Telugu Global
Business

సెలవు పెట్టి ఎంజాయ్ చేయండి.. ఆఫీస్ కాల్స్ రావు.. ఎవరైనా కాల్ చేస్తే వారికి రూ.1 లక్ష ఫైన్

ఆఫీసుకు సెలవు పెట్టిన ఉద్యోగికి బాస్ కానీ, తోటి ఉద్యోగులు కానీ పని పేరుతో కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే.. వారికి భారీ జరిమానా విధిస్తారు.

సెలవు పెట్టి ఎంజాయ్ చేయండి.. ఆఫీస్ కాల్స్ రావు.. ఎవరైనా కాల్ చేస్తే వారికి రూ.1 లక్ష ఫైన్
X

ఉద్యోగ బాధ్యతలతో అలసి పోయే వారు కొన్ని రోజులు సెలవు తీసుకొని ఎక్కడికైనా వెళ్లాలనుకుంటారు. ఒక్కోసారి ఏవో ముఖ్యమైన పనుల కారణంగా సెలవు పెట్టి వెళ్తుంటారు. అయినా సరే సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్ నుంచి బాసో, తోటి ఉద్యోగులో కాల్ చేస్తుంటారు. ఆ ఫైల్ ఎక్కడుంది? ఫలానా ప్రాజెక్టు రిపోర్టు సంగతేంటి? అని విసిగిస్తుంటారు. సెలవు పెట్టిన పని కాస్తా పక్కకు పోయి.. రోజంతా ఈ కాల్స్ తోనే సరిపోతుంటుంది. ఒక్కోసారి ఇంటి దగ్గరే ల్యాప్‌టాప్ ఆన్ చేసి పని చేయాల్సి ఉంటుంది. ఇక అలాంటప్పుడు సెలవు పెట్టడం దేనికి అని ఉద్యోగులు అసంతృప్తి చెందుతారు.

ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 తమ కంపెనీ ఉద్యోగుల కోసం అద్బుతమైన పాలసీని తీసుకొని వచ్చింది. ఉద్యోగులు సెలవు పెట్టి ప్రశాంతంగా గడపడానికి ఈ విధానం పనికి వస్తుందని చెబుతోంది. కొత్త పద్దతి ప్రకారం.. ఆఫీసుకు సెలవు పెట్టిన ఉద్యోగికి బాస్ కానీ, తోటి ఉద్యోగులు కానీ పని పేరుతో కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే.. వారికి భారీ జరిమానా విధిస్తారు. డ్రీమ్11 'అన్‌ప్లగ్ పాలసీ' పేరుతో తీసుకొని వచ్చిన ఈ విధానం అమలులోకి వచ్చింది.

అన్‌ప్లగ్ పాలసీ ప్రకారం ఎవరైనా ఉద్యోగి సెలవు పెట్టి ఒక వారం రోజుల పాటు ఆఫీసుకు దూరంగా ఉండవచ్చు. అతను సెలవులో ఉన్నప్పుడు 'డ్రిమ్‌స్టర్' జాబితాలో చేరుస్తారు. డ్రీమ్‌స్టర్ జాబితాలో ఉన్న వారికి ఆఫీసు నుంచి ఈమెయిల్స్, కాల్స్, వాట్సప్ మెసేజెస్ రాకుండా లాగవుట్ చేస్తారు. వాట్సప్ గ్రూప్ నుంచి కూడా అతడిని వారం పాటు దూరం పెడతారు. వర్క్ ఎకో సిస్టమ్ నుంచి ఎవరూ సదరు ఉద్యోగిని సంప్రదించరు. ఒక వేళ ఆఫీసు పని చెప్పి కాల్ చేసినా, మెసేజ్ చేసినా.. వాళ్లకు లక్ష రూపాయల జరిమానా కంపెనీ విధిస్తుంది.

ఈ కొత్త పాలసీ కంపెనీలో పాత ఉద్యోగుల నుంచి కొత్త వారి వరకు ఎవరైనా ఉపయోగించుకోవచ్చని డ్రీమ్11 ఫౌండర్స్ హర్ష్ జైన్, భవిత్ సేథ్ తెలిపారు. ఈ పాలసీ పట్ల ఉద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఉద్యోగులకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని అంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల డ్రీమ్11కు కూడా లాభమే. ఎందుకంటే వారం పాటు ఎంజాయ్ చేసి వచ్చిన వ్యక్తి తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడని కంపెనీ చెబుతోంది.

మరోవైపు ఒక ఉద్యోగి వారం పాటు లేకపోతే ఆ టీమ్ ఎలా పని చేయాలో తెల్సుకుంటుంది. ఒక ఉద్యోగి లేకపోయినా కంపెనీ వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలుసుకునే వీలుంటుంది. అంటే రేపు ఎవరైనా అకస్మాతుగా రాజీనామా చేసినా.. సదరు టీమ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటుంది.

First Published:  31 Dec 2022 10:21 AM IST
Next Story