BOB World App | బీవోబీ వరల్డ్ యాప్ రివార్డుల రచ్చ.. టాప్ మేనేజ్‌మెంట్‌కు ముందే తెలుసా.. అసలేమైంది..?!
BOB World App | బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒక కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఆ బ్యాంకుకూ బీవోబీ వరల్డ్ (BoB World) అనే మొబైల్ యాప్ ఉంది.
BOB World App | బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒక కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఆ బ్యాంకుకూ బీవోబీ వరల్డ్ (BoB World) అనే మొబైల్ యాప్ ఉంది. ఈ బ్యాంకు శాఖ సిబ్బంది తమ బీవోబీ వరల్డ్ యాప్‌లో ఒక రోజు 30 మంది కనెక్షన్లు యాక్టివేట్ చేశారనుకుందాం.. ఆ శాఖ సిబ్బందీ ఖాతాదారులూ సంబురాలు జరుపుకునేందుకు రూ.500 విలువైన కేక్ వస్తుంది. ఒక రీజియన్ పరిధిలో బీవోబీ వరల్డ్ యాప్‌లో 1500 కనెక్షన్లు రిజిస్టర్ అయితే రూ.1000 రివార్డ్ అందుతుంది. ఇలా రోజువారీ టార్గెట్‌ల పూర్తితో మొదలైన నిరపాయకరమైన సంబురాలు.. క్రమంగా నిర్వహణాపరమైన సమస్యలకు దారి తీశాయి. తదుపరి ఇన్సెంటివ్‌లను సొంతం చేసుకోవడానికి సాంకేతిక లోపాలతో అంతా తారుమారు చేసే ప్రయత్నాలు సాగాయి. ఇదంతా బ్యాంక్ సీనియర్ మేనేజ్‌మెంట్ మధ్య `మాటల యుద్దా`నికి దారి తీసింది.
డిజిటల్ హెడ్ అఖిల్ హండా ఉద్వాసన
తమ డిజిటల్ హెడ్ అఖిల్ హండాను తొలగిస్తున్నామని గత శనివారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) దేబదత్తా చంద్ ఆశ్చర్యకరమైన రీతిలో మీడియాకు చెప్పేశారు. బీవోబీ వరల్డ్ నిర్వహణ లోపాలు ఉన్నాయంటూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిందించింది. దాని ఫలితంగా అఖిల్ హండాను సర్వీస్ నుంచి తొలగించామని చెప్పారు. బీవోబీ వరల్డ్ యాప్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో బ్యాంకు మేనేజ్‌మెంట్ పలు అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
రాజీనామా వ్యక్తిగతమన్న అఖిల్ హండా
కానీ, అఖిల్ హండా ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. సుదీర్ఘ కాలంగా వేసుకున్న ప్రణాళికలో భాగంగానే వ్యక్తిగత కారణాల వల్లే బ్యాంకు సర్వీసులకు రాజీనామా చేశానని అఖిల్ హండా మీడియా సంస్థలకు ఏకవాక్య రాజీనామా లేఖను పంపారు. బ్యాంకు నుంచి నా నిష్క్రమణ పూర్తిగా నా వ్యక్తిగతం. ఆగస్టులోనే నేను టాప్ మేనేజ్‌మెంట్‌కు చెప్పేశాను. నాటి నుంచి నేను నోటీస్ పీరియడ్‌లో ఉన్నా. బ్యాంకు శాఖల స్థాయిలో జరిగిన నిర్వహణా లోపాలను తప్పుదోవ పట్టించడానికే నాకు ఉద్వాసన పలికినట్లు కథ అల్లినట్లు కనిపిస్తున్నది అంటూ అఖిల్ హండా.. విడిగా ప్రకటన జారీ చేశారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణుడి వాదన ఇదీ
పూర్ సెక్యూరిటీతో రూపుదిద్దుకున్న బీవోబీ వరల్డ్ యాప్ సిస్టమ్‌ను ఉద్యోగులు, థర్డ్ పార్టీ ఉద్యోగులు ఇన్సెంటివ్‌లు సంపాదించడానికి `గేమింగ్`కు ఉపయోగించుకున్నారని విమర్శలు వినిపించాయి. ఇది ఇరువైపులా కీలక పాత్ర పోషించారని ఈ అంశంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులు చెప్పారు. బ్యాంకు యాప్‌లో సాంకేతిక లోపం లేకపోతే ఇలా.. ఇన్సెంటివ్ కోసం యాప్‌తో గేమింగ్ చేయడం అసాధ్యం అని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు చెప్పారు.
యాప్‌లో లోపం బయటపడిందిలా..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు తమ బీవోబీ వరల్డ్ యాప్‌లో నమోదైన రిజిస్ట్రేషన్లను పెంచి చూపుతున్నారని గత జూలై 11న అల్ జజీరా ఓ వార్తాకథనం ప్రచురించింది. కొన్ని బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా బీవోబీ వరల్డ్ యాప్‌తో లింక్ చేస్తున్నారని ఆ వార్తా కథనం సారాంశం. తమ బ్యాంకు అధికారులు అటువంటి కార్యకలాపాల్లో నిమగ్నం కాలేదంటూ ఆ మరునాడే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన చేసింది. `బ్యాంకు యాప్ బీవోబీ వరల్డ్ మూడు కోట్ల మంది ఖాతాదారులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వారంతా తమ బ్యాంకు ఖాతాతో అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను యాప్‌కు లింక్ చేశారు` అని బ్యాంకు పేర్కొంది. 5.3 కోట్ల సార్లు బీవోబీ వరల్డ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోగా, రోజువారీగా 40 లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్నారని, ప్రతి రోజూ 80 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతాయని అంతకు ముందు 2023-మార్చిలో ఓ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించింది.
అంతర్గత సర్క్యులర్‌లో హెచ్చరికలు
బీవోబీ వరల్డ్ యాప్‌లో మోసపూరిత కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆల్ జజీరాలో వార్తాకథనం వచ్చిన రెండు వారాల్లో అంటే గత జూలై 26న బ్యాంకు శాఖలకు బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్ మేనేజ్మెంట్ అంతర్గత సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. బీవోబీ వరల్డ్ యాప్ ఆర్థిక లావాదేవీలు మోసపూరితంగా ఉన్నాయంటూ, యూజర్ల సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారంటూ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ)లు.. ఈ-మెయిల్‌లో షేర్ చేయడం వల్ల లీక్ కావడంతో మోసపూరిత లావాదేవీలకు దారి తీస్తుందని తెలిపింది. అంతేకాదు.. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని బ్యాంకు ఆఫ్ బరోడా హెడ్‌క్వార్టర్స్‌లో గల డిజిటల్ గ్రూప్ ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఈ-మెయిల్ బేస్డ్ ఓటీపీలు, ఎస్ఎంఎస్‌ల తొలగింపుపై దృష్టి పెట్టాలని ఈ సర్క్యులర్ పేర్కొంది. దీన్ని బట్టి.. `బీవోబీ వరల్డ్`లో మోసపూరిత ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న సంగతి బ్యాంకు ప్రధాన మేనేజ్‌మెంట్‌కు తెలుసునని అవగతమవుతున్నది.
సిబ్బందీ.. బిజినెస్ కరస్పాండెంట్లు కుమ్మక్కయ్యారా..?
బ్యాంకు మొబైల్ యాప్ బీవోబీ వరల్డ్ రూపకల్పనలో లోపాలను కనిపెట్టిన ఉద్యోగులు, బిజినెస్ కరస్పాండెంట్లు డబ్బు సంపాదించుకునేందుకు చేతులు కలిపారని ఒకరిద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులే ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు. ఒక బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ నంబర్‌ను పలు బ్యాంకు ఖాతాలను లింక్ చేయడం ఈ యాప్‌లో ప్రాథమిక లోపం అని వారిద్దరి వాదన. బిజినెస్ కరస్పాండెంట్లు తమ సిమ్‌ను సాధారణ వ్యాపార లావాదేవీల్లో ఎనిమిది ఖాతాలకు అనుసంధానించవచ్చు. ఒకే ఫోన్ నంబర్‌పై 100-200 యాక్టివేషన్లు చేయొచ్చు. కానీ, అసాధారణ రీతిలో అధిక యాక్టివేషన్లు నమోదైనప్పుడు మొబైల్ యాప్ నుంచి రెడ్ సిగ్నల్స్ రావాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.
కస్టమర్లూ.. బిజినెస్ కరస్పాండెంట్లకు ఇలా..
కానీ, బీవోబీ వరల్డ్ యాప్ యాక్టివేషన్ల ప్రక్రియ.. సంబురాలు కేక్ కటింగ్‌తోనే ఆగలేదు. గత ఫిబ్రవరి 28న బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిటల్ గ్రూప్ స్వయంగా తమ బీవోబీ వరల్డ్ యాప్‌లో మూడు కోట్ల యాక్టివేషన్లు సాధించడమే లక్ష్యం అని ప్రకటించింది. ఇందుకోసం గత మార్చి ఒకటో తేదీ నుంచి 31 వరకూ కస్టమర్లు, బిజినెస్ కరస్పాండెంట్లకు ఇన్వైట్ అండ్ ఎర్న్ ఇన్‌స్టంట్ అనే విధానానికి బ్యాంకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కానీ ఉద్యోగులు దీనికి అర్హులు కారంటూ మెలిక పెట్టింది. కస్టమర్లు, బిజినెస్ కరస్పాండెంట్లు చేసే ప్రతి యాక్టివేషన్‌కు రూ.10 సంపాదించుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్లు కేవలం ఖాతాదారుల నుంచి అవసరమైన పత్రాలు, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీస్ మాత్రమే పూర్తి చేస్తారు. కానీ, వారు స్వతంత్రంగా మొబైల్ యాప్ (బీవోబీ వరల్డ్)లో మొబైల్ ఫోన్ నంబర్లు రిజిస్టర్ చేయలేరు. బ్యాంకు శాఖ ఉద్యోగులే ఈ పని చేయాల్సి ఉంటుంది.
ఆర్బీఐ నిషేధాజ్ఞలు ఇలా..
బీవోబీ వరల్డ్ యాప్‌లో ఏదో జరుగుతున్నదని ఉప్పందడంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అలర్టయింది. బీవోబీ యాప్‌లో తదుపరి ఖాతాదారుల రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించింది. తదనుగుణంగా బ్యాంకు ఆఫ్ బరోడా అంతర్గత చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే అఖిల్ హండా ఉద్వాసనకు గురయ్యారని బ్యాంక్ మేనేజ్‌మెంట్ చెబుతున్నది. అంతే కాదు తొమ్మిది మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటువేసింది. మరికొందరిపై దర్యాప్తు నిర్వహిస్తున్నది.
ఇలా ఆగస్టు 25న మరో సర్క్యులర్ జారీ
గత ఆగస్టు 25న బ్యాంకు ఆఫ్ బరోడా మరో సర్క్యులర్ జారీ చేసింది. అహ్మదాబాద్, బరేలీ, బరోడా, బెంగళూరు, భోపాల్, జైపూర్, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాజ్‌కోట్ జోనల్ ఆఫీసు అధిపతులకు ఈ సర్క్యులర్ షేర్ చేశారు. 68 శాఖల పరిధిలో 362 ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, ఈ ఖాతాల నుంచి రూ.22 లక్షలపైగా నగదు డెబిట్ అయిందని పేర్కొంది. శనివారం మీడియాతో మాట్లాడిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేబదత్తా చంద్ మాట్లాడుతూ బీవోబీ వరల్డ్ యాప్ వివాదం వల్ల బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై ఎటువంటి ప్రభావం చూపలేదన్నారు. కానీ బీవోబీ యాప్ పలుకుబడి దెబ్బతిన్నదని, దాన్ని గణించడం కష్ట సాధ్యం అని ఆర్థిక, సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.