Telugu Global
Business

బ్యారెల్ రేటు పడిపోయింది.. పెట్రోల్ ధర తగ్గదేం..?

ఎనిమిదేళ్లలో కేంద్రం పెట్రోల్‌ పై 194 శాతం ఎక్సైజ్‌ పన్ను పెంచగా, డీజిల్‌ పై ఏకంగా 512 శాతం పన్ను పెంచింది. ఇవి ప్రతిపక్షం ఆరోపణలు కాదు, పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) లెక్కలు.

బ్యారెల్ రేటు పడిపోయింది.. పెట్రోల్ ధర తగ్గదేం..?
X

ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర ప్రకారమే ఏ దేశంలో అయినా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ రేటు పెరిగితే ఆయా దేశాల్లో ఆయిల్ ధరలు పెరుగుతాయి, తగ్గితే.. దానికి అనుగుణంగా తగ్గుదల కూడా ఉంటుంది. కానీ భారత్ లో మాత్రం పరిస్థితి భిన్నం. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఇక్కడ వినియోగదారుడు మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్ల భారాన్ని మోయాల్సిందే. విచిత్రం ఏంటంటే.. అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ధర పెరిగితే మాత్రం భారత్ లో బాదుడు మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ వచ్చాక ఈ అంతరం మరింత పెరిగిపోయింది. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే మాత్రతం ఇక్కడ తగ్గదు అదీ లెక్క. తాజాగా మరోసారి ఈ విషయం రుజువైంది.

అంతర్జాతీయ మార్కెట్‌ల్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారల్‌ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కంపెనీలు ఏమాత్రం తగ్గించలేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్‌ ధర 92.84 డాలర్లు ఉండగా, గత వారం 90 డాలర్ల దిగువకు పడిపోయింది. కానీ, కంపెనీలు రిటైల్‌ ధరలను తగ్గించకుండా లాభాలు స్వీకరిస్తున్నాయి. ఈ మధ్యకాలం లో క్రూడ్‌ ధర మూడుసార్లు 50 డాలర్ల దిగువకు పడిపోయింది. అయి నా కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించలేదు.. పన్నుల బాదుడు కూడా ఆపలేదు. తగ్గిన ధరల ప్రయోజనాలు ప్రజలకు అందకుండా కేంద్రం దోచేసింది.

దోపిడీ ముఖ్యం..

తక్కువ రేటుకి కొని ఎక్కువరేటుకి అమ్మడం వ్యాపార లక్షణం. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే చేస్తోంది. అయితే కేంద్రం ప్రజలతో వ్యాపారం చేయాలనుకోవడమే ఇక్కడ విపరీత లక్షణం. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి ఏటా ఇంధనంపై ఎక్సైజ్‌ పన్నులు పెంచుతూనే పోయింది కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో మనదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ పై పన్నులు పెంచి రేట్లను సమం చేసేది. ఎనిమిదేళ్లలో కేంద్రం పెట్రోల్‌ పై 194 శాతం ఎక్సైజ్‌ పన్ను పెంచగా, డీజిల్‌ పై ఏకంగా 512 శాతం పన్ను పెంచింది. ఇవి ప్రతిపక్షం ఆరోపణలు కాదు, పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) లెక్కలు.

2014-15 నుంచి 2021-22 మధ్య కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ పై కేంద్ర ప్రభుత్వానికి లెవీ రూపంలో వచ్చే ఆదాయం 186 శాతం పెరిగింది. 2014-15లో పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రానికి లెవీ రూపంలో రూ.1,72,065 కోట్ల ఆదాయం రాగా, 2021-22లో రూ.4,92,303 కోట్లకు పెరిగింది. కేవలం పెట్రోలియం ఉత్పత్తులతోనే ఈ స్థాయి దోపిడీ జరిగితే, ఇతర ఉత్పత్తుల విషయంలో ఎంతెంత దోపిడీ జరిగిందో లెక్కలు తేలాల్సి ఉన్నాయి.

First Published:  12 Sept 2022 1:25 PM IST
Next Story