Telugu Global
Business

Gold Rates | బంగారం ధర 'ధగధగ'.. అయినా పుంజుకున్న సేల్స్.. కారణాలివేనా..!

Gold Rates | బంగారం అంటే చైనీయులు.. భార‌తీయుల‌కు ఎంతో ఇష్టం. భార‌తీయ మ‌హిళ‌లైతే బంగారం అంటూ ప్రాణం పెడ‌తారు. వీలైతే పండుగ‌లు, పెండ్లిండ్లు, శుభ‌కార్యాల‌కు బంగారం కొనుక్కోవాల్సిందే.

Gold Rates | బంగారం ధ‌ర `ధ‌గ‌ధ‌గ` అయినా పుంజుకున్న సేల్స్ కార‌ణాలివేనా..!
X

Gold Rates | బంగారం ధ‌ర `ధ‌గ‌ధ‌గ` అయినా పుంజుకున్న సేల్స్ కార‌ణాలివేనా..!

Gold Rates | బంగారం అంటే చైనీయులు.. భార‌తీయుల‌కు ఎంతో ఇష్టం. భార‌తీయ మ‌హిళ‌లైతే బంగారం అంటూ ప్రాణం పెడ‌తారు. వీలైతే పండుగ‌లు, పెండ్లిండ్లు, శుభ‌కార్యాల‌కు బంగారం కొనుక్కోవాల్సిందే. వీలు కాక‌పోతే ఉన్న బంగారం ఆభ‌ర‌ణాలు ధ‌రిస్తారు. కానీ భార‌తీయుల అవ‌స‌రాల్లో దాదాపు 99% విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిందే. గ్లోబ‌ల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు.. అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ నిర్ణ‌యాలు.. అమెరికా- చైనా ఉద్రిక్త‌త‌లు, ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం.. త‌దిత‌ర అంశాలు.. డాల‌ర్ విలువ‌పై ప్ర‌భావం చూపుతుంది. డాల‌ర్ విలువ పెరిగినా.. త‌గ్గినా.. ద్ర‌వ్యోల్బ‌ణం త‌దిత‌ర ప‌రిణామాలకు అనుగుణంగా బంగారం ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంది. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ఆల్‌టైం రికార్డు ధ‌ర ప‌లికిన బంగారం.. ఇప్పుడు తులం (24 క్యార‌ట్లు) రూ.60 వేల వ‌ద్ద త‌చ్చాడుతోంది. ప‌సిడి ధ‌ర `ధ‌గ‌ధ‌గ‌` మెరుస్తుండ‌టంతో వినియోగ‌దారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు.

ఆల్‌టైం రికార్డు ధ‌ర‌ల‌తో మెరుస్తుండ‌టంతో కస్ట‌మ‌ర్లు కొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం జ్యువెల్ల‌రీ రిటైల్ నెట్‌వ‌ర్క్‌లు నెల‌వారీ పేమెంట్ స్కీమ్‌లు తీసుకొచ్చాయి. వాయిదాల‌పై డిస్కౌంట్ రూపంలో డిపాజిట‌ర్ల‌కు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు త‌నిష్క్.. ప‌ది నెల‌ల స్కీమ్‌లో తొలి వాయిదాలో 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. రీజ‌న‌ల్ రిటైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌లు నెల‌వారీ డిపాజిట్ స్కీమ్‌లు అమ‌లు చేస్తున్నాయి. ఫ‌లితంగా బంగారం ఆభ‌ర‌ణాల విక్ర‌యాలు పెరిగిపోతున్నాయి. కొన్ని అతిపెద్ద జ్యువెల్ల‌రీ రిటైల్ నెట్‌వ‌ర్క్‌ల ప‌రిధిలో 50 శాతానికి పైగా సేల్స్ న‌మోద‌య్యాయి. బంగారం కొనుక్కోవాల‌ని భావించే వారు కొన్ని నెల‌ల పాటు ప్ర‌తి నెలా కొద్ది మొత్తం జ్యువెల్ల‌రీ దుకాణాల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం కార్లు మొద‌లు ఇండ్లు.. గాడ్జెట్ల వ‌ర‌కూ ఈఎంఐ ఆప్ష‌న్ మాదిరిగా అన్న‌మాట‌.

టాటా స‌న్స్ ఆధీనంలోని త‌నిష్క్ గ‌తేడాది (2021-22) డిపాజిట్ స్కీం ద్వారా రూ.2,701 కోట్ల విలువైన బంగారం విక్ర‌యిస్తే.. ఈ ఏడాది (2022-23)లో 44 శాతం పెరిగి రూ.3,890 కోట్ల‌కు పెరిగింది. రిల‌య‌న్స్ రిటైల్ రూ.184 కోట్ల నుంచి రూ.282 కోట్ల‌కు పెరిగాయి.

పుణె కేంద్రంగా ప‌ని చేస్తున్న పీఎన్‌జీ జ్యువెల్ల‌ర్స్.. మ‌హారాష్ట్ర‌, గోవాల్లో 42 స్టోర్లు ఆప‌రేట్ చేస్తున్న‌ది. 2021-22 సేల్స్‌తో పోలిస్తే 2022-23లో 27 శాతం పెంచుకుని రూ.700 కోట్ల విలువైన బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించింది. కోల్‌క‌తాకు చెందిన సెన్సో గోల్డ్ 2021-22తో పోలిస్తే 89 శాతం వృద్ధితో రూ.192 కోట్ల విలువైన జ్యువెల్ల‌రీ ఆభ‌ర‌ణాలు సేల్ చేసింది.

`బంగారం జ్యువెల్ల‌రీ ఆభ‌ర‌ణాల కొనుగోలు స్కీంపై కొవిడ్‌-19 ప్ర‌భావం చూపింది. కానీ, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో 50 శాతం సేల్స్ పుంజుకున్నాయి` అని త‌నిష్క్ అనుబంధ టైటాన్ కో జ్యువెల్ల‌రీ సీఈఓ అజొయ్ చావ్లా చెప్పారు. గ‌తేడాది బంగారం ఆభ‌ర‌ణాల కొనుగొలు ప్లాన్ కింద 19 శాతం విక్రయాలు జ‌రిగితే ఈ ఏడాది 21 శాతానికి చేర‌తాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు.

పీఎన్జీ జ్యువెల‌ర్స్ మొత్తం సేల్స్‌లో 20 శాతం ఈ `జ్యువెల్ల‌రీ ప‌ర్చేజ్ స్కీం` కొనుగోళ్లేన‌ని ఆ సంస్థ చైర్మ‌న్ సౌర‌భ్ గాడ్జిల్ చెప్పారు. ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్రారంభంలో బంగారం కొనుగోళ్ల‌కు వెనుకాడుతార‌ని, కానీ ఆ ధ‌ర‌లు భ‌రించేందుకు ముందుకు వ‌స్తున్నార‌న్నారు. ప్ర‌స్తుత ఫెస్టివ్ సీజ‌న్‌లో `బంగారం ప‌ర్చేజ్ స్కీమ్‌` భారీ సంఖ్య‌లో డిపాజిట్లు ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.

2021తో పోలిస్తే 2022లో బంగారం కొనుగోళ్లు స్వ‌ల్పంగా 2.9 శాతం త‌గ్గాయి. 2021లో 797.3 ట‌న్నుల బంగారం కొనుగోళ్లు జ‌రిగితే 2022లో 774 ట‌న్నుల‌కే ప‌రిమితమైంద‌ని ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) పేర్కొంది. ధ‌ర‌లు ధ‌గ‌ధ‌గ‌మ‌ని మెరుస్తుండ‌టంతో ఈ ఏడాది బంగారం డిమాండ్ ప‌ది శాతం త‌గ్గుతుంద‌ని, మూడేండ్ల క‌నిష్ట స్థాయికి చేరుతుంద‌ని డ‌బ్ల్యూజీసీ అంచ‌నా వేసింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో తులం బంగారం (24 క్యార‌ట్లు) రూ.55,300 ధ‌ర పలికితే.. అమెరికా బ్యాంకుల సంక్షోభంతో మార్చిక‌ల్లా రూ.60వేల మార్క్‌కు చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం స‌ర్దుబాట్ల‌తో రూ.59,200 వ‌ద్ద త‌చ్చాడుతున్నది బంగారం ధ‌ర‌. మార్కెట్‌లో అనిశ్చిత ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని టైటాన్ కో జ్యువెల్ల‌రీ సీఈఓ అజొయ్ చావ్లా చెప్పారు. గ‌తంలో ఏడాది పొడ‌వునా బంగారం కొనుగోళ్లు చేసేవార‌న్నారు. ప్ర‌స్తుతం అక్ష‌య తృతీయ, ఓనం, ధంతేరాస్‌, దుర్గా పూజ‌, పిల్ల‌ల పెండ్లిండ్ల స‌మ‌యంలో మాత్ర‌మే బంగారం కొనుగోళ్లు చేస్తున్నార‌న్నారు.

First Published:  25 Sept 2023 7:30 AM GMT
Next Story