Bank of Baroda | కస్టమర్లకు బ్యాంక్ బరోడా బోనంజా.. ఇండ్ల నుంచి విద్యా రుణాల వరకూ ఆకర్షణీయ వడ్డీపై రుణాలు.. ఇంకా.. !
Bank of Baroda | భారతీయులు శుభకార్యాలకు గానీ, పండుగలకు గానీ ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు. జీవిత కాల స్వప్నం ఇల్లు.. కాకుంటే పిసరంత బంగారం కొంటూ ఉంటారు.
Bank of Baroda | భారతీయులు శుభకార్యాలకు గానీ, పండుగలకు గానీ ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు. జీవిత కాల స్వప్నం ఇల్లు.. కాకుంటే పిసరంత బంగారం కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు.. కార్లు సొంతం చేసుకునే వారు ఎక్కువయ్యారు. గత నెలాఖరులో ఓనం వేడుకలతో దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు మొదలు ఆటోమొబైల్ కంపెనీలు.. బ్యాంకులు సైతం తమ ఖాతాదారుల కోసం ఆకర్షణీయ ఆఫర్లు తెఉస్తున్నాయి. ఆ బాటలోనే పయనిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB).
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) `బీవోబీ కే సాంగ్ త్యోహార్ కీ ఉమాంగ్` అనే పేరుతో ఫెస్టివ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇది 2023 డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుంది. సొంతింటి కల సాకారం చేసుకునే వారి కోసం ఆకర్షణీయ వడ్డీరేట్లకే ఇండ్ల రుణాలు మొదలు కార్లు, పర్సనల్ రుణాలు, విద్యా రుణాలు అందిస్తోంది.
డెబిట్.. క్రెడిట్ కార్డులపై ఆఫర్ల వర్షం ఇలా
ఇంటిరుణం, కార్లు, వ్యక్తిగత, విద్యారుణాలతోపాటు నాలుగు కొత్త సేవింగ్స్ ఖాతాలనూ తెరుస్తున్నది బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB). తన ఖాతాదారుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫెస్టివ్ ఆఫర్ల కింద డిస్కౌంట్లు అందించేందుకు దేశంలోనే పేరొందిన ఎలక్ట్రానిక్ సంస్థలు, కన్జూమర్ డ్యూరబుల్స్, ఫ్యాషన్, పర్యాటక సంస్థలు, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్ స్టైల్, గ్రాసరీ, ఫుడ్ డెలివరీ సంస్థలతోపాటు ఆరోగ్య రంగ సంస్థలతోనూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇండ్లు, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
పండుగల సీజన్‌లో 8.40 శాతం వడ్డీకే ఇండ్ల రుణాలు అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. అంతే కాదు 8.70 శాతం అంతకంటే వడ్డీపై అందించే కార్ల రుణాలపైనా ప్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేసింది.
విద్యా రుణాలపై వడ్డీ తగ్గింపు
ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకునే విద్యార్థులకు తీపి కబురు అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. 8.55 శాతంతో మొదలయ్యే రుణాలపై 60 బేసిక్ పాయింట్ల డిస్కౌంట్ అందిస్తున్నది. దేశీయంగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందేందుకు ఎటువంటి హామీ పత్రాలు లేకుండానే రుణాలు అందిస్తున్నది.
పర్సనల్ లోన్‌పై వడ్డీ రాయితీ.. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
పర్సనల్ లోన్లు తీసుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా బంఫర్ ఆఫర్ అందిస్తున్నది. 10.10 శాతంతో మొదలయ్యే రుణాలపై 80 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గిస్తున్నది. రూ.20 లక్షల వరకూ రుణంపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. రుణాలపై ఫిక్స్‌డ్ వడ్డీరేట్ల ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది. వ్యక్తిగత, కార్ల రుణ గ్రహీతలు ఫిక్స్‌డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేట్లను ఎంచుకోవచ్చు. ఇక మార్టగేజ్ ఆధారిత లోన్ల ప్రాసెసింగ్ కోసం దేశవ్యాప్తంగా వివిధ నగరాల పరిధిలో 112 రిటైల్ అసెట్ ప్రాసెసింగ్ సెంటర్లు (ఆర్ఏపీసీ) ఏర్పాటు చేసింది.
ఫ్యామిలీ కోసం కొత్తగా నాలుగు సేవింగ్స్ ఖాతాలు..
ఖాతాదారులకు లబ్ధి చేకూర్చేందుకు నాలుగు కొత్త సేవింగ్స్ ఖాతాలు తెరిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎన్నారైలతోపాటు కుటుంబ సభ్యులందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. అందుకోసం లైఫ్‌టైమ్ నో మినిమం బ్యాలెన్స్ అకౌంట్ - బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్, 16 ఏండ్ల నుంచి 25 ఏండ్లలోపు విద్యార్థుల కోసం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, కుటుంబ సభ్యులందరి అవసరాల కోసం మై ఫ్యామిలీ మై బ్యాంక్, బీవోబీ పరివార్ అకౌంట్, ఎన్నారైల కోసం బరోడా ఎన్నారై పవర్ ప్యాక్ అకౌంట్ తెచ్చింది. అంతే కాదు రికరింగ్ డిపాజిట్ స్కీం- బీవోబీ ఎస్‌డీపీ (సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్) ఆవిష్కరించింది. ఫెస్టివల్ పీరియడ్‌లో ఈ సేవింగ్స్ అకౌంట్లపై విస్తృత శ్రేణి బెనిఫిట్లు, రాయితీలు లభిస్తాయి.