Dragon in EV Cars | నాలుగేండ్లలో భారత్‌లో పెట్రోల్ కంటే ఈవీ కార్లు చౌక.. డ్రాగన్ డామినేషన్ ఇలా
Dragon in EV Cars | భూతాప నివారణకు కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.
Dragon in EV Cars | భూతాప నివారణకు కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. పర్సనల్ మొబిలిటీ మొదలు ప్రజా రవాణా వ్యవస్థ వరకూ మొత్తం మొబిలిటీ .. ఆల్టర్నేటివ్ మార్గాల వైపు ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లుతోంది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లో కార్ల మార్కెట్లు శరవేగంగా మారిపోతున్నాయి.
వచ్చే ఏడాదికి యూరప్, 2025కల్లా చైనా, 2026లో అమెరికా, 2027 నాటికి భారత్‌లో పెట్రోల్-డీజిల్ కార్లతో సమానంగా గానీ, తక్కువ ధరకు గానీ ఎలక్ట్రిక్ కార్లు లభిస్తాయని ఎకానమిక్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్నోవేషన్ అండ్ సిస్టమ్ ట్రాన్సిషన్ (ఈఈఐఎస్‌టీ) నివేదిక తేల్చేసింది. 2030 నాటికి మొత్తం కార్లు, వాహనాల్లో 90 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే విక్రయించాలని చైనా టార్గెట్ నిర్దేశించుకున్నది.
భారత్‌లో ఏడాదిలో మూడు రెట్లు.. 2030 నాటికి మూడింట రెండొంతులవే..
భారత్‌లో కేవలం ఏడాది కాలంలోనే 0.4 శాతం నుంచి 1.5 శాతానికి అంటే మూడు రెట్లు ఈవీ కార్ల విక్రయాలు పెరిగాయని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్ ప్రొఫెసర్ మీమీ ఎల్లీన్ లామ్ పేర్కొన్నారు. వచ్చే మూడేండ్లలో ప్రపంచ దేశాల్లో ఈవీ కార్ల కొనుగోళ్లు మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. 2030 నాటికి బ్యాటరీ ఖర్చు తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఆధారిత వాహనాల కంటే ఈవీ వెహికల్స్ చౌక ధరలకు లభిస్తాయి.
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో 2030 నాటికి ఈవీ కార్లు మూడింట రెండొంతుల వాటా ఎలక్ట్రిక్ వాహనాలదేనని అమెరికాకు చెందిన రాకీ మౌంటేన్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఎంఐ), బెజోస్ ఎర్త్ ఫండ్ పేర్కొన్నాయి. ఈ దశకం మధ్యలో భారీ సంఖ్యలో పెట్రోలియం ఆధారిత వాహనాలను స్క్రాప్ కింద అమ్మేస్తారని ఆర్ఎంఐ, బెజోస్ ఎర్త్ ఫండ్ అంచనా వేశాయి.
2030కల్లా ప్రపంచ గ్లోబల్ మార్కెట్లో వచ్చే మార్పులివే..
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఆరు రెట్లు పెరుగుతాయి. కొత్త వాహనాల్లో 62-86 శాతం ఎలక్ట్రిక్ వాహనాలదే ఆధిపత్యం. 2019లో అత్యధిక ముడి చమురు డిమాండ్ ఉంటే, 2030 తర్వాత ఏడాదికి 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురుకు మాత్రమే గిరాకీ ఉంటుంది.
ప్రస్తుతం ఒక కిలోవాట్ బ్యాటరీ 151 డాలర్లు (రూ.12,483.52) నుంచి 60-90 డాలర్లు (సుమారు రూ.4993.41 నుంచి రూ.7490.11)లకు తగ్గుతుంది. ఈ-కార్ల సేల్స్ పెరగడం వల్ల టూ వీలర్స్, బస్సులు, ట్రక్కుల విద్యుద్ధీకరణ ప్రమోషన్ పెరుగుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల్లో చైనా ముందు వరుసలో నిలిచింది. 2030 నాటికి చైనాలో 90 శాతం ఈవీ కార్ల విక్రయం దిశగా అడుగులేస్తున్నది. ప్రస్తుతం విక్రయిస్తున్న కొత్త కార్లలో మూడో వంతు ఈవీ కార్లే.