Gold Rate | మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కొనుక్కొనేందుకు ఇదే సరైన టైం?!
Gold Rate | భారతీయులకు బంగారం ఎంతో ఇష్టం.. అందునా మహిళలు బంగారం ఆభరణాలంటే ప్రాణం పెడతారు. పెండ్లిండ్లు.. కుటుంబ వేడుకలు.. పండుగలు.. శుభకార్యాలకు వీలుంటే పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశ పడతారు.
Gold Rate | భారతీయులకు బంగారం ఎంతో ఇష్టం.. అందునా మహిళలు బంగారం ఆభరణాలంటే ప్రాణం పెడతారు. పెండ్లిండ్లు.. కుటుంబ వేడుకలు.. పండుగలు.. శుభకార్యాలకు వీలుంటే పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశ పడతారు. సాధ్యం కాకుంటే ఉన్న ఆభరణాలనే ధరించడానికి మొగ్గు చూపుతారు. అంతే కాదు ఇప్పుడు బంగారం మెరుగైన రిటర్న్స్‌కు పెట్టుబడి మార్గం కూడా.. గత రెండు మూడు నెలలుగా ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన బంగారం ధరలు పది రోజులుగా దిగి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారట్ల బంగారం ధర రూ.57,280 పలుకుతున్నది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.54,550లకే లభిస్తున్నది. గత నెల 31తో పోలిస్తే తులం బంగారం ధర రూ.3,470 వరకు తగ్గింది.
గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం భారతీయులకు పవిత్రమాసం. వచ్చే శుక్రవారం (25 ఆగస్టు) వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటారు. పెండ్లిండ్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుక్కోవాలని భావించే వారికి మంచి అవకాశం.మూడు నెలల క్రితం అంటే మే నెలలో బంగారం ధరలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. గత నెలలోనూ సామాన్యుడికి అందనంత గరిష్ట స్థాయిలోనే సాగింది. గత నెల ఒకటో తేదీన 22 క్యారట్ల బంగారం ధర రూ.54,150 (తులం) పలికినా, 24 క్యారట్ల బంగారం తులం మాత్రం రూ.59,070 వద్ద నిలిచింది. గత నెల 31న 22 క్యారట్ల బంగారం రూ.55,250కి, 24 క్యారట్ల బంగారం రూ.60,280 వరకూ పెరిగింది. జూలై 20న రూ.60,750 (24 క్యారట్ల బంగారం తులం) పలికింది. అంటే గత నెలలో 2.05 శాతం ధర పెరిగింది.
ఈ నెల ఒకటో తేదీన ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం (తులం) హైదరాబాద్‌లో రూ.55,400 పలికితే, ప్యూర్ బంగారం (24 క్యారట్లు ) తులం రూ.60,440గా నిలిచింది. శుక్రవారం 24 క్యారట్ల బంగరాం తులం రూ.57,280 పలికితే, 22 క్యారట్ల బంగారం రూ.54,550 వద్ద సరిపెట్టుకున్నది.