రూ.20వేల కోట్ల విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకున్న అదానీ గ్రూప్
ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఓడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.
అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఇటీవల జారీ చేసిన ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మార్కెట్ నుంచి రూ.20,000 కోట్లను సమీకరించే ఉద్దేశంతో ఎఫ్‌పీవోను ఆఫర్ చేసింది. దీని షేర్ ఫేస్ వాల్యూ ఒక్కొక్కటీ రూ.1. సోమవారం చివరి రోజు సదరు ఎఫ్‌పీవో 112 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. చివరి రోజు వరకు రిటైలర్లు కేవలం 5 శాతం మాత్రమే కొనుగోలు చేయగా.. అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ భారీగా షేర్లు కొని అదానీని ఆదుకుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ షేర్లు దారుణంగా పతనం అవుతూ వస్తున్నాయి. దీని ప్రభావం ఎఫ్‌పీవోపై కూడా పడింది. ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినా.. దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఓడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.
ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లిస్తామని సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపులో మంచి ట్రాక్ రికార్డు ఉందని ఆయన పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ఇప్పటికే అదానీ గ్రూప్ స్టాక్ ఎక్ఛేంజిలకు తెలియజేసింది. బుధవారం కంపెనీ షేర్ 28.5 శాతం క్షీణించి రూ.2,128 వద్ద ముగిసింది.
కాగా, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌లోని పలు సబ్సిడరీల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఈ గ్రూప్‌కు చెందిన లక్షల కోట్లు ఆవిరయ్యాయి. నివేదికకు ముందు ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 12వ స్థానానికి పడిపోయాడు. ఇలాంటి సమయంలో ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి రూ.20వేల కోట్లు సేకరించి తమ అప్పులను కాస్త తగ్గించుకోవాలని భావించినా.. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ ప్రణాళికలను తారుమారు చేసింది.