Telugu Global
Business

Cars- Two Wheeler Sales | కార్లకు క‌లిసొచ్చిన ఫెస్టివ్ గిరాకీ.. సేల్స్‌ల్లో ఆల్‌టైం రికార్డు.. టూ వీల‌ర్స్‌లోనూ డ‌బుల్ డిజిట్

Cars- Two Wheeler Sales | దేశ‌వ్యాప్తంగా పండుగ‌ల సీజ‌న్‌లో కార్లు మొద‌లు టూ వీల‌ర్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పిన కార్ల విక్ర‌యాల జోరు అక్టోబ‌ర్‌లోనూ కొన‌సాగింది.

Cars- Two Wheeler Sales | కార్లకు క‌లిసొచ్చిన ఫెస్టివ్ గిరాకీ.. సేల్స్‌ల్లో ఆల్‌టైం రికార్డు.. టూ వీల‌ర్స్‌లోనూ డ‌బుల్ డిజిట్
X

Cars- Two Wheeler Sales | కార్లకు క‌లిసొచ్చిన ఫెస్టివ్ గిరాకీ.. సేల్స్‌ల్లో ఆల్‌టైం రికార్డు.. టూ వీల‌ర్స్‌లోనూ డ‌బుల్ డిజిట్

Cars- Two Wheeler Sales | దేశ‌వ్యాప్తంగా పండుగ‌ల సీజ‌న్‌లో కార్లు మొద‌లు టూ వీల‌ర్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పిన కార్ల విక్ర‌యాల జోరు అక్టోబ‌ర్‌లోనూ కొన‌సాగింది. గ‌త నెల‌లో కార్లూ, ద్విచ‌క్ర వాహ‌నాల విక్ర‌యాలు రెండంకెల వృద్ధి రేటు న‌మోదు చేశాయి. దంతేరాస్‌, దీపావ‌ళి, కార్తీక పౌర్ణ‌మి పండుగ‌లు ఉండ‌టంతో ఈ నెల‌లోనూ అదే జోరు కొన‌సాగుతుంద‌ని ఇండ‌స్ట్రీ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి 2022 అక్టోబ‌ర్‌తో పోలిస్తే దాదాపు 20 శాతం సేల్స్ పెంచుకున్న‌ది. 2022 అక్టోబ‌ర్‌లో దేశీయంగా 1,40,337 కార్లు అమ్ముడు కాగా, గ‌త నెల‌లో 1,68,047 యూనిట్లు విక్ర‌యించింది. కార్ల త‌యారీలో కీల‌క‌మైన సెమీ కండ‌క్ట‌ర్ల సంక్షోభం త‌గ్గ‌డంతో కార్ల త‌యారీ పుంజుకున్న‌ది. అక్టోబ‌ర్‌లో అత్య‌ధిక స్థాయిలో కార్లు అమ్ముడు కావ‌డ‌మే కాదు.. ఏ ఏడాదిలోనూ, ఏ నెల‌లో న‌మోదు కానంత గ‌రిష్ట స్థాయిలో కార్లు విక్ర‌యించాం అని మారుతి సుజుకి సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్‌) శ‌శాంక్ శ్రీవాత్స‌వ తెలిపారు.

గ‌తేడాది 41.7 శాతం కార్లు అమ్ముడైతే ఈ ఏడాది మార్కెట్‌లో 43 శాతానికి పెంచుకున్న‌ద‌ని శ‌శాంక్ శ్రీవాత్స‌వ చెప్పారు. మొత్తం కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యూవీలు 50.7 శాతం ఉంటే, హ్యాచ్‌బ్యాక్‌లు 29 శాతం ఉన్నాయి. సెడాన్ మోడ‌ల్ కార్లు గ‌తేడాదితో పోలిస్తే 8.1 శాతానికి ప‌డిపోయాయి.

కార్ల విక్ర‌యాల్లో రెండో స్థానంలో ఉన్న హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇటీవ‌ల మార్కెట్‌లో విడుద‌ల చేసిన ఎక్స్‌ట‌ర్‌ మోడ‌ల్ కారుకు భారీ గిరాకీ ఏర్ప‌డింది. గ‌తేడాది అక్టోబ‌ర్ 48,001 యూనిట్లు విక్ర‌యించిన హ్యుండాయ్‌.. ఈ ఏడాది 55,128 కార్లను విక్ర‌యించింది. 2022తో పోలిస్తే 15 శాతం గ్రోత్ న‌మోదు చేసింది. పండుగ‌ల సీజ‌న్‌లో పీక్ స్థాయికి చేరుకున్నాం. కార్ల స‌ర‌ఫ‌రా సాధార‌ణ స్థాయికి చేరుకోవ‌డంతో క‌స్ట‌మ‌ర్ల ఫేవ‌రెట్ కార్ల‌ను స‌కాలంలో డెలివ‌రీ చేసినందుకు సంతోషిస్తున్నాం అని హ్యుండాయ్ మోటార్స్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ త‌రుణ్ గార్గ్ చెప్పారు.

యుటిలిటీ వెహిక‌ల్స్ త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా వ‌రుస‌గా నాలుగో నెల‌లో రికార్డు స్థాయి కార్లు విక్ర‌యించింది. 2022తో పోలిస్తే 35 శాతం గ్రోత్ న‌మోదు చేసింది. 2022లో 32,298 ఎస్‌యూవీ కార్లు విక్ర‌యిస్తే, ఈ ఏడాది 43,708 యూనిట్లు డెలివ‌రీ చేసింది. ఎస్‌యూవీలు, వాణిజ్య వాహ‌నాలు క‌లిపి 32 శాతం వృద్ధి న‌మోదు చేసింది మ‌హీంద్రా. 2022తో పోలిస్తే 80,679 వాహ‌నాలు (కార్లు, వాణిజ్య వాహ‌నాలు) విక్ర‌యించామ‌ని, ఇదే అత్యంత గ‌రిష్టం అని పేర్కొంది. వ‌రుస‌గా మూడో నెల‌లోనూ ఎస్‌యూవీలు, క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ విక్ర‌యించామ‌ని మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఆటోమోటివ్ డివిజ‌న్ ప్రెసిడెంట్ విజ‌య్ న‌క్రా తెలిపారు. గ‌త నెల‌లో 25,715 వాణిజ్య వాహ‌నాల‌ను విక్ర‌యించింది మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా..

దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ ఏడు శాతం గ్రోత్ సొంతం చేసుకున్న‌ది. 2022లో 45,423 కార్లు విక్ర‌యించ‌గా, గ‌త నెల‌లో 48,637 యూనిట్లు విక్ర‌యించింది. మ‌రో కార్ల త‌యారీ సంస్థ ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్ (టీకేఎం) కార్ల సేల్స్ పుంజుకోవ‌డంలో ఫార్చ్యూన‌ర్‌ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. 2022లో 13,143 యూనిట్లు విక్ర‌యించిన ట‌యోటా.. ఈ ఏడాది 20,542 యూనిట్లు విక్ర‌యించింది. కార్ల త‌యారీ సంస్థ‌లన్నీ సేల్స్ పెంచుకుంటే.. జ‌పాన్ కార్ల త‌యారీ సంస్థ హోండా కార్స్ 1.4 శాతం కార్ల విక్ర‌యాలు త‌గ్గాయి. 2022లో 9,543 యూనిట్లు విక్ర‌యిస్తే, గ‌త నెల‌లో 9400 యూనిట్ల‌కు ప‌రిమిత‌మైంది.

ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ‌లూ డ‌బుల్ డిజిట్ గ్రోత్ న‌మోదు చేసుకున్నాయి. హీరో మోటో కార్ప్ గ‌తేడాది 4,42,825 మోటారు సైకిళ్లు, స్కూట‌ర్లు విక్ర‌యిస్తే.. గ‌త నెల‌లో 26.4 శాతం వృద్ధితో 5,59,766 యూనిట్లు విక్ర‌యించింది. టీవీఎస్ మోటార్స్‌, బ‌జాజ్ ఆటో, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సైతం రెండంకెల వృద్ధి న‌మోదు చేసుకున్నాయి.

First Published:  2 Nov 2023 8:22 AM GMT
Next Story