Telugu Global
Business

హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ ఇంటిపై ఈడీ దాడులు.. పతనమైన హీరో షేర్లు

హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఇంటిపై ఈడీ సోదాల వార్త బయటకు రాగానే కంపెనీ షేర్లు 3 శాతం పతనం అయ్యాయి.

హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ ఇంటిపై ఈడీ దాడులు.. పతనమైన హీరో షేర్లు
X

దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్నది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. హీరో మోటోకార్ప్ చైర్మన్‌పై భారీ ఆరోపణల నేపథ్యంలో ఈడీ కేసు తీవ్రంగా ఉండబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో హీరో మోటార్స్ షేర్ 3 శాతం మేర పతనమైంది.

ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ, గుర్గావ్‌లోని పవన్ ముంజల్ నివాసం, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇప్పటికే ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసులు బుక్ చేసినట్లు తెలుస్తున్నది. పవన్ ముంజల్ సన్నిహితులు ఒకరు ఇటీవల ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో పట్టుబడ్డారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. డీఆర్ఎస్ నుంచి అందిన సమాచారంతో ఈడీ తాజాగా పవన్ ముంజల్ నివాసంపై దాడులు చేస్తోంది.

హీరో మోటోకార్ప్ భారీగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. నిధులను మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి షెల్ కంపెనీల్లో ఒక దాని వ్యవహారం కూడా బయటకు వచ్చింది. దీంతో సదరు కంపెనీతో హీరో మోటోకార్ప్‌కు ఉన్న సంబంధం ఏంటో విచారించాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గతేడాది భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు కూడా హీరో మోటోకార్ప్‌పై వచ్చాయి. అప్పుడే ఐటీ శాఖ కూడా సోదాలు నిర్వహించింది.

హీరో మోటో కార్ప్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు తయారు చేస్తున్న కంపెనీగా రికార్డులకు ఎక్కింది. దాదాపు 20 ఏళ్ల పాటు హీరో ఆధిపత్యాన్ని ఎవరూ తగ్గించలేకపోయారు. ఇటీవల హోండా నుంచి హీరోకు గట్టి పోటీ ఎదురవుతోంది. కాగా, హీరో మోటోకార్ప్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాలో హీరో టూవీలర్స్ అమ్ముడు అవుతున్నాయి.

హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ ఇంటిపై ఈడీ సోదాల వార్త బయటకు రాగానే కంపెనీ షేర్లు 3 శాతం పతనం అయ్యాయి. బీఎస్‌ఈలో ఈ షేరు మధ్యాహ్నానికి 3.45 శాతం నష్టపోయి రూ.3,092.90 వద్ద ట్రేడ్ అవుతోంది. హీరో మోటో కార్ప్ షేర్ ఈ ఏడాది 13.36 శాతం పెరిగింది. కానీ ఒకే రోజు 3 శాతం మేర పతనం కావడం గమనార్హం.

First Published:  1 Aug 2023 3:07 PM IST
Next Story