Homes | హైదరాబాద్ సహా 8 నగరాల్లో ఇండ్లకు ఫుల్ గిరాకీ
Homes | కరోనా మహమ్మారి తర్వాత మెట్రో నగరాలు మొదలు మామూలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
Homes | కరోనా మహమ్మారి తర్వాత మెట్రో నగరాలు మొదలు మామూలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇండ్ల నిర్మాణ ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. దీని ప్రభావం ఇండ్ల ధరలపైనా పడుతున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్లకు గిరాకీ పెరగడంతోపాటు అధిక నిర్మాణ ఖర్చుల వల్ల గత జనవరి-మార్చి మధ్య దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో గరిష్టంగా ఇండ్ల ధరలు 16 శాతం పెరిగాయని రియల్టర్స్ అపెక్స్ బాడీ క్రెడాయ్, కొల్లియర్స్ అండ్ లియాసెస్ ఫొరాస్ సంయుక్తంగా రూపొందించిన `హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ క్యూ1-2023` నివేదిక పేర్కొంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ ఇండ్ల ధరలు సగటున 13 శాతం పెరిగిపోయాయి. చదరపు అడుగు విస్తీర్ణం (ఎస్ఎఫ్‌టీ) ధర రూ.10,410 పలుకుతున్నది. ఉదాహరణకు 1300 ఎస్ఎఫ్‌టీ గల ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్ మీరు కొందామనుకున్నారనుకోండి.. దాని ధర రూ.1,33,35,000.. అంటే రూ.17.59 లక్షలు అదనంగా పెరిగిందన్నమాట. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో రెండు శాతం ధరలు తగ్గడం ఆసక్తికర పరిణామం.
హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో 2022 జనవరి-మార్చి మధ్య కాలంతో పోలిస్తే ఎనిమిది శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అత్యధికంగా 16 శాతం, కోల్‌కతాలో 15, బెంగళూరులో 14 శాతం ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మూడేండ్లుగా (11 త్రైమాసికాలు) స్థిరంగా ఇండ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
ఎనిమిదవ జాతీయ రహదారితో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అనుసంధానానికి సెంట్రల్ పెరిఫెరల్ రోడ్డుపై రాకపోకలు ప్రారంభించడంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే పరిధిలో 2022తో పోలిస్తే 59 శాతం ఇండ్ల ధరలు పెరిగాయని ఈ నివేదిక సారాంశం. గుర్‌గ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్ పరిధిలో 42 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో ధరలతో సమానంగా ఎన్సీఆర్ పరిధిలోని గోల్ఫ్ కోర్స్ రోడ్డు ప్రాంతంలోని ఇండ్ల ధరలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండ్ల ధరలు 11 శాతం, అంటే చదరపు అడుగు (ఎస్ఎఫ్‌టీ) ధర రూ.6,324 పెరిగింది. బెంగళూరులో రూ.6,748, చెన్నైలో మోస్తరుగా నాలుగు శాతం అంటే రూ.7,395 ధర పెరిగింది. కోల్‌కతాలో చదరపు అడుగు (ఎస్ఎఫ్‌టీ) రూ.7,211 చొప్పున ఇండ్ల ధరలు 15 శాతం వృద్ధి చెందాయి. పూణేలో 11 శాతం చొప్పున చదరపు అడుగు రూ.8,352 పెరిగాయి. ఇదిలా ఉంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రెండు శాతం పడిపోయి రూ.19,219కి చేరుకున్నది. ఇక ముందు కూడా ఇండ్ల ధరలు మోస్తరుగా పెరుగుతాయని అంచనా వేస్తున్నామని లియాసిస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ పేర్కొన్నారు.
ముడి సరుకు పిరం కావడంతో ఇండ్ల ధరలు పెరిగినా ప్రజల నుంచి నిరంతరం గిరాకీ కొనసాగుతుందని క్రెడాయ్ అధ్యక్షుడు బొమన్ ఇరానీ చెప్పారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రజలు మెరుగైన వసతులతో కొత్త, పెద్ద ఇండ్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారన్నారు. అంతర్జాతీయ ఒడిదొడుకులు కొనసాగుతున్నా, రుణాలపై వడ్డీరేట్లు పెరిగినా సొంతింటి పట్ల డిమాండ్ యధాతథంగా కొనసాగుతున్నదని కొల్లియర్స్ ఎండీ పీయూష్ జైన్ స్పష్టం చేశారు. అందుబాటు ధర, నాణ్యతతోపాటు సొంతింటి కల సాకారం చేసుకోవాలన్న ఆకాంక్ష రోజురోజుకూ పెరిగిపోవడం వల్లే ఇండ్ల మార్కెట్ నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండ్లకు గిరాకీ పెరిగింది. 2022 ఏప్రిల్ వరకు హోమ్ లోన్లపై వడ్డీరేట్లు దశాబ్ధి క్రితం స్థాయికి పడిపోవడం కూడా ఇండ్లకు డిమాండ్ ఎక్కువ కావడం ఒక కారణం. కానీ ఏడాదిలోనే ఆర్బీఐ రెపోరేటు 250 బేసిక్ పాయింట్లు పెంచడంతో బ్యాంకులు కూడా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. 2021 వరకు వడ్డీరేట్లతో పోలిస్తే ఇండ్ల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.