ఎయిర్ ఇండియాకు కొత్త లోగో.. ఈ నెల 10న ఆవిష్కరణ
ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి ఎయిర్ ఇండియాకు రెడ్ కలర్‌లో ఉండే హంస.. దానిపై ఆరెంజ్ కలర్‌లో కోనార్క్ చక్రం ఉంది.
ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. ఇప్పుడు ఆ సంస్థకు పూర్తి మేకోవర్ చేయాలని నిర్ణయించుకున్నది. టాటా గ్రూప్‌లోని సంస్థల లోగోలకు, వాటి కలర్స్‌కు దగ్గరగా ఉండేలా దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. ఇక పాత లోగో స్థానంలో కొత్త లోగోను కూడా తయారు చేసింది. ఈ కొత్త లోగోను ఈ నెల 10న జరుగనున్న ఒక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.
ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి ఎయిర్ ఇండియాకు రెడ్ కలర్‌లో ఉండే హంస.. దానిపై ఆరెంజ్ కలర్‌లో కోనార్క్ చక్రం ఉంది. కాగా, కొత్త లోగోలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. విమానయాన సంస్థ అభివృద్ధిని సూచించేలా లోగో ఉండబోతోంది. లోగోతో పాటే విమానం లోపల డిజైన్‌తో పాటు సిబ్బంది యూనిఫాంలో కూడా మార్పులు చేయనున్నది.
ఎయిర్ఇండియాను హస్తగతం చేసుకున్న తర్వాత.. ఈ విమానయాన సంస్థ టాటా గ్రూప్‌లో నిరుడు జనవరిలో అక్విజిషన్ పూర్తి చేసుకున్నది. టాటా సన్స్ 100 శాతం వాటాను ఈ సంస్థలో కలిగి ఉన్నది. టలేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఎయిరిండియాను కొనుగోలు చేశారు. కాగా.. ఎయిర్ ఇండియా, విస్తారాతో పాటు టాటా సన్స్‌కు చెందిన మరో సబ్సిడరీని కలిపి ఒక భారీ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. 2024 మార్చిలోగా ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుందని టాటా గ్రూప్ వర్గాలు చెప్పాయి. కొత్తగా ఏర్పడే సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25 శాతం వాటా ఉండబోతోంది.
చౌక ధరల విమాన సర్వీసుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏసియా ఇండియాను కూడా విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తున్నది. కొత్త లోగో రూపకల్పన, రీబ్రాండింగ్ కోసం లండన్‌కు చెందిన ఫ్యూచర్ బ్రాండ్స్ అనే సంస్థతో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నది. డిసెంబర్ 2022 నుంచే ఈ సంస్థ ఎయిర్ ఇండియా రీ బ్రాండింగ్, ఇతర విషయాలపై పని చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులకు ఒక అంతర్గత ఈ-మెయిల్ పంపారు. ఎయిర్ ఇండియా రీ బ్రాండింగ్‌తో పాటు అనేక కొత్త సేవలను కూడా అందించనున్నట్లు అందులో పేర్కొన్నారు. లోగో మార్పు, విమానాల లోపలి మార్పు, కొత్త యూనిఫాం వంటి వివరాలను ఉద్యోగులకు తెలియజేశారు.
ఇప్పటి వరకు మహారాజా మాస్కట్ ఉండగా.. కొత్తగా ఫీమేల్ మాస్కట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, మహారాజా మాస్కట్ 1946 నుంచి ఎయిర్ ఇండియాకు ఒక సింబల్‌గా ఉంది. దీన్ని ఆర్టిస్ట్ ఉమేశ్ రావు, బాబీ కూకా రూపొందించారు. ఎయిర్ ఇండియా ప్రారంభమైన దగ్గర నుంచి ఈ మాస్కట్ ఇప్పటి వరకు ఛేంజ్ కాలేదు.