Telugu Global
Business

ఆండ్రాయిడ్ 13 వచ్చేస్తుంది! కొత్త ఫీచర్లివే..

ఆండ్రాయిడ్ 13లో యాప్‌లకు ఒక భాష, ఫోన్‌ సిస్టమ్‌కు మరో భాషను సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13లో మ్యూజిక్‌, పాడ్‌కాస్ట్ లాంటివి ప్లే అవుతున్నప్పుడు స్పాట్‌లైట్ ఆర్ట్‌వర్క్‌ స్క్రీన్‌పై కదిలే ఆప్షన్ ఉండబోతోంది.

ఆండ్రాయిడ్ 13 వచ్చేస్తుంది! కొత్త ఫీచర్లివే..
X

గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ 13ను విడుదల చేసింది. ఇందులో సెక్యూరిటీ, ప్రైవసీతో పాటు యూజర్ ఇంటర్‌‌ఫేస్‌లో కూడా పలు మార్పులు చేసింది. ఆండ్రాయిడ్ 13 ఎలా ఉండబోతుందంటే..

ఆండ్రాయిడ్ 13లో థర్డ్‌-పార్ట్‌ యాప్‌లను కూడా ఫోన్‌ వాల్‌పేపర్‌ థీమ్‌, కలర్‌కు తగినట్లుగా కస్టమైజ్‌ చేసుకునే ఆప్షన్ రాబోతోంది. హోమ్‌ స్క్రీన్‌ మరింత స్టైలిష్‌గా ఉండబోతోంది. వేర్వేరు భాషలు మాట్లాడే వారికి అనువుగా ఉండేలా లాంగ్వేజ్‌ విషయంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఆండ్రాయిడ్ 13లో యాప్‌లకు ఒక భాష, ఫోన్‌ సిస్టమ్‌కు మరో భాషను సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13లో మ్యూజిక్‌, పాడ్‌కాస్ట్ లాంటివి ప్లే అవుతున్నప్పుడు స్పాట్‌లైట్ ఆర్ట్‌వర్క్‌ స్క్రీన్‌పై కదిలే ఆప్షన్ ఉండబోతోంది. ఆండ్రాయిడ్ 13లో యూజర్ల వెల్‌బీయింగ్‌ కోసం కస్టమైజ్‌ బెడ్‌టైమ్‌ ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. ఇందులో డార్క్‌థీమ్‌, వాల్‌పేపర్‌ డిమ్ అవ్వడం వంటి ఫీచర్లున్నాయి. బెడ్‌టైమ్‌కు ముందే డార్క్‌మోడ్‌ ఆన్‌ అవడం, నిద్ర మధ్యలో ఫోన్‌ స్క్రీన్‌ చూసినప్పుడు కంటిపై ఒత్తిడి లేకుండా డల్ లైటింగ్‌ లాంటి ఫీఛర్లు ఉండనున్నాయి.

ఆండ్రాయిడ్ 13లో యూజర్ల ప్రైవసీ కోసం పర్మిషన్ యాక్సెస్‌ల విషయంలో కొత్త మార్పు రాబోతోంది. కొత్తగా ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే పూర్తి మీడియా లైబ్రరీ యాక్సెస్‌ ఇవ్వకుండా యూజర్‌ తనకు నచ్చిన మీడియా ఫైల్‌కు మాత్రమే యాక్సెస్‌ ఇచ్చేలా ప్రైవసీని అప్‌డేట్ చేశారు. మొబైల్ వాడేటప్పుడు ఒకచోట నుంచి టెక్స్ట్ కాపీ చేసి మరోచోట పేస్ట్ చేస్తుంటారు. కాపీ చేసిన వివరాలు క్లిప్‌బోర్డ్‌లో స్టోర్ అవుతుంటాయి. క్లిప్ బోర్డ్ సేకరించిన ఆ సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేయకుండా ఆండ్రాయిడ్ 13లో క్లిప్‌బోర్డ్‌ హిస్టరీ కొంత సమయం తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యేలా అప్‌డేట్ చేశారు. ఆండ్రాయిడ్ 13లో డీఫాల్ట్ నోటిఫికేషన్ల బెడద ఉండదు. యాప్‌లు యూజర్‌ మొబైళ్లకు నోటిఫికేషన్‌ పంపాలంటే వారి అనుమతి తప్పనిసరి.

ఆండ్రాయిడ్ 13 ద్వారా మొబైల్‌ను ల్యాప్‌టాప్‌కు ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌కు ల్యాప్‌టాప్‌ నుంచే రిప్లై ఇవ్చొచ్చు. అలాగే ఫోన్‌లో చూస్తున్న కంటెంట్‌ ట్యాబ్‌లోకి ఈజీగా పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13లో రాబోతున్న 'కాపీ కంటెంట్' ఫీచర్‌తో వెబ్‌ యూఆర్‌ఎల్‌, ఫొటో, టెక్ట్స్‌, వీడియోలను ఫోన్‌ నుంచి ట్యాబ్‌కు, ట్యాబ్‌ నుంచి ఫోన్‌కు ఈజీగా కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13తో ఒకేసారి రెండు పనులు సులభంగా చేసుకోవచ్చు. టాస్క్‌బార్‌ సాయంతో అన్ని యాప్‌లను ఒకేచోట చూడొచ్చు. ఇందులోని స్ల్పిట్‌ స్క్రీన్‌ ఆప్షన్‌తో యాప్‌లను సులువుగా డ్రాగ్ అండ్ డ్రాప్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ముందుగా గూగుల్ పిక్సెల్‌ యూజర్లకు వస్తుంది. ఆ తర్వాత శాంసంగ్‌, షావోమి, మోటోరోలా, వన్‌ప్లస్‌, ఒప్పో, రియల్‌మీ, వివో, లాంటి ఇతర మొబైల్స్‌కు అందుబాటులోకి రానుంది.

First Published:  22 Aug 2022 8:12 AM IST
Next Story