అమెజాన్‌లో 10వేల మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం!
Amazon Plans To Lay Off 10,000 Employees: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. రాబోయే వారంలో రోజుల్లో 10వేల మంది ఉద్యోగులను తొలగించడానికి యాజమాన్యం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ట్విట్టర్‌తో మొదలైన ఈ తొలగింపు మెటా, డిస్నీలను దాటి ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వరకు చేరింది. అమెరికన్ కంపెనీలకు మాంద్యం దెబ్బ పడటంతో.. ఖర్చులు తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక టాప్ అఫిషియల్స్‌తో పాటు సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించి వేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ట్విట్టర్ పక్కన పెట్టింది. ఇక ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా దాదాపు 11 వేల మందిని తొలగించింది. డిస్నీ కూడా తమకు ఉన్న 1,90,000 మంది ఉద్యోగుల్లో చాలా మందిని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. రాబోయే వారంలో రోజుల్లో 10వేల మంది ఉద్యోగులను తొలగించడానికి యాజమాన్యం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్ మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10 వేల మందిని పలు కారణాలతో ఇంటికి పంపనున్నారు. ఈ ప్రక్రియ దశల వారీగా తర్వాత కూడా కొనసాగుతుందని యాజమాన్యం తెలిపింది.
రిటైల్, హెచ్ఆర్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మరి కొందరి ఉద్యోగాలకు కోత పడనున్నది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు తగ్గడం, ఆర్థిక మాంద్యం, అంచనాలకు అనుగుణంగా ఆదాయం లేకపోవడం వంటి కారణాలతోనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ప్రస్తుతానికి 10 వేల మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నారని, వారిలో భారత కార్యాలయానికి చెందిన వారు కూడా ఉన్నట్లు పేర్కొన్నది.
కార్పొరేట్ దిగ్గజాలు తొలగిస్తున్న ఉద్యోగుల్లో అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న వాళ్లు కూడా భారీగా ఉన్నారు. వీరు కనుక ఉద్యోగం పోగొట్టుకుంటే 60 రోజుల్లోగా కొత్త జాబ్ వెతుక్కోవాలి. ఆలోగా ఉద్యోగం రాకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళనలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లో మరికొన్ని కార్పొరేట్లు కూడా ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.