Telugu Global
Business

బీ అలర్ట్: ఓటీపీ అవసరం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బు మాయం

ఓటీపీ అవసరం లేకుండానే మోసగాళ్లు బ్యాంకులనుంచి డబ్బు మాయం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై గుజరాత్ సైబర్ టీమ్ నిఘా పెట్టింది.

Money lost from account without needing OTP
X

ఓటీపీ అవసరం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బు మాయం

వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP)ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి అంటూ బ్యాంకులనుంచి అప్పుడప్పుడు మెసేజ్ లు వస్తుంటాయి. మన బ్యాంక్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ పొరపాటున వేరేవారికి తెలిసినా, మొబైల్ ఫోన్ మన దగ్గరే ఉంటే డబ్బులు కాజేయడం కష్టం అని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నాం. పోలీసులు కూడా ఓటీపీ లేనిదే కేటుగాళ్ల పని పూర్తి కాదని అనుకుంటున్నారు.

కానీ గుజరాత్ లో ఇటీవల జరిగిన సైబర్ క్రైమ్స్ లో ఓటీపీతో పనిలేదని రుజువైంది. అవును, ఓటీపీ అవసరం లేకుండానే మోసగాళ్లు బ్యాంకులనుంచి డబ్బు మాయం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై గుజరాత్ సైబర్ టీమ్ నిఘా పెట్టింది. ఓటీపీ అవసరం లేకుండానే జరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు.

ఎలా చేస్తారు..?

ఓటీపీ లేకుండా డబ్బులు ఎలా మాయం అవుతున్నాయనే విషయం పూర్తి స్థాయిలో తేలలేదు కానీ, వారు అనుసరిస్తున్న విధానంపై మాత్రం పోలీసులు ఓ అవగాహనకు వచ్చారు. ఇటీవల జరిగిన సంఘటనల ప్రకారం ఇంటర్నెట్ బ్యాంక్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ని హ్యాక్ చేస్తే చాలు ఓటీపీ లేకుండానే వారు డబ్బులు కాజేస్తున్నట్టు తేల్చారు. ఇటీవల ఓ బాధితుడు పోలీసులకు చెప్పిన సమాచారం ప్రకారం థర్డ్ పార్టీ ట్రాన్స్ ఫర్ విభాగంలో తనకు తెలియకుండానే బెనిఫిషియరీ యాడ్ అయ్యాడు.

పొరపాటున ఎవరో యాడ్ అయ్యారని అనుకున్నాడు అతడు. ఆ తర్వాతి రోజే అతని అకౌంట్ నుంచి డబ్బు మొత్తం కొత్తగా యాడ్ అయిన బెనిఫిషియరీకి వెళ్లిపోయింది. అప్పుడు లబోదిబోమంటూ బ్యాంకుకి పరిగెత్తితే థర్డ్ పార్టీని యాడ్ చేసింది మీరే కదా అని ప్రశ్నించారు అధికారులు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గుజరాత్ పోలీసులు బాధితుల పేర్లు బయటపెట్టలేదు కానీ ఇలాంటి వరుస ఘటనలతో చాలామంది తమ దగ్గరకు వస్తున్నట్టు తెలిపారు.

ఏం చేయాలి..?

- ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ని వాడేవారు.. అప్పుడప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలి.

- తరచూ ట్రాన్సాక్షన్స్ చేయని అకౌంట్లను బెనిఫిషియరీ లిస్ట్ నుంచి తొలగించాలి.

- తెలియనివాళ్లు ఆ జాబితాలో కనిపిస్తే, వెంటనే వారిని తొలగించి బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

- ప్రతి రెండు వారాలకోసారి పాస్ వర్డ్ మార్చుకోవాలి

- పాస్ వర్డ్ ను ఎక్కడా పేపర్ పై రాయకూడదు, గుర్తుంచుకుంటే చాలు.

ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే సైబర్ క్రైమ్స్ బారిన పడటం కాస్త తగ్గుతుందని అంటున్నారు పోలీసులు. ఓటీపీ ఎవరికీ చెప్పలేదు కదా, మన డబ్బుకి ఢోకా లేదు అనుకుంటే ఇకపై కుదరదన్నమాట. ఓటీపీ లేకుండానే బ్యాంకు ఖాతాల్ని ఖాళీ చేసే కేటుగాళ్లు పుట్టుకొస్తున్నారు జర జాగ్రత్త.

First Published:  12 Jan 2023 10:53 AM IST
Next Story