ట్విట్టర్ కొనుగోలు తర్వాత హారతి కర్పూరంలా హరించుకుపోతున్న మస్క్ సంపద
ఆయన ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో టెస్లా కంపెనీ దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది. వెరసి ఆయన నికర విలువ 70 బిలియన్లకు పడిపోయింది.
ఎందుకో గానీ టెస్లా బాస్ ట్విట్టర్‌ను ఎంతగా ప్రేమించారో.. అది అంతలా పగ పట్టేసింది. ఆది నుంచి అంటే ట్విట్టర్‌ను కొనడానికి ముందు నుంచి కూడా ఎలాన్ మస్క్‌కు అది కలిసి రాలేదు. ఒకే ఒక్క ట్వీట్‌తో కోట్ల రూపాయలను పోగొట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. అయినా కూడా ఎందుకో మస్క్‌కు ట్విట్టర్ అంటే చాలా ఇష్టం. అందుకేనేమో ఏమాత్రం ఆలోచించుకుండా కొనుగోలు చేశారు. ఇక కొనుగోలు తర్వాత ట్విట్టర్ ఇంకా ఇబ్బందికరంగా తయారైంది. ఆయన ఆస్తి హారతి కర్పూరంలా హరించుకు పోవడం ప్రారంభమైంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం 194.8 బిలియన్ డాలర్లు. టెస్లా సంస్థలో ఆయన వాటా 15 శాతం.
అయితే ఇప్పుడు టెస్లాలో మస్క్ వాటాలు క్రమక్రమంగా క్షీణిస్తున్నాయని ఏకంగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ట్విట్టర్‌లో ఆయన భాగస్వామి అయ్యారు. ఏప్రిల్ నాటికి 3 బిలియన్ డాలర్ల విలువ చేసే 9 శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు. అక్కడితో ఆగారా? ఆయన అతి ప్రేమ ట్విట్టర్‌ను పూర్తిగా సొంతం చేసుకునే వరకూ వెళ్లింది. ఏప్రిల్ నెలలోనే ట్విట్టర్‌ని కొనేందుకు బిడ్ వేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఆయన ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో టెస్లా కంపెనీ దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది. వెరసి ఆయన నికర విలువ 70 బిలియన్లకు పడిపోయింది.
ఇక తాజాగా టెస్లాలో స్టాక్ విక్రయాలను మస్క్ ప్రారంభించారు. 4 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. మంగళవారం ట్విట్టర్‌ను కొనుగోలు చేసినవారానికే టెస్లాలో 4 బిలియన్ డాలర్ల స్టాక్‌ను అమ్మేశారు. అంతటితో ఆగారా? తన దృష్టి మొత్తం ట్విట్టర్‌పై పెట్టి టెస్లాను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇన్వెస్టర్లు కంగారుపడ్డారు. మరోవైపు ఇతర ఆటోమోబైల్ కంపెనీలన్నీ టెస్లాకు పోటీగా ఈవీ కార్లను తయారు చేయడం ఆరంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు మరింది ఆందోళన చెంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఆరంభించారు. దీంతో మస్క్ సంపద హారతి కర్పూరంలా హరించుకుపోవడం ఆరంభించిందని తెలుస్తోంది.