పాన్ కార్డు లేకుండా బంగారం కొంటే పెనాల్టీ చెల్లించాలా.. క్యాష్ పేమెంట్స్‌కు అనుమతించరా..!
ఆదాయం పన్ను చట్టం 271డీ సెక్షన్ ప్రకారం ఒక రోజులో రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
బంగారం అంటే భారతీయలకు ఎంతో ఇష్టం.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. బంగారం అన్నా, ఆభరణాలు అన్నా ఎంతో ప్రాణం పెడతారు. వీలైతే పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్లకు పిసరంత బంగారం కొంటుంటారు. సాధ్యం కాని వారు తమ వద్ద ఉన్న ఆభరణాలను ధరించడానికి ప్రాధాన్యం ఇస్తారు. బంగారం కేవలం ఆభరణాలకు మాత్రమే కాక, పెట్టుబడి ఆప్షన్‌గా కూడా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
తాజాగా `క్లీన్ నోట్ పాలసీ`లో భాగంగా గతవారం రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్ చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించగానే, చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లతో బంగారం కొనుగోళ్లకు పరుగులు తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఎటువంటి గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) / పాన్ కార్డు లేకుండా ఒక వ్యక్తి చట్ట బద్ధంగా ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు అన్నది సందేహం నెలకొన్నది. పాన్ కార్డు సమర్పించిన తర్వాత క్యాష్‌తో బంగారం కొనుగోళ్లకు ఏదైనా లిమిట్ ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
నగదుతో బంగారం ఆభరణాల కొనుగోళ్లను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2002 నాటి హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద క్యాష్‌తో బంగారం, ఆభరణాల కొనుగోలు నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు 2020 డిసెంబర్ 28న కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట లిమిట్ దాటితే బంగారం కొనుగోళ్లకు కేవైసీ పత్రాలు (పాన్, ఆధార్ కార్డు) సమర్పించాలని, రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ గల బంగారం కొనుగోళ్లు జరిపితే సంబంధిత వ్యక్తులు కేంద్ర ప్రభుత్వానికి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది.
ఆదాయం పన్ను చట్టం-1961లోని 269 ఎస్టీ సెక్షన్ కింద ఒక రోజు రూ.2 లక్షలకు మించి నగదు చెల్లించి బంగారం ఆభరణాలు కొనుగోలు చేయకూడదు. అలా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువ గల బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తే ఆదాయం పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆదాయం పన్ను చట్టం 271డీ సెక్షన్ ప్రకారం ఒక రోజులో రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ.4 లక్షల బంగారం ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకున్నారనుకోండి.. రూ.2 లక్షలు దాటితే క్యాష్‌తో బంగారం ఆభరణాల కొనుగోలుకు ఆదాయం పన్ను చట్టంలోని 269 ఎస్టీ సెక్షన్ కింద అనుమతి ఉండదు. కానీ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం కొనుగోళ్లు చేసినందుకు ఇదే చట్టంలోని 271డీ సెక్షన్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటది. రూ.4 లక్షల విలువైన బంగారం ఆభరణాల విక్రయానికి క్యాష్ తీసుకున్నందుకు సంబంధిత బంగారం వ్యాపారి పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. తామే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది గనుక రూ.2 లక్షల కంటే ఎక్కువ క్యాష్‌తో బంగారం ఆభరణాల కొనుగోలుకు బంగారం వ్యాపారులు అనుమతించరు.
ఆదాయం పన్ను చట్టం-1962 చట్టంలోని 114బీ సెక్షన్ ప్రకారం రూ.2 లక్షలు, అంత కంటే ఎక్కువ మొత్తం విలువ గల బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తే (క్యాష్ లేదా డిజిటల్) చెల్లింపులతో సంబంధం లేకుండా సంబంధిత బంగారం వ్యాపారికి పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి. రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం నగలు కొనుగోలు చేస్తే డిజిటల్ పేమెంట్స్ చేసినా సరే పాన్ లేదా ఆధార్ కార్డు సమర్పించాల్సిందే అని కరణ్ జావాలా అండ్ కో సంస్థ పార్టనర్ మేఘనా మిశ్రా వ్యాఖ్యానించారు.