4జీనే పూర్తిగా అందుబాటులోకి రాలేదు.. 5జీలోకి వస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటన
4జీ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎన్ఎన్ఎల్ తెలిపింది. రూ. 26,281 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.
దేశంలో 5జీ సేవలను అందించడానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఇండియా (వీఐ) దూసుకొని పోతున్నాయి. త్వరలో అదానీ కూడా 5జీ కమర్షియల్ సేవలను అందించనున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జీ సేవలనే పూర్తిగా అందుబాటులోకి తీసుకొని రాలేకపోయింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 4జీ సేవలు లేకపోవడంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఇతర టెలికాంల వైపు తరలిపోతున్నారు.
తాజాగా, 4జీ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎన్ఎన్ఎల్ తెలిపింది. రూ. 26,281 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా.. 9 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ బాధ్యతలను కూడా చూడనున్నది. ఇప్పటికే రూ. 10,000 కోట్ల విలువైన ఆర్డర్‌ను టీసీఎస్‌కు ఇవ్వడానికి బీఎస్ఎన్ఎల్ రంగం సిద్ధం చేసింది.
టాటా సన్స్ అనుబంధ తేజస్ నెట్‌వర్క్ ఇండియాలోనే 4జీ నెట్‌వర్క్ కోసం అవసరమైన పరికరాలను తయారు చేయనున్నది. దీంతో ఈ ఏడాది చివరిలోగా లేదంటే 2023 జనవరి నెలాఖరులోగా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ ఏర్పాటు కానున్నది. ఇక 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత 5జీ నెట్‌వర్క్ ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
వచ్చే ఏడాది అగస్టు నాటికి 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ కోసం టీసీఎస్ లక్ష టవర్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక లక్షద్వీప్‌తో పాటు వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో మరో 25వేల టవర్లను ఏర్పాటు చేయనున్నది.