Jet Airways- Naresh Goyal | మనీ లాండరింగ్ కం బ్యాంకు లోన్ ఫ్రాడ్ కేసు..కటకటాల్లోకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్
Jet Airways- Naresh Goyal | ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ `జెట్ ఎయిర్వేస్` ఫౌండర్ నరేశ్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకుకు రూ.538 కోట్ల లోన్ ఫ్రాడ్ కం మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను శుక్రవారం విచారించారు.
Jet Airways- Naresh Goyal | ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ `జెట్ ఎయిర్వేస్` ఫౌండర్ నరేశ్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకుకు రూ.538 కోట్ల లోన్ ఫ్రాడ్ కం మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను శుక్రవారం విచారించారు. విచారణకు సహాయ నిరాకరణ చేస్తుండటంతో శుక్రవారం అర్ధరాత్రి పొద్దు పోయిన తర్వాత అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు శనివారం ఉదయం నరేశ్ గోయల్‌ను ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌పై గత మే మూడో తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2005 నుంచి ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియంలో కెనరా బ్యాంకు కూడా సభ్యురాలు. నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్, గౌరంగ్ శెట్టి తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా నరేశ్ గోయల్ ఎగవేతకు పాల్పడ్డారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో కెనరా బ్యాంకు పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ నుంచి స్వీకరించిన పత్రాలు, లావాదేవీలపై 2011 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2019 జూన్ 19 వరకు నిర్వహించిన ఫోరెన్సిక్ అడిట్‌లో నిధులు దారి మళ్లించారని తేలిందని కెనరా బ్యాంకు తెలిపింది. తమ బ్యాంకు నిర్వహించిన ఫోరెన్సిక్ అడిట్ నివేదిక 2021లో సబ్మిట్ చేసినట్లు కూడా వెల్లడించింది.
గత జూలైలో ఢిల్లీతోపాటు ముంబైలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జెట్ ఎయిర్వేస్ అడిటర్ రాజేశ్ చతుర్వేది సహా కీలక వ్యక్తుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. భూమి కొనుగోలు, నేవిగేషన్, వివిధ విమానాశ్రయాల్లో సేవల వినియోగం, లీజ్ అద్దెల చెల్లింపునకు సెక్యూరిటీ డిపాజిట్ల కోసం , విమానాల దిగుమతికి అవసరమైన సెక్యూరిటీ పేమెంట్ తదితర పేర్లతో జెట్ ఎయిర్వేస్ రుణాలు తీసుకున్నది. నూతన రూట్లలో విమాన సర్వీసుల నిర్వహణ, బిజినెస్ ప్రమోషన్ తదితర పేర్ల తీసుకున్న రుణాలను కూడా జెట్ ఎయిర్వేస్ ఫౌండర్లు దారి మళ్లించారని సీబీఐ అభియోగం. ఇక 2018 ఏప్రిల్ నుంచి జెట్ ఎయిర్వేస్ నగదు లభ్యత, నిర్వహణా సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది. చివరకు రుణాలు చెల్లించలేక, సర్వీసులు నిర్వహించలేక ఆర్థికంగా చితికిపోయింది జెట్ ఎయిర్వేస్.
బ్యాంకులు నిర్వహించిన ఫోరెన్సిక్ అడిట్‌లో జెట్ ఎయిర్వేస్ తన అనుబంధ సంస్థ జెట్ లైట్ (ఇండియా)కు అడ్వాన్స్, ఇన్వెస్ట్‌మెంట్, రుణాల మాఫీ తదితర పేర్లతో నిధులు దారి మళ్లించిందని తేలింది. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ఖర్చులు, జెట్ లైట్‌లో పెట్టుబడులు, కమిషన్ ఖర్చుల పేరిట నిధులు దారి మళ్లించిందని నిర్ధారణకు వచ్చాయి బ్యాంకులు.
గమ్మత్తేమిటంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ సంస్థ టోపీ పెట్టిన మొత్తం రూ.24,888 కోట్లు. కానీ దివాళా పరిష్కార ప్రక్రియలో జెట్ ఎయిర్వేస్‌ను సొంతం చేసుకున్న జలాన్ కల్‌రాక్ కన్సార్టియం రూ.475 కోట్లు చెల్లించి సంస్థను టేకోవర్ చేసింది. ఇందులో కూడా కొంత మొత్తం సిబ్బంది వేతనాలు, సంస్థ కార్యకలాపాలకే కేటాయించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంకు ఇచ్చిన రుణం రూ.538.6 కోట్లు, సిండికేట్ బ్యాంకు ఇచ్చిన రుణం రూ.190 కోట్లను జెట్ ఎయిర్వేస్ ఫ్రాడ్ చేసిందని 2021 జూలై 29న ఆర్బీఐ ప్రకటించింది.
మరోవైపు, ఎస్ బ్యాంకుతోపాటు విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) కింద మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై నరేశ్ గోయల్‌పై ఈడీ విడిగా కేసు నమోదు చేసింది. ట్రావెల్ ఏజెన్సీని మోసగించారని నరేశ్ అగర్వేల్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.