బిలియనీర్స్ ఫాలో అయ్యే బెస్ట్ హ్యాబిట్స్ ఇవే..
బిలియనీర్స్ అందరిలో ఏదో ఒక పొదుపు అలవాటు కనిపిస్తుంటుంది. ‘సంపద పెంచుకోవాలంటే ఎక్కువ సంపాదించకపోయినా పర్వాలేదు ఉన్నదాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే చాలు’ అనేది బిలియనీర్స్ చెప్పేమాట.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఆమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఇప్పటికీ తన పాత హోండా అకోర్డ్ కారునే వాడతాడు. అత్యంత ధనికుల్లో మరొకరైన వారెన్ బఫెట్ తన బ్రేక్ ఫాస్ట్ కోసం మూడు డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడు. ఇవన్నీ ఎందుకు అనేగా మీ డౌట్. ఈ రోజుల్లో డబ్బు ఎంత విలువైందో అందరికీ తెలుసు. కానీ బిలియనీర్స్ ఎంతో ప్లాన్డ్‌గా డబ్బుని మేనేజ్ చేస్తుంటే, సామాన్యులు మాత్రం డబ్బు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అందుకే సంపదను పెంచుకోవడానికి బిలియనీర్స్ నుంచి కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి.
బిలియనీర్స్ అందరిలో ఏదో ఒక పొదుపు అలవాటు కనిపిస్తుంటుంది. ‘సంపద పెంచుకోవాలంటే ఎక్కువ సంపాదించకపోయినా పర్వాలేదు ఉన్నదాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే చాలు’ అనేది బిలియనీర్స్ చెప్పేమాట. ఇప్పుడున్న బిలియనీర్స్‌లో చాలామంది జీరోతో మొదలై అంచెలంచెలుగా పైకి ఎదిగిన వాళ్లే.. చిన్న చిన్న పొదుపు అలవాట్లు పాటించడం ద్వారా సంపదను కొద్దికొద్దిగా పెంచుకోవచ్చు. ఎంతోమంది బిలియనీర్స్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ వచ్చారు.
ఆశ వద్దు
ఎక్కువ కోసం ఆశ పడకుండా ఉన్నదాంతో సరిపెట్టుకోవడం అనేది మనీ హ్యాబిట్స్‌లో మొదటిది. సంపాదనే లక్ష్యంగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టడాన్ని తగ్గించాలి. ఉన్నదాంతో ఎంతవరకు సౌకర్యంగా ఉండగలరో అంతవరకే ఉండాలి. వారెన్ బఫెట్ ఆస్తి 86 బిలియన్స్ అంటే సుమారుగా ఆరు లక్షల కోట్లు. అయినా ఇప్పటికీ ఆయన 1958లో కొన్న తన పాత ఇంట్లోనే ఉంటాడు. ప్రపంచంలోని ధనికుల్లో ఒకడైనప్పటికీ ఆయన చేసే ఖర్చు ఒక సాధారణ వ్యక్తి చేసే ఖర్చులాగానే ఉంటుంది. ఇప్పటికీ బఫెట్ కూపన్స్ వాడి షాపింగ్ చేస్తాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయన మనీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందో..
అవసరమేనా?
చాలాసార్లు తెలియకుండానే ఎన్నో అనవసరమైన ఖర్చులు చేస్తుంటారు చాలామంది. ఇలాంటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిజంగా అవసరమా? కాదా? అనేది స్పష్టంగా తేల్చుకోవాలి. చాలాసార్లు ఖర్చు చేసేటప్పుడు ‘ఇది అవసరమే’ అనిపిస్తుంది. తీరా కొంతకాలానికి ‘అప్పుడది కొనకపోతే బాగుండేది’ అనిపిస్తుంది. అందుకే ఖర్చు చేసే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించడం అవసరం. బిలియనీర్స్ ఎప్పుడూ దుబారా ఖర్చు చేయరు. బట్టలు, చెప్పులు లాంటి టెంపరరీ సౌకర్యాల కంటే.. ఫ్యూచర్‌లో పనికొచ్చే వస్తువులపైనే ఎక్కువ ఖర్చు చేస్తారు. అందుకే బిల్ గేట్స్ నుంచి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వరకూ సాధారణ బట్టలే ధరిస్తారు తప్ప లగ్జరీకి పోరు.
అప్పులొద్దు
అప్పు చేసే అలవాటు ఉంటే సంపాదించే శక్తి ఎంత ఉన్నా వృథానే. ఎందుకంటే అప్పు ఎంతటి ఆస్తినైనా ఇట్టే కరిగించేస్తుంది. అయితే కొన్నిసార్లు అవసరాల కోసం లోన్స్ లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు తీసుకున్న మొత్తాన్ని సరైన టైంలో చెల్లించి, వెంటనే అప్పు నుంచి బయటపడాలి. అలా కాకుండా పాత అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేస్తూ పోతే చివరికీ తీర్చలేనంత అప్పు భారం మీద పడుతుంది. సంపాదనకు మించి అప్పు చేయడం చాలా ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ విషయంలో అందరూ ఇదే తప్పు చేస్తుంటారు. వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చులు పెడుతూ బిల్ కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.
ఇన్వెస్ట్‌మెంట్ ముఖ్యం
సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న డబ్బు కంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఉన్న డబ్బు ఎంతో కొంత మేలు చేస్తుందనేది నిపుణుల సలహా. ఖర్చు పెట్టడం కంటే దాచిపెట్టడం ఎంత బెటరో.. దాచిపెట్టడం కంటే ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే బెటర్. ముఖ్యంగా వయసు ఇరవైల్లో ఉన్నప్పుడు సంపాదనలో పది శాతం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే వయసు అరవైకి రాగానే అది లక్షల్లోకి మారే అవకాశం ఉంటుంది.
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘డబ్బుని తెలివిగా మేనేజ్ చేయడం వల్ల అప్పుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఉన్న డబ్బుని దాచిపెట్టడం కంటే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన పని. అదెంత అయినా అవ్వొచ్చు. రూపాయిని దాచిపెడితే అది ఎప్పటికీ రూపాయి లాగానే ఉంటుంది. అదే రూపాయిని ఇన్వె్స్ట్ చేస్తే అది మరో రూపాయిని సంపాదించేలా చేస్తుంది’’ అని చెప్పాడు.
పక్కా ప్లాన్‌తో..
ఆదాయం, ఖర్చులు, పొదుపు అనేవి వయసును బట్టి మారుతుంటాయి. ఇరవైల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా పక్కా ప్లాన్ వేసుకోవాలి. ఈ వయసు వాళ్లంతా అప్పుడే సంపాదన మొదలు పెట్టి ఉంటారు. అలాగే చాలామందికి పెద్ద బాధ్యతలేవీ ఉండవు. అందుకే ఈ వయసులో రిస్క్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుది. 20 నుంచి 30-ఏళ్ల వయసు వాళ్లు తమ సంపాదనలో ముప్పై నుంచి నలభై శాతం ఇన్వెస్ట్ చేసినా నష్టం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.