగానే జాబ్ రావాలంటే ఈ స్కిల్స్ ఉండాలి!
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కోర్సు పూర్తవ్వగానే జాబ్‌లో చేరాలనుకుంటారు.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కోర్సు పూర్తవ్వగానే జాబ్‌లో చేరాలనుకుంటారు. అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మొదటి సంవత్సరం నుంచే ఏడాదికి ఒకట్రెండు స్కిల్స్ చొప్పున నాలుగైదు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకుంటే చాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రావాలంటే మార్కులతో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీస్‌పై అవగాహన ఉండాలి. ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్‌ను ‘ఇండస్ట్రీ 4.0 స్కిల్స్’గా పిలుస్తున్నారు. అవే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ డిజైన్, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు. వీటిలో ఏదోఒకదానిపై పట్టు సాధిస్తే డిజిటల్ యుగంలో రాణించడం పక్కా.
మరో నాలుగైదు ఏళ్లలో అన్నిరంగాల్లో ఆటోమేషన్ హవా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఇప్పట్నుంచే ఆటోమేషన్ స్కిల్స్‌ను నేర్చుకోవడం అవసరం. ఇంజినీరింగ్‌లో బ్రాంచ్ ఏదైనా.. ఆయా ఇండస్ట్రీలో ఎలాంటి అప్‌డేట్స్ వస్తున్నాయో గమనించాలి. ఐటీతో పాటుగా సివిల్, మెకానికల్, కమ్యూనికేషన్ రంగాల్లో కూడా ఆటోమేషన్ టెక్నాలజీలు ఎంట్రీ ఇస్తున్నాయి. కాబట్టి ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్ వంటివి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి.
ఐటీ విద్యార్థులు ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ,సైబర్ సెక్యూరిటీస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఫ్యూచర్‌లో ఆ స్కిల్స్‌కు డిమాండ్ పెరగనుంది. అలాగే కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ఇప్పట్నుంచే ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకోవాలి.
ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఫైబర్ టెక్నాలజీస్, సిగ్నల్ ప్రాసెసింగ్ వంటివి నేర్చుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో వెంటనే జాబ్ పొందే వీలుంటుంది.
ఇక ఈఈఈ బ్రాంచ్ విషయానికొస్తే.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి స్కిల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే మెకానికిల్ బ్రాంచ్ విద్యార్థులు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్ స్కిల్స్‌ను తప్పక నేర్చుకోవాలి.
లేటెస్ట్ టెక్నాలజీలను నేర్చుకునేందకు ఆన్‌లైన్‌లో బోలెడు మార్గాలున్నాయి. స్కిల్ షేర్, లింక్డ్‌ఇన్ లెర్నింగ్, యుడెమీ, కోర్స్ ఎరా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు చేయొచ్చు. అలాగే వాటికి సంబంధించిన రియల్ టైం నాలెడ్జ్ కోసం ఇంటర్న్‌షిప్స్ వంటివి చేసే ప్రయత్నం చేయాలి.
ఇక వీటితోపాటు ఉద్యోగం సాధించడానికి సాఫ్ట్ స్కిల్స్ కూడా ముఖ్యమే. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటి వాటిని అలవర్చుకోవాలి.