Telugu Global
Business

Gold Rate | మెరుస్తున్న బంగారం.. నెల రోజుల్లో ప‌సిడి ధ‌ర ఎంత పెరిగిందో తెలుసా..?!

Gold Rate | దేశీయంగా పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో బంగారం ధ‌ర మిల‌మిల మెరుస్తున్న‌ది. అక్టోబ‌ర్ 29న 24 క్యార‌ట్స్ బంగారం తులం ధ‌ర రూ.62,960 వ‌ర‌కూ దూసుకెళ్లింది.

Gold Rate | మెరుస్తున్న బంగారం.. నెల రోజుల్లో ప‌సిడి ధ‌ర ఎంత పెరిగిందో తెలుసా..?!
X

Gold Rate | బంగారం ఉంటే ఇంట్లో మ‌హాల‌క్ష్మి ఉన్న‌ట్లేన‌ని భార‌తీయులు.. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు విశ్వ‌సిస్తారు. అందుకే పండుగ‌లు, కుటుంబ వేడుక‌లు ప్ర‌త్యేకించి పెండ్లిండ్ల‌కు బంగారం, బంగారం ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేస్తుంటారు. ప్ర‌తియేటా దంతేరాస్‌, దీపావ‌ళి, అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా వీలైతే పిస‌రంత బంగారం కొనుగోలు చేస్తారు. ఇప్పుడు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగితే, ద్ర‌వ్యోల్బ‌ణం పుంజుకుంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోతే ప్ర‌తి ఒక్క‌రి ఖ‌ర్చులు పెరుగుతాయి. ద్ర‌వ్యోల్బ‌ణం భారీ నుంచి త‌ప్పించుకోవాలంటే ఆల్ట‌ర్నేటివ్ మార్గాలు అన్వేషించాలి. పెట్టుబ‌డి దారుల నుంచి సాధార‌ణ పౌరులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులూ త‌మ ఆదాయంలో కొంత మొత్తం భ‌విష్య‌త్ కుటుంబ ల‌క్ష్యాల కోసం మ‌దుపు చేస్తుంటారు. పిక్స్‌డ్ డిపాజిట్లు, రియ‌ల్ ఎస్టేట్‌, స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు.

భార‌తీయుల అవ‌స‌రాల‌కు స‌రిప‌డా బంగారం కావాలంటే విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిందే. జాతీయంగా అనిశ్చిత ప‌రిస్థితులు ఎదురైనా, అంత‌ర్జాతీయంగా రాజ‌కీయ‌, భౌగోళిక ఉద్రిక్త‌త‌లు త‌లెత్తినా.. డాల‌ర్ విలువ పెరిగినా, సామాజిక స‌మ‌స్య‌లు ముందుకు వ‌చ్చినా ఇన్వెస్ట‌ర్లు బంగారాన్నే ఆల్ట‌ర్నేటివ్ పెట్టుబ‌డి మార్గంగా భావిస్తారు. ప్ర‌స్తుతం పాల‌స్తీనాలోని హ‌మాస్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌తో బంగారానికి గిరాకీ పెరిగింది. దేశీయంగా పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కావ‌డం వ‌ల్ల‌నూ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర మెరుస్తున్న‌ది. త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో అక్టోబ‌ర్ నెల‌లో తులం బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.3,880 పెరిగింది. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర తులం రూ.58,470 ప‌లికితే, 31న రూ.రూ.62,350ల‌కు చేరుకున్న‌ది. అక్టోబ‌ర్ 29న ఆల్ టైం గ‌రిష్ట స్థాయి రూ.62,960కి దూసుకెళ్లింది. ఇక ఆభ‌ర‌ణాల తయారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.53,600 నుంచి రూ.58,400ల‌కు చేరుకున్న‌ది.

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తులం బంగారం ధ‌ర (24 క్యార‌ట్స్‌) ధ‌ర అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన రూ.58,200 నుంచి రూ.61,850 వ‌ద్ద స్థిర ప‌డింది. అంటే హైద‌రాబాద్‌లో నెల రోజుల్లో రూ.3650 పుంజుకున్న‌ది. ఆభ‌ర‌ణాల త‌యారీలో వాడే 22 క్యారట్ల బంగారం ధ‌ర తులం రూ.53,350 నుంచి రూ.56,700 వ‌ద్ద ముగిసింది. అక్టోబ‌ర్ 29న గ‌రిష్టంగా రూ.62,690 (24 క్యార‌ట్స్‌), రూ.57,400 (22 క్యార‌ట్స్‌) ప‌లికింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

న‌గ‌రం ------ 24 క్యార‌ట్లు (తులం) -- 22 క్యార‌ట్లు (తులం)

ఢిల్లీ ---------- రూ.62,000 ----------- --- రూ.56,850

బెంగ‌ళూరు - రూ.61,850 ------------ -- రూ.56,700

ముంబై ------ రూ.61,850 ------------ -- రూ.56,700

కోల్‌క‌తా ----- రూ.61,850 ------------ -- రూ.56,700

First Published:  1 Nov 2023 10:08 AM IST
Next Story